నరకానికి నకళ్లు... నారాయణ విద్యాసంస్థలు
వామపక్షాలు కరపత్రాల ప్రచారం
తిరుపతి కల్చరల్ : నరకానికి నకళ్లు నారాయణ విద్యాసంస్థలని, వాటిలో పిల్లలను చేర్పించవద్దని కోరుతూ ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీల ఆ«ధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని పరీక్ష కేంద్రాల వద్ద గురువారం కరపత్రాల ప్రచారం నిర్వహించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి కె.కుమార్‌రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు చిన్నం పెంచలయ్య మాట్లాడుతూ నేడు విద్యార్థులను మాయమాటలతో తమ కళాశాలలో చేర్చుకుని లక్షలాది రూపాయల ఫీజులు కట్టుకుని వారికి సౌకర్యాలు లేకుండా చేస్తోందన్నారు.
అగ్గి పెట్టెల్లాంటి గదులు, అపార్ట్‌మెంట్ల లో చదువులు, సరిగా లేని మరుగుదొడ్లు, ఉడికీ ఉడకని అన్నం వంటి అసౌకర్యాలతో విద్యార్థులను క్షోభకు గురిచేస్తున్నారన్నారు. విద్యార్హత లేని లెక్చరర్లతో పాఠాలు చెప్పిస్తూ విశ్రాంతి లేకుండా విద్యార్థులపై ఒత్తిడి పెంచి వారి ఆత్మహత్యలకు కారణమవుతున్నారని విమర్శించారు. నారాయణ సంస్థల్లో వరుస ఆత్మహత్యలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నారాయణను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కోరారు. సీపీఐ, సీపీఎం నాయకులు జయచంద్ర, చంద్రశేఖర్‌రెడ్డి, సాయిలక్ష్మి, సుబ్రమణ్యం, ఎన్‌డీ రవి, రజని, గురప్రసాద్, మంజుల, నాగభూషణమ్మ, రామకృష్ణమ్మ, శివ, చలపతి, కాళయ్య పాల్గొన్నారు.