శ్రీశైలం డ్యాం వద్ద చిరుత సంచారం
· భయాందోళనలో సిబ్బంది
శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైలం డ్యాం వద్ద శనివారం రాత్రి 8గంటల సమయంలో చిరుత సంచరించడంతో సిబ్బంది భయాందోళనలకు గురయ్యారు. డ్యాం ప్రధాన ద్వారాలలోని రెండో గేటు రోడ్డుపై చిరుత సంచరిస్తూ నిద్రకు ఉపక్రమించింది. తెలంగాణా సరిహద్దుకు ఆనుకుని ఉన్న రెండో గేటు వద్ద చిరుత సంచరించడంతో ఎస్పీఎఫ్ పోలీసులు, డ్యాం సిబ్బంది గేటును మూసివేశారు. అక్కడే కొద్దిసేపు సంచరించిన చిరుత గోడపై పడుకుని విశ్రాంతి తీసుకుంది. గతంలో శ్రీశైలం డ్యాంపైన వాహనాల రాకపోకలు జరిగేవి. దాదాపు మూడేళ్ల నుంచి అడ్డుగోడను నిర్మించి రాకపోకలను నిషేధించడంతో ఆ ప్రాంతంలో జనసంచారం తగ్గింది. దీంతో వన్యప్రాణులు ఆ ప్రాంతంలో సంచరిస్తున్నాయి. తాజాగా చిరుత సంచరించడంతో అక్కడ ఉద్యోగులు భయాందోళనలకు గురవుతున్నారు. రాత్రి వేళల్లో ఏ సమయంలోనైనా నడక మార్గంలో డ్యాంకు చేరుకునే అవకాశాలు కూడా ఉండడంతో అటవీశాఖ అధికారులకు, ఎస్పీఎఫ్ అధికారి రామిరెడ్డికి సమాచారం చేరవేశారు. చిరుతను అడవుల్లోకి పంపేందుకు అటవీశాఖ సిబ్బంది చర్యలు తీసుకున్నారు.