అప్పులపాలై కౌలు రైతు ఆత్మహత్య
అప్పులపాలై కౌలు రైతు ఆత్మహత్య
Published Fri, Sep 2 2016 6:47 PM | Last Updated on Tue, Nov 6 2018 8:04 PM
విజయపురి సౌత్: మాచర్ల మండలంలోని అనుపు చెంచుకాలనీకి చెందిన కౌలు రైతు వేసిన పంటపొలం పండకపోవడంతో పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన నూన్సావత్ హనుమానాయక్(47) గత మూడేళ్లుగా 9 ఎకరాల పొలం కౌలుకు తీసుకొని పండిస్తున్నాడు. గత మూడేళ్లుగా వర్షాలు సరిగ్గా కురవకపోవడంతో పంట చేతికి రాక అప్పలపాలయ్యాడు. ఈ ఏడాది తొమ్మిది ఎకరాల కౌలు పొలంలో పత్తి, మిర్చి వేయగా, సొంత పొలం అయిన ఒకటిన్నర ఎకరంలో కంది పంట వేశాడు. వర్షాలు ఆలస్యంగా కురవడంతో పంట ఎండిపోయిందనే బాధతో ఆత్మహత్యకు పాల్పడినట్టు గ్రామస్తులు తెలిపారు. ఉదయం పొలంకు వెళ్లి వస్తానని ఇంటి నుంచి బయలుదేరిన హనుమానాయక్ వెంట తెచ్చుకున్న పురుగుమందును తాగడంతో వాంతులు చేసుకున్నాడు. పక్క పొలంలో పొలం దున్నతున్న మోతీలాల్ అది గమనించి దగ్గరకు వెళ్లి చూడగా నోటి నుంచి నురుగులు వస్తుండడంతో హనుమానాయక్ సెల్‌ఫోన్ నుంచి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. దీంతో హనుమానాయక్ కుటుంబ సభ్యులు గ్రామానికి నాలుగు కిలో మీటర్ల దూరంలో ఉన్న పొలానికి హుటాహుటిన చేరుకొని హనుమానాయక్‌ను గ్రామంలోకి తీసుకువస్తుండగా మృతిచెందాడు. మృతుడికి భార్య భారతి, ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
Advertisement