రైతులపై విరిగిన లాఠీ
రైతులపై విరిగిన లాఠీ
Published Fri, Oct 7 2016 11:16 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
- పరిహారం కోసం కదంతొక్కిన కర్షకులు
- ఓర్వకల్ నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్ర
- కలెక్టరేట్‌లోనికి దూసుకెళ్లేందుకు యత్నం
- లాఠీలకు పనిచెప్పిన పోలీసులు
కర్నూలు(అగ్రికల్చర్): నష్ట పరిహారం కోసం ఆందోళన చేస్తున్న సోలార్ బాధిత రైతులపై పోలీసులు విరుచుక పడ్డారు. లాఠీలతో చితక బాదారు. ఒక మహిళతో సహా నలుగురు గాయపడడంతో కలెక్టరేట్ వద్ద శుక్రవారం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.ఓర్వకల్లు మండలం గని, శకునాల గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న సోలార్ పవర్ ప్లాంట్ వల్ల భూములు కోల్పోతున్న రైతులు పరిహారం కోసం కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్నారు. శుక్రవారం ఈ రెండు గ్రామాలో రైతులతో పాటు దేవనూరు, సున్నంపల్లి, బ్రాహ్మణపల్లి, తిప్పాయిపల్లి గ్రామాల రైతులు కలిశారు. సోలార్ పవర్ ప్లాంట్ భూనిర్వాసితుల కమిటీ ఆధ్వర్యంలో ఓర్వకల్లు నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్రగా వచ్చారు. వందల మంది రైతులు కలెక్టరేట్‌లోకి దుసుకెళ్లేందుకు యత్నింగా..పోలీసులు మెయిన్‌గేటు మసివేశారు. ఆగ్రహించిన రైతులు గేట్లు ఎక్కి కలెక్టర్ చాంబర్‌వైపు పరుగులు తీశారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతోపాటు లాఠీలు ఝుళిపించారు.
మొయిన్‌గేటు దాటేంతవరకు రైతులను తరిమారు.లాఠీ దెబ్బలకు నాగన్న, రామకృష్ణ, హుసేన్, రాములమ్మలు గాయపడ్డారు. లాఠీచార్జ్‌కి భయపడి పరుగులు తీయడంతో కొందరు కింద పడి స్వల్ప గాయాలపాలయ్యారు. అనంతరం రైతు సంఘాల ప్రతినిధుల ఆధ్వర్యంలో రైతులు మెయిన్‌గేటు దగ్గర బైఠాయించారు. జిల్లా కలెక్టర్ వచ్చి స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్‌గౌడ్ వచ్చి హామీనిచ్చినా రైతులు అంగీకరించలేదు. కలెక్టర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జీవనాధారమైన సాగు భూములను లాక్కొని పరిహారం ఇవ్వకపోతే వారు ఎలా బతకాలని రైతులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు షడ్రక్ మాట్లాడుతూ.. గని, శకునాల గ్రామాల్లో సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులందరికి 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రయివేటు భూములతో సమానంగా ప్రభుత్వం నుంచి పట్టాలు పొంది సాగు చేసుకుంటున్న భూములకు పరిహారం ఇవ్వాలన్నారు. సాగులో లేరనే సాకుతో ప్రభుత్వ పట్టా భూములకు నష్టపరిహారం ఇచ్చేందుకు నిరాకరించడం దారుణమన్నారు. రైతు సంఘాల నేతలు రమేష్, నాగేశ్వరరావు, సోమన్న, వెంకటరాముడు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement