అర గంటలోనే దేవదేవుడి దర్శనం
• ఏటా 1.30 లక్షల మంది సామాన్యులకు ‘దివ్యదర్శనం’
• త్వరలో అమల్లోకి రానున్న కొత్త పథకం
సాక్షి, అమరావతి: తిరుమల శ్రీవారి దర్శనం సామాన్య భక్తులకు కూడా మరింత సులువుగా లభించనుంది. ఈ మేరకు దేవాదాయ శాఖ త్వరలో దివ్యదర్శనం పథకాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ పథకంలో భక్తుడు క్యూలైన్‌లోకి వెళ్లిన అరగంటలో దర్శనం పూర్తయ్యేలా టీటీడీ అధికారులు చర్యలు తీసుకుంటారు. ఈ పథకం కింద ఎంపికై తిరుమలకు చేరుకునేవారికి టీటీడీ అధికారులు దగ్గరుండి స్వామి దర్శనం చేయిస్తారు. దర్శనం అనంతరం డిప్యూటీ ఈవో స్థాయి అధికారి చేతులు మీదుగా ఉచితంగా దేవుడి ప్రసాదం అందజేస్తారు.
వీఐపీలకు మాత్రమే దక్కే సౌకర్యాలను దివ్యదర్శనం పథకం కింద సామాన్య భక్తులకు లభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. లబ్ధిదారుల ఎంపిక, నిధుల సమీకరణ, భక్తులకు రాయితీతో కూడిన రవాణా సౌకర్యం తదితర అంశాలపై దేవాదాయ శాఖ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.దీని వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఏటా 1.30లక్షల మందికి స్వామివారి దివ్య దర్శనం ఉచితంగా లభించనుంది.