చిరుత కళేబరంతో రాజగోపాల్
సాక్షి, బెంగళూరు: శక్తికి, యుక్తికి మారుపేరైన చిరుతపులి దాడి చేస్తే ప్రాణాలు వదులుకోవాల్సిందే. ఇక ప్రాణం పోతుందని తెలిసి తెగించి చిరుతనే చంపాడో ధైర్యవంతుడు. ఈ అరుదైన సంఘటన కర్ణాటకలో హాసన్ జిల్లా అరసీకెరె తాలూకా బెండెకరె తాండా వద్ద జరిగింది. ఈ చిరుతను మట్టుపెట్టిన వ్యక్తి పేరు రాజగోపాల్ నాయక్. సోమవారం సాయంత్రం తన భార్య, కుమార్తెతో కలసి రాజగోపాల్ నాయక్ బంధువుల ఇంట్లో పెళ్లి చూసుకుని ఇంటికి బైక్ మీద వెళుతున్నాడు. ఈ సమయంలో బెండెకెరె తాండా వద్ద చిరుత ఈ కుటుంబంపై హఠాత్తుగా దూకి దాడి చేసింది. మొదట రాజగోపాల్ కుమార్తెపై దాడి చేసిన చిరుత ఆ తర్వాత అతనిపై కూడా విరుచుకుపడింది.
పీక పట్టుకుని మోచేత్తో పిడిగుడ్డులు..
ఇక చావు తప్పదనుకున్న రాజగోపాల్ చిరుతతో పోరాటానికి దిగాడు. ఎలాగోలా చిరుత గొంతును చేజిక్కించుకుని గట్టిగా అదిమిపట్టుకున్నాడు. మరోవైపు వేగంగా మోచేతితో పిడిగుద్దులు కురిపించడంతో చిరుత ప్రాణం వదిలింది. 20 నిమిషాలు సాగిన ఈ పోరాటంలో రాజగోపాల్‌తో పాటు భార్య, కూతురికి గాయాలయ్యాయి. తమ కుటుంబం ప్రాణాల్ని రక్షించుకోవాలనే స్పృహలో తాను ఏమి చేస్తున్నానో కూడా తెలియలేదని, ప్రాణ రక్షణ కోసం చిరుతను చంపేయాల్సి వచ్చిందని రాజగోపాల్ చెప్పాడు.
అంతకుముందూ పోరాటమే..
సోమవారం తెల్లవారుజామున కూడా ఇదే ప్రాంతంలో చిరుత తల్లీకొడుకులపై దాడి చేసింది. పొలానికి వెళ్తుండగా తల్లి చంద్రమ్మపై చిరుత ఒకేసారి దూకడంతో అమ్మ ప్రాణాలు కాపాడేందుకు కొడుకు కిరణ్ పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. 15 నిమిషాల పాటు చిరుతతో కిరణ్ పోరాడాడు. కిరణ్ ధాటికి చిరుత పారిపోయింది. చివరకు రాజగోపాల్ చేతిలో హతమైంది. ఈ సంఘటన అంతటా సంచలనమైంది. ఘటనాస్థలికి జనం తండోపతండాలుగా తరలివచ్చారు. కాగా అటవీఅధికారులు చిరుత కళేబరాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment