చంద్రబాబుకు పోయేకాలం వచ్చింది
ధరల పెరుగుదలపై ధర్నాలో వామపక్ష నేతల ధ్వజం
సాక్షి, విజయవాడ బ్యూరో: ముఖ్యమంత్రి చంద్రబాబుకు పోయేకాలం దాపురించిందని, అందుకే ప్రజలను ఇబ్బందుల్లోకినెట్టి అమరావతి చుట్టూ తిరుగుతున్నారని సీపీఎం రాష్ర్ట కార్యదర్శి పి.మధు ధ్వజమెత్తారు. ధరల పెరుగుదలపై విజయవాడ లెనిన్ సెంటర్‌లో సోమవారం నిర్వహించిన ధర్నాలో చంద్రబా బు, ప్రధాని మోదీ తీరుపై వామపక్ష నేతలు తీవ్రంగా మండిపడ్డారు. బిహార్ ప్రజలు ఇచ్చిన తీర్పుతోనైనా బీజేపీ, టీడీపీ మేల్కొని మంచి పాలన అందించాలన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ ప్రధాని మోదీ విదేశాల చుట్టూ తిరుగుతుంటే, చంద్రబాబు రాజధాని చుట్టూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఏపీ ప్రభుత్వ అభ్యర్థనతో రాష్ట్రానికి 1,400 మెట్రిక్ టన్నుల కందిపప్పును పంపించామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రకటించారని, మరి ఆ కందిపప్పు ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు.అవసరమైతే వ్యాపారులు, బడాబాబుల అక్రమ నిల్వల గిడ్డంగులపై దాడులు చేసి ప్రజలకు పంచుతామని రామకృష్ణ ప్రకటించారు.