లావణ్య మళ్లీ అరెస్టు
కర్నూలు: జిల్లా పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేసిన లావణ్యను బియ్యం స్వాహా కేసులో రెండో సారి పోలీసులు అరెస్టు చేశారు. ప్రజాపంపిణీ ద్వారా పేదలకు అందించాల్సిన సబ్సిడీ సరుకులను డీలర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు కుమ్మక్కై నల్ల బజారుకు తరలించి సొమ్ము చేసుకున్నారు. శ్రీశైలానికి చెందిన చౌక డిపో డీలర్ చెరుకూరి మల్లికార్జున లావణ్యతో కలసి ఈ స్కామ్‌కు తెర తీసిన సంగతి తెలిసిందే. నేషనల్ ఇన్‌ఫర్మేటిక్ సెంటర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అజయ్‌కుమార్ పాండేను కూడా పోలీసులు అరెస్టు చేసి కటకటాలకు పంపారు. కర్నూలు నగరంలోని అశోక్‌నగర్‌కు చెందిన లావణ్య ఎన్‌ఐసీ కార్యాలయంలో పనిచేస్తున్న స్వప్న డీలర్లతో కుమ్మక్కై స్కామ్ వ్యవహారాన్ని నడిపించారు. ఒక్కొక్క డీలర్ నుంచి రూ.10 వేలు అడ్వాన్స్, రూ.5 వేలు మామూళ్ల కింద ఒప్పందం కుదుర్చుకుని 2016 ఏప్రిల్ నుంచి జులై దాకా బోగస్ వ్యవహారాన్ని నడిపించారు. ఈ కేసును మొదట సీసీఎస్ పోలీసులు దర్యాప్తు చేసి అందుకు బాద్యులైన లావణ్య, అజయ్‌కుమార్ పాండేలను అరెస్టు చేశారు. బెయిల్‌పై నుంచి విడుదల కాగానే రెండో సారి అర్బన్ ఏఎస్‌ఓ ఫిర్యాదు మేరకు ఒకటవ పట్టణ సీఐ కృష్ణయ్య వారిని పాతబస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద అరెస్టు చేశారు. వారిపై ఐపీసీ 409, 420, ఐటీ ఆక్ట్ 66 కింద కేసు నమోదు చేసి కటకటాలకు పంపినట్లు తెలిపారు.