గౌరు గెలుపునకు కృషి చేద్దాం
గౌరు గెలుపునకు కృషి చేద్దాం
Published Sat, Mar 4 2017 9:10 PM | Last Updated on Tue, May 29 2018 4:37 PM
– ఐక్యంగా పనిచేస్తే అత్యధిక మెజార్టీతో విజయం
– ఆలూరు నుంచి ఎన్నికల ప్రచారం
ప్రారంభించిన గౌరు వెంకటరెడ్డి
– మొదటి సమావేశానికి విశేష స్పందన
ఆలూరు రూరల్/ఆలూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గౌరు వెంకటరెడ్డి గెలుపుకు కృషి చేద్దామని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య, ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అన్నారు. శనివారం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి గౌరువెంకటరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య ఎన్నికల ప్రచారాన్ని ఆలూరు నియోజకవర్గంలో ప్రారంభించారు. ప్రచారానికి హాజరైన గౌరు, బీవై రామయ్యకు స్థానిక ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, ఆయా మండలాల పార్టీ కన్వీనర్లు, నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే స్వగృహంలో ఆలూరు నియోజకవర్గంలోని దేవనకొండ, ఆస్పరి, హొళగుంద, చిప్పగిరి, ఆలూరు, హాలహర్వి మండలాల్లోని ఆయా గ్రామాల వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, జెడ్పీటీసీ సభ్యులు, పార్టీ ముఖ్యనాయకుల సమావేశం జరిగింది.
దోచుకోవడమే టీడీపీ నేతల పని..
సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య, ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మాట్లాడారు. అధికార పార్టీ నాయకుల దోపిడీ పర్వానికి అడ్డూఅదుపూ లేకుండా పోతోందన్నారు. రోజురోజుకు వారి దౌర్జన్యాలు మితిమీరిపోతున్నాయని ఆరోపించారు. టీడీపీ నాయకులు.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో టీడీపీ అభ్యర్థి గెలవడం కష్టమైనా బరిలో నిలిపారన్నారు. వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులు ఐక్యంగా ఉండి.. గౌరు వెంకటరెడ్డి విజయానికి కలిసిగట్టుగా కృషి చేయాలన్నారు. గౌరును గెలిపించి.. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కర్నూలు జిల్లా తరఫున కానుకగా ఇద్దామన్నారు. గతంలో గౌరు వెంకటరెడ్డి నాయకత్వంలో జిల్లాలో 11 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు గెలుపొందిన విషయాన్ని గుర్తు చేశారు.
నిధులివ్వని ప్రభుత్వం...
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలవుతున్నా గ్రామాల అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించడం లేదని ఎమ్మెల్సీ అభ్యర్థి గౌరు వెంకటరెడ్డి ఆరోపించారు. ఎంపీటీసీ సభ్యులకు నిధులు, అధికారాలను ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. సర్పంచులతో సమానంగా ఎంపీటీసీ సభ్యులకు నిధులు కేటాయించాలని ఎంపీటీసీల సంఘం.. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకున్నా పట్టించుకోలేదన్నారు. ప్రలోభాలకు లొంగకుండా ఎంపీటీసీ, జెడ్పీటీసీలు సభ్యులు తన విజయానికి సహకరించాలని కోరారు. రాయలసీమ పట్టభద్రుల అభ్యర్థి వెన్నపూసగోపాల్‌రెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కేవీ సుబ్బారెడ్డి విజయానికి కూడా వైఎస్సార్సీపీ ముఖ్యనేతలు, విద్యార్థి విభాగసంఘం నాయకులు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
సమావేశంలో ఆలూరు నియోజకవర్గ పార్టీ నాయకుడు, ఆస్పరి మాజీ జెడ్పీటీసీ సభ్యుడు మురళీధర్‌రెడ్డి, ఆస్పరి దత్తాత్రేయరెడ్డి, ఆయా మండలాల కన్వీనర్లు చిన్నఈరన్న, దొరబాబు, భీమప్పచౌదరి, ఓబులేష్, లుముంబా, ఆయా మండల కో–కన్వీనర్లు కిట్టు, బాబాసాహెబ్, హŸళగుంద జెడ్పీటీసీ సభ్యురాలు గంగమ్మ, ఆమె భర్త అయ్యాళప్ప, హొళగుంద ఎంపీపీ మల్లి, పార్టీ ఆలూరు నియోజకవర్గ ముఖ్య నాయకులు బసప్ప, హర్ధగేరి శ్రీనివాసులు, కల్యాణ్‌గౌడ్, కేశవరెడ్డి, విక్రాంత్‌రెడ్డి, అరికెర వీరేష్, హనుమయ్య, గోవిందు, ఏరూరు శేఖర్ పాల్గొన్నారు.
Advertisement