
భూవివాదమే ప్రాణం తీసింది
♦ వీడిన న్యాయవాది ఉదయ్‌కుమార్ హత్య మిస్టరీ
♦ కత్తితో మెడపై పొడిచి చంపిన వైనం
♦ అనంతరం మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి దహనం
♦ నిప్పంటించేక్రమంలో గాయపడిన నిందితుడు
♦ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లోకేష్
♦ అతడికి సాయం చేసిన ఒకరి అరెస్టు
♦ వివరాలు వెల్లడించిన డీసీపీ రాంచంద్రారెడ్డి
కలకలం రేపిన న్యాయవాది ఉదయ్‌కుమార్(45) హత్య కేసు మిస్టరీ వీడింది. అందరూ ఊహించినట్టు గానే భూతగాదాల నేపథ్యంలోనే హత్య జరిగిందని నిర్ధారించారు. కత్తితో పొడిచి చంపిన నిందితుడు మృతదేహానికి నిప్పంటించే క్రమంలో గాయపడ్డాడు. ప్రస్తుతం అతడు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. అతడికి సాయం చేసిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
కీసర: కలకలం రేపిన న్యాయవాది ఉదయ్‌కుమార్(45) హత్య మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఊహించినట్లుగానే భూతగాదాల నేపథ్యంలోనే హత్య జరిగిందని నిర్ధారించారు. కత్తితో పొడిచి చంపిన నిందితుడు మృతదేహానికి నిప్పంటించే క్రమంలో గాయపడ్డాడు. ప్రస్తుతం అతడు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడికి సాయం చేసిన మరో వ్యక్తిని పోలీసులు రిమాండుకు తరలించారు. కేసుకు సంబంధించిన వివరాలను సోమవారం కీసర ఠాణాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్కాజిగిరి డీసీపీ రాంచంద్రారెడ్డి, పేట్‌బషీరాబాద్ ఏసీపీ రఫీక్, కీసర సీఐ గురువారెడ్డితో కలిసి వెల్లడించారు. కాప్రా సర్కిల్ ఆఫీసర్స్ కాలనీకి చెందిన ఉదయ్‌కుమార్, జగదీశ్వరి దంపతులు.
ఉదయ్‌కుమార్ ఓ సీనియర్ న్యాయవాది వద్ద పనిచేస్తూ మల్కాజిగిరి కోర్టు బార్ అసోసియేషన్ సభ్యుడిగా కొనసాగుతున్నాడు. ఉదయ్‌కుమార్ తండ్రి నకులుడు ఆర్మీలో పనిచేసి కొన్నేళ్ల క్రితం రిటైర్డ్ అయ్యాడు. ఆయనకు సర్కార్ జవహర్‌నగర్ పరిధిలోని చెన్నాపురంలో ఐదెకరాల పొలం కేటాయించింది. మాజీ సైనికుల భూమికి సంబంధించి కోర్టులో కేసు నడుస్తోంది. జవహర్‌నగర్‌కు చెందిన ఆంజనేయులు న కులుడి భూమిని లీజుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. ఈ భూమిపై అతడి మేనల్లుడు గుంటూరుకు చెందిన లోకేష్(23) కన్నేశాడు. ఎలాగైనా సదరు భూమిని సొంతం చేసుకోవాలని పథకం వేశాడు. ఈక్రమంలో నకులుడికి రూ. 25 లక్షలు ఇచ్చి పొలాన్ని నోటరీ చేయించుకున్నాడు.
ఈవిషయం తెలుసుకున్న ఉదయ్‌కుమార్ దానికి అంగీకరించలేదు. డబ్బులు తిరిగి ఇచ్చేస్తాం.. మా భూమి ఇవ్వాలని అతడు పట్టుబట్టాడు. ఈవిషయమై ఇరువర్గాలకు గొడవలు జరుగుతున్నాయి. శనివారం మధ్యాహ్నం తన మారుతీ కారులో వెళ్లిన ఉదయ్‌కుమార్ తిరిగి రాలేదు. ఆయనకు భార్య, తండ్రి తదితరులు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు. ఇదిలా ఉండగా, ఆదివారం ఉదయం కీసరదాయర గ్రామశివారులో కారులో కాలిపోయిన ఉదయ్‌కుమార్ మాంసపుముద్దగా కనిపించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. భూవివాదాల కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఈమేరకు సుమన్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ జరుపగా వివరాలు వెలుగుచూశాయి.
ఇలా చంపేశాడు..
ఉదయ్‌కుమార్ శనివారం మధ్యాహ్నం తన పొలం వద్దకు చేరుకోగానే అక్కడే ఉన్న లోకేష్ ఎందుకొచ్చావని అతడిని ప్రశ్నించాడు. ఈక్రమంలో వాగ్వాదం జరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన లోకేష్ తనతో తెచ్చుకున్న పదునైన కత్తితో మెడపై పొడిచాడు. కిందపడిన ఉదయ్‌కుమార్‌పై రెండుమూడు కత్తిపోట్లు పొడవడంతో చనిపోయాడు.
అనంతరం సుమన్‌రెడ్డిసాయంతో మృతదేహాన్ని కారులో వేశాడు. పెట్రోల్ కొనుగోలు చేసిన లోకేష్ కారును కీసర దాయర శివారుకు తీసుకెళ్లాడు. పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈక్రమంలో అతడు కూడా గాయపడ్డాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లి గాంధీ ఆస్పత్రిలో చేరాడు. నిందితుడి బైకును స్వాధీనం చేసుకున్నామని డీసీపీ రాంచంద్రారెడ్డి తెలిపారు. లోకేష్ కోలుకున్నాక అరెస్టు చేసి హత్యకు వాడిన కత్తిని స్వాధీనం చేసుకుంటామని చెప్పారు.
భూమాఫియా హస్తం..?
న్యాయవాది ఉదయ్‌కుమార్ హత్యలో ల్యాండ్ మాఫియా హస్తం ఉందని మల్కాజ్‌గిరి బార్ అసోషియేషన్ సభ్యులు ఆరోపించారు. సోమవారం కీసర పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న వారు ఈమేరకు డీసీపీ రాంచంద్రారెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు. ఉదయ్‌కుమార్ హత్య కేసులో భూమాఫియా ఉన్నదని, కొందరు పెద్దలు హస్తం ఉందని, వారు తప్పించుకునేందుకు యత్నిస్తున్నారని, వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు.