అదుపుతప్పిన శాంతిభద్రతలు
Published Thu, Jul 21 2016 11:26 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
– ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్‌స్టేషన్ల సమీపంలోనే హత్యలు
– డీజీపీ సొంత జిల్లాలో ప్రశ్నార్థమైన లా అండ్ ఆర్డర్
– జిల్లా వ్యాప్తంగా పోలీసుల నిర్లిప్తత
– ఎస్పీ రాజశేఖర్‌బాబు బాధ్యతలు తీసుకుని నేటితో రెండేళ్లు పూర్తి
(సాక్షి ప్రతినిధి, అనంతపురం) :
2015 మార్చి 31 : తాడిపత్రి నియోజకవర్గం పెద్దవడుగూరు మండలం కిష్టిపాడులో సింగిల్‌విండో అధ్యక్షుడు, వైఎస్సార్‌సీపీ నేత విజయభాస్కర్‌రెడ్డిని సొసైటీ కార్యాలయంలోనే టీడీపీ నేతలు హత్య చేశారు.
–2015 ఏప్రిల్ 29 : రాప్తాడు తహశీల్దార్ కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ మాజీ మండల కన్వీనర్ ప్రసాదరెడ్డిని హæత్య చేశారు.
–2016 జూలై 21 : అనంతపురం నాలుగో పట్టణ æపోలీసుస్టేషన్‌కు కూతవేటు దూరంలో గోపీనాయక్, వెంకటేశ్‌నాయక్‌లను హతమార్చారు.
ఈ మూడు సంఘటనలే కాదు...టీడీపీ అధికారం చేపట్టిన తర్వాత ‘అనంత’లో తరచూ ఎక్కడో ఒకచోట హత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకూ 8 హత్యలు జరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష పార్టీలో చురుకైన నేతలు, కార్యకర్తలను తుదముట్టడించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. తద్వారా జిల్లాలో రాజకీయ ప్రత్యర్థులను బలహీనపరిచి 2019 ఎన్నికల్లో లబ్ధి పొందేలా ఇప్పటి నుంచే ‘అరాచక ప్రణాళిక’ను రచించారు. ఇందుకు పోలీసులను పావులుగా వాడుకుంటున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. సున్నిత ప్రాంతాలను గుర్తించి శాంతిభద్రతలు అదుపు తప్పకుండా చర్యలు తీసుకోవడంలో పోలీసు యంత్రాంగం విఫలమైందని ప్రతిపక్ష పార్టీ నేతలతో పాటు పరిశీలకులు విమర్శిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు, అధికారపార్టీ నేతలు చెప్పినట్లే పోలీసులు నడుచుకుంటున్నారన్న విమర్శలున్నాయి. ఈ వైఖరితో ప్రతిపక్షపార్టీ శ్రేణులతో పాటు సామాన్యప్రజలకూ ఇబ్బందులు తప్పడం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఎస్పీ మృదు స్వభావమే కొంప ముంచుతోందా?
ఎస్పీ రాజశేఖర్‌బాబుకు మృదుస్వభావిగా పేరుంది. దీన్ని ఆసరాగా తీసుకుని ఆయన కిందనున్న కొందరు కీలక పోలీసు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. చాలా సర్కిళ్లలో సీఐలు, ఎస్‌ఐలను ఎమ్మెల్యేలు సిఫార్సు చేసినవారినే నియమించినట్లు తెలుస్తోంది. దీంతో మంత్రి/ఎమ్మెల్యే అండ ఉంటే చాలని, ఎవ్వరు అడ్డొచ్చినా తన ‘సీటు’ పదిలమనే ధీమాతో కొందరు సీఐలు, ఎస్‌ఐలు పనిచేస్తున్నారు. ఉన్నతాధికారులను సైతం బైపాస్ చేసి వెళుతున్నారు. పేకాట, మట్కా, క్రికెట్‌బెట్టింగ్‌లు జరుగుతున్నా కొందరు పోలీసులు పట్టించుకోవడం లేదు. ఇంకొంతమంది స్టేషన్లలో స్థలవివాదాలతో పాటు పంచాయితీలు చేస్తున్నారు. ఎస్పీ దృష్టికి వచ్చిన ఘటనలపై ఆయన తక్షణ చర్యలు తీసుకుంటున్నా.. దృష్టికి రానివి మాత్రం చాలానే ఉన్నాయి.
ఇటీవల వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన రైతుభరోసా యాత్రలో పామిడి సీఐ నరేంద్రరెడ్డి వ్యవహారశైలిపై విమర్శలు వెల్లువెత్తాయి. గ్రామస్థాయి టీడీపీ నేతలు రోడ్డుపై ఆందోళనకు సిద్ధమవుతున్నారని తెలిసి ప్రతిపక్షనేత కాన్వాయ్‌ని ముందుకు వెళ్లకుండా నరేంద్రరెడ్డి అడ్డుపడ్డారు. ‘గ్రామస్థాయి లీడర్లు ఆందోళన చేస్తే వారిని అదుపు చేయకుండా.. ప్రతిపక్షనేత కాన్వాయ్‌ను ఆపడమేంటని’ వైఎస్సార్‌సీపీ నేతలు ప్రశ్నిస్తే...‘గ్రామస్థాయి అయినా, మండలస్థాయి అయినా వారు అధికారంలో ఉన్నారు.
అధికారంలో ఉన్నవారికి, లేనివారికి తేడా ఇలాగే ఉంటుంది’ అంటూ అధికార పార్టీకి తాము అనుకూలంగా వ్యవహరిస్తున్నామన్న విషయాన్ని కుండబద్దలు కొట్టారు. ఈ ఒక్క ఉదాహరణ చాలు రెండేళ్లుగా పోలీసులు ఎలా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవడానికి. ప్రభుత్వాలు ఐదేళ్లకోసారి మారతాయి. కానీ పోలీసుల పనితీరును ప్రజలు నిత్యం గమనిస్తూనే ఉంటారు. మొత్తం మీద ఎస్పీ రెండేళ్లలో కొన్ని వినూత్న, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి మంచిపేరు తెచ్చుకున్నా, శాంతిభద్రతల పరిరక్షణలో మాత్రం వెనుకబడ్డారనే భావన ప్రజల్లో నెలకొంది.
Advertisement