అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
ఓర్వకల్లు: అప్పుల బాధ తాళలేక ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని చింతలపల్లె గ్రామంలో సోమవారం చోటు చేసుకొంది. గ్రామానికి చెందిన వడ్డె వెంకటరమణ (45) తమకున్న రెండెకరాల పొలంతో పాటు మరికొంత భూమిని కౌలుకు తీసుకొని పండుమిర్చి పంటను సాగు చేశాడు. మూడేళ్ల నుంచి సరైన వర్షాలు కురువక తీవ్రంగా నష్టపోయాడు. వ్యవసాయానికి పెట్టుబడుల కోసం, ఇద్దరు కుమార్తెల పెళ్లిళ్ల కోసమని దాదాపు రూ.4 లక్షల దాకా అప్పు చేశాడు. ఈ క్రమంలో అప్పుదారుల నుంచి ఒత్తిళ్లు రావడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆదివారం సాయంత్రం పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో కోలుకోలేక సోమవారం మృతి చెందాడు. ఆ మేరకు మృతుడి భార్య వెంకటలక్ష్మి ఫిర్యాదు ప్రకారం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చంద్రబాబు నాయుడు తెలిపారు.