ట్రాక్టర్‌ను ఢీకొన్న లారీ
కడప అర్బన్: కడప–కమలాపురం రహదారిలోని ఎయిర్‌పోర్టు సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ట్రాక్టర్‌ను లారీ ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. కమలాపురం మండలం తురకపల్లె గ్రామానికి చెందిన ఆంజనేయులు తన కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు దాదాపు 20 మంది చింతకొమ్మదిన్నెలోని గంగమ్మ జాతరలో మొక్కులు తీర్చుకునేందుకు ఆదివారం ఉదయం ట్రాక్టర్‌లో బయలుదేరి వెళ్లారు. అక్కడ మొక్కు తీర్చుకుని విందు భోజనాలు ఆరగించారు. మధ్యాహ్నం తిరుగు ప్రయాణమయ్యారు. సంఘటన స్థలానికి చేరుకునే సరికి వెనుకవైపు నుంచి ట్రాక్టర్‌ను లారీ వేగంగా వచ్చి ఢీకొనడంతో బోల్తా పడింది. ట్రాక్టర్‌లోని ప్రయాణికులంతా చెల్లాచెదురుగా ఎగిరిపడ్డారు. ఏం జరిగిందో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రమాదం జరిగిన కొంతసేపటికి అటుగా వెళుతున్న వాహనదారులు 108కు సమాచారం అందించారు. 108 వాహనాలు వచ్చి క్షతగాత్రులను రిమ్స్‌కు తరలించారు. వీరిలో తురకపల్లె గ్రామానికే చెందిన పలవల సుబ్రమణ్యం (17) రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గాయపడిన వారిలో గంగయ్య, ఆంజనేయులు, సుబ్బమ్మ, హరిప్రసాద్, సాయి కీర్తన, జగదీష్,ఈశ్వరమ్మ, అంజనమ్మ, అంజనాదేవి, రామాంజనేయులు అలియాస్ ఆంజనేయులు, వేణుగోపాల్, చౌడమ్మ, నాగలక్ష్మి, శ్రీరాములు, సునీత, గంగిరెడ్డి, జైపాల్‌రెడ్డి, అయ్యవార్లు ఉన్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సంఘటనా స్థలానికి రూరల్ సీఐ బీవీ శివారెడ్డి, వన్‌టౌన్ సీఐ టీవీ సత్యనారాయణ, ఎస్‌ఐలు, సిబ్బంది చేరుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.