వ్యవసాయ మార్కెట్లో విచారణ చేపట్టిన సీబీఐ అధికారులు
-
జమ్మికుంట సీసీఐ కొనుగోళ్లలో వెలుగు చూసిన అవినీతి
-
అక్రమార్కుల అరెస్ట్‌కు రంగం సిద్ధం
జమ్మికుంట : జమ్మికుంట మార్కెట్‌లో సీసీఐ పత్తి కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ తుది దశకు చేరుకుంది. ఈ వ్యవహారంలో పలుమార్లు విచారణ చేసిన అధికారులు తుదినివేదికను తయారుచేశారు. సీసీఐ అధికారులు వ్యాపారులతో కలిసి అక్రమదందాను కొనసాగించినట్లు సీబీఐ విచారణలో గుర్తించినట్లు తెలిసింది. ఏడాదిన్నర పాటు జరిగి విచారణ తుది దశకు చేరినట్లు సమాచారం. అధికారులు త్వరలో అక్రమార్కులను అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
క్షేత్రస్థాయిలో విచారణ..
2015 పిబ్రవరిలో హైకోర్టు ఆదేశాలతో సీసీఐ కొనుగోళ్లపై విచారణకు ప్రారంభించిన సీబీఐ అధికారుల పలుమార్లు విచారణ జరిపారు. ఏడేళ్ల పాటు జరిగిన కొనుగోళ్లలో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పత్తిని విక్రయించిన రైతుల వివరాలు సేకరించారు. రైతులు సాగుచేసిన భూములు, సీసీఐకి విక్రయించిన పత్తి వివరాలను అడిగితెలుసుకున్నారు. బ్యాంక్ ఖాతా బుక్కులు, సీసీఐ చెక్కులు, పట్టదారు పాసు పుస్తకాలు, పహణీ పత్రాలు, సీసీఐ రిజిస్టర్ సంతకాలు, తక్‌పట్టిలను పరిశీలించారు. గ్రామాల్లో కొందరు వ్యవసాయం లేకున్న సీసీఐకి పత్తిని విక్రయించినట్లు అధికారులు గుర్తించారు. రైతుల పేరుతో కొందరు ఆడ్తిదారులు బ్యాంకుల్లో ఖాతాలు తెరచి డబ్బులు డ్రా చేసుకున్నట్లు విచారణలో బయటపడింది. సీసీఐ కొనుగోళ్లలో బీనామి రైతుల దందా జరిగినట్లు సీసీఐ చెల్లింపుల వివరాలతో అధికారులు నివేదిక తయారచేశారు.
భయందోళనలో అక్రమార్కులు..
పత్తి కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడిన వారిని సీబీఐ అరెస్ట్‌లు చేస్తుందనే ప్రచారం జరుగుతుండటంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. ఏడేళ్ల నుంచి పని చేసిన మార్కెటింగ్ శాఖ అధికారులు ఎవరేవరికి సంబంధాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. ఏడేళ్లలో మద్దతు ధరల్లో రైతులను దగా చేయడంలో ఎంత వరకు చేతుల మారాయి. ఏవరేవరికి ఎంత వాట ముట్టింది అనే విషయాలపై సీబీఐ వివరాలను సేకరించింది. అక్రమాలకు పాల్పడిన వారి నుంచి డబ్బులు ఎలా వసూలు చేస్తారు విషయం ఆసక్తిగా మారింది.