
చిరుతను చంపేశారా!?
లక్కిరెడ్డిపల్లి: రెండు రోజులుగా ఇరవై గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేసిన చిరుతపులి కథ ముగిసింది. అయితే చిరుత మృతిపై పలు అనుమానాలు చెలరేగుతున్నాయి. వైఎస్సార్ జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం పరిధిలోని కోనంపేట, ఎర్రగుడి తదితర గ్రామాల్లో గత రెండు రోజులుగా చిరుత సంచరిస్తోంది. ఇద్దరు వ్యక్తులపై దాడిచేసి, గాయపర్చడమేకాక, కొన్ని పశుకులను పులి చంపి తినేసింది. చిరుత భయంతో సుమారు 20 గ్రామల ప్రజలు ప్రాణ భయంతో వణికిపోయారు.
కాగా ప్రజల ఫిర్యాదుల మేరకు చిరుతను బంధించేందుకు ఆదివారం కడప నుంచి అటవీశాఖ అధికారులు రంగంలోకిదిగారు. అడవుల్లోకి వెళ్లిన అటవీశాఖ బృందం ఓ చనిపోయిన చిరుతను గుర్తించిందని అధికారులు చెప్పారు. అది అనారోగ్యంతోనే చనిపోయి ఉంటుందని పేర్కొన్నారు. అయితే పులి చనిపోయిన ప్రాంతానికి మీడియాను అనుమతించలేదు. బంధించడం వీలుకాకపోయేసరికి చిరుతను కాల్చిచంపి, ఆ తరువాత దహనం చేసినట్లు స్థానికులు చెబుతున్నారు.