- బోరంచ నల్లపోచమ్మ ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ పదవిపై నేతల కన్ను
- -త్వరలో కొలువుదీరనున్న కొత్త కమిటీ
- -భారీగా ఉన్న ఆశావహుల సంఖ్య
- -పావులు కదుపుతున్న స్థానిక అధికార పార్టీ నేతలు
మనూరు : బోరంచ నల్లపోచమ్మ ఆలయ నూతన పాలక మండలి చైర్మన్ పదవిపై పలువురి నేతల కన్ను పడింది. దీంతో ఆ పదవి చేపట్టేందుకు రోజురోజుకు ఆశవాహుల సంఖ్య పెరుగుతోంది. నల్లపోచమ్మ ఆలయం మూడేళ్ల క్రితం దేవాదాయ శాఖ పరిధిలోకి వెళ్లింది. దీంతో ఇన్నాళ్లు ఆలయ నిర్వాహణ వ్యవహారం సంబంధిత అధికారులే చూసుకుంటున్నారు. కేతకి సంగమేశ్వర ఆలయ ఈఓ మోహన్‌రెడ్డి నల్లపోచమ్మ ఆలయ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు.
గత కొద్దిరోజులగా వేద పండితులను నియమించడంతో అమ్మవారి పూజలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. అంతకు ముందు స్థానిక బైండ్ల, అవుటి కులస్తులు పూజలు నిర్వహించేవారు. దేవాదాయ శాఖ అధికారులు ఆలయంలోనే ప్రత్యేక కార్యాలయం ఏర్పాటుచేసి ఆలయ వ్యవహారాలను కొనసాగిస్తున్నారు.
పెరుగుతున్న ఆదాయం..
ఇటీవల గత కొంతకాలంగా బోరంచ నల్లపోచమ్మ ఆలయానికి భారీ ఆదాయం వస్తోందని స్థానికులు అంటున్నారు. ఏడాదికి రెండుమార్లు నిర్వహిస్తున్న హుండీ లెక్కింపు ద్వారా ఈ విషయం ఇటీవల వెలుగు చూసింది. ఇప్పటివరకు దాదాపుగా రూ.15లక్షలకు పైగా ఆదాయం బ్యాంకు ఖాతాలో జమ అయినట్లు దేవాదాయ శాఖ అధికారులు అంటున్నారు. దీంతో పాలక మండలి పదవికోసం ఎమ్మెల్యేవద్ద పైరవీలు చేస్తున్నట్లు తెలిసింది.