అంబేద్కర్ విగ్రహం వద్ద బంద్ నిర్వహిస్తున్న ఎమ్మెల్యే నారాయణస్వామి, భూమన కరుణాకరరెడ్డి, పార్టీ నాయకులు
చిత్తూరు జిల్లాలో ఎక్కడికక్కడ అరెస్టులు
Published Wed, Aug 3 2016 12:35 AM | Last Updated on Tue, May 29 2018 4:26 PM
– బంద్ విఫలయత్నానికి సర్కారు కుట్ర
– 11 గంటల వరకూ డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు
– స్వచ్ఛందంగా బంద్ పాటించిన ప్రై వేట్ స్కూళ్లు
సాక్షి ప్రతినిధి, తిరుపతి :
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్సార్‌సీపీ మంగళవారం తలపెట్టిన బంద్‌ను విఫలం చేసేందుకు ప్రభుత్వం విశ్వప్రయత్నం చేసింది. పోలీసులను అడ్డం పెట్టుకుని ఆందోళన చేస్తోన్న వైఎస్‌ఆర్‌సీపీ, వామపక్ష పార్టీల నేతలను ఎక్కడికక్కడ అరెస్టులు చేయించింది. సాయంత్రం 5 గంటల వరకూ నేతలను పోలీస్ స్టేషన్లలోనే నిర్భందించారు. తిరుపతిలో ఆందోళన చేస్తోన్న వైఎస్సార్‌సీపీ మహిళా కార్యకర్తలపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డిని అరెస్టు చేసే క్రమంలో అడ్డు తగిలిన మహిళా నాయకులు, కార్యకర్తలపై నిర్దయగా వ్యవహరించారు. పోలీసుల ఓవరాక్షన్ కారణంగా మహిళల చీరలు చిరిగాయి. కొంతమంది చేతులకు గాయాలయ్యాయి. శాంతారెడ్డి అనే మహిళ మంగళసూత్రం తెగి కింద పడింది. ఇకపోతే వైఎస్సార్‌సీపీ నేతలను అరెస్టు చేయడంలోనూ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. తిరుపతిలో కరుణాకర్‌రెడ్డితో పాటు జిల్లాపార్టీ అధ్యక్షుడు, గంగాధరనెల్టూరు ఎమ్మెల్యే నారాయణస్వామిని బలవంతంగా అరెస్టు చేసి వాహనంలో ఎక్కించి రేణిగుంట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తంబళ్లపల్లి నియోజకవర్గం అంగళ్లులో బంద్‌కు నేతత్వం వహిస్తోన్న ఎంపీ మి«థున్‌రెడ్డి, పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గాయత్రీదేవిలను పోలీసులు అరెస్టు చేశారు. పీలేరు, మదనపల్లిల్లో ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, దేశాయ్ తిప్పారెడ్డిలను కూడా బలవంతంగా అరెస్టు చేశారు. పుంగనూరులో బంద్ నిర్వహిస్తోన్న తంబళ్లపల్లి నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌రెడ్డిని, తిరుపతి యూనివర్సిటీలో బంద్‌కు నేతృత్వం వహించిన విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు హరిప్రసాదరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. బంద్‌కు మద్దతు పలికి ప్రతక్షంగా బంద్‌కు సహకరిస్తోన్న సీపీఐ, సీపీఎం నాయకులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు, సీపీఎం జిల్లా కార్యదర్శి కుమార్‌రెడ్డిలను కూడా అరెస్టు చేసి ఎంఆర్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. జిల్లా అంతటా పోలీసులు 1000 మందికి పైగా అరెస్టు చేసి, సాయంత్రం విడుదల చేసినట్లు సమాచారం.
పైవేటు స్కూళ్లు, కళాశాలలు బంద్..
జిల్లా వ్యాప్తంగా ప్రై వేట్‌స్కూళ్లు, కళాశాలలు స్వచ్చందంగా బంద్ పాటించాయి. తిరుపతిలోని ఎస్వీ, మహిళా, వేదిక్, విద్యాపీఠం, వెటర్నరీ, వ్యవసాయ యూనివర్సిటీలు కూడా బంద్ పాటించాయి. జిల్లా అంతటా ఉదయం 11 గంటల వరకూ ఆర్టీసీ బస్సులు తిరగలేదు. దీనివల్ల చిత్తూరు రీజియన్ మంగళవారం రూ.1 కోటి నష్టపోయినట్లు ఆర్‌ఎం నాగశివుడు పేర్కొన్నారు. తిరుపతి నుంచి తిరుమల వెళ్లే బస్సులు మాత్రమే నడిచాయి. అన్ని పట్టణాల్లోనూ మధ్యాహ్నం 12 గంటల వరకూ కిరాణా,ఫ్యాన్సీ, రెడీమేడ్ దుస్తుల షాపులు మూతపడ్డాయి.
Advertisement