
మద్దిమల్లలో చిరుతపులి సంచారం
► లేగదూడపై దాడి
► రైతుల్లో ఆందోళన
ఎల్లారెడ్డిపేట : వీర్నపల్లి మండలం మద్దిమల్ల శివారులోని పశువుల పాకలో కట్టివేసిన లేగదూడపై చిరుతపులి దాడి చేసి హతమార్చింది. మద్దిమల్లకు చెందిన రైతు రాజయ్య గ్రామశివారులోని అటవీప్రాంతంలో గల తన వ్యవసాయ పొలం వద్ద పశువుల పాక ఉంది. అందులో లేగగూడను కట్టివేశాడు. శనివారం రాత్రి పశువుల పాకలోకి దూరిన చిరుతపులి లేగదూడపై దాడి చేసి చంపివేసింది. లేగదూడను చిరుతపులి చంపేసి ఉంటుందని రైతు భావించి గ్రామస్తులకు తెలిపాడు.
ఇప్పటికే మద్దిమల్ల, కంచర్ల, అల్మాస్‌పూర్, రంగంపేటలో చిరుతపులులు సంచరించి సుమారు 20వరకు లేగదూడలను హతమార్చాయని గ్రామస్తులు చెబుతున్నారు. దీంతో వ్యవసాయ పొలాలకు వెళ్లేందుకు రైతులు జంకుతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.