లోకల్ రు‘బాబు’!
-
మన్యంలో అడ్డగోలుగా ఖనిజ తవ్వకాలు
-
బెదిరించి.. కేసుల పెట్టి.. మైనింగ్ ప్రాంతాల స్వాధీనం
-
తరలిపోతున్న కోట్ల విలువైన ఖనిజం
ఏమాట కామాటే చెప్పుకోవాలి.. ఆ బాబు చిన్నా చితకా ఆదాయాలకు ఏమాత్రం కక్కుర్తి పడడు. పంచాయితీలు చేయడం.. బలవంతపు వసూళ్లు.. ఆయనకేమాత్రం సరిపడవు. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలన్నది ఆయన నైజం..అందుకే ఏకంగా వందల కోట్ల విలువైన ఖనిజ సంపదపై వాలిపోయాడు.. వాటిని కొల్లగొట్టే పనిలో పడ్డాడు.. అతి స్వల్ప వ్యవధిలోనే సుమారు రూ.20 కోట్ల విలువైన ఖనిజాన్ని చక్కబెట్టేశాడు..అధికారం అండ చూసుకొని.. అసలు లీజుదారులను బెదిరించి.. కేసుల్లో ఇరికించి భయపెట్టాడు..తానొక్కడు తప్ప.. ఇతరులెవరూ ఆ ఖనిజ నిక్షేపాల జోలికి రాకుండా చూసుకున్నాడు.. సాక్షాత్తు జిల్లా కలెక్టర్ ఆదేశాలనూ యథేచ్ఛగా ధిక్కరించాడు.. నిక్షేపంగా ఖనిజాన్ని కొల్లగొడుతూ కోట్లకు కోట్లు కూడబెడుతున్నాడు..మన్యంలో గిరిజనులు తప్ప ఇతరులెవరూ మైనింగ్ చేయరాదన్న నిబంధనలున్నా.. ఇతగాడి విశంఖల తవ్వకాలను అడ్డుకునేందుకు అధికారులెవరూ ముందుకు రావడంలేదు. అసలు తమకేం సంబంధం లేదన్నట్లే.. కళ్లు మూసుకుని కూర్చున్నారు. ఇంత దర్జాగా ఖనిజ దోపిడీకి పాల్పడతున్న ఈ బాబుగారి లీలలు చూసి.. ఆయన్ను ఏ చంద్రబాబో.. లోకేష్‌బాబో అనుకునేరు..! ఆయన ఫక్తు లోకల్ బాబు.. అదేదో సినిమాలో ‘చంటిగాడు.. లోకల్’.. అన్నట్లుగానే ఈ లోకల్ బాబు నర్సీపట్నం నియోజకవర్గంలోని నాతవరం మండలంలో సాగిస్తున్న దోపిడీ దందాను ఈ వారం విశాఖ తీరంలో చూపిస్తాం.. రండి.
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:
మన్యంలో బాకై ్సట్ తరువాత అత్యంత విలువైన ఖనిజం లేటరైట్. నాతవరం మండలం సరుగుడు పంచాయతీ పరిధిలోని సుందరకోట, అసనగిరి, బమిడికలొద్ది గ్రామాల్లోని వేలాది హెక్టార్లలో ఈ ఖనిజ నిక్షేపాలు అపారంగా ఉన్నాయి. ఈ నిక్షేపాలను వెలికితీసే హక్కు గిరిజనులకే ఉంది. ఆ మేరకు 2009 జూలైలో లేటరైట్ మైనింగ్ చేసేందుకు సింగం భవానీ, జర్తా లక్ష్మణ రావు అనే గిరిజనులు ప్రభుత్వం నుంచి అనుమతులు పొందారు. అసనగిరిలో 5 హెక్టార్లు, సుందరకోట ప్రాంతంలో 35.5 హెక్టార్లలో తవ్వకాలకు భవానీకి.. బమిడికలొద్ది ప్రాంతంలో 110 హెక్టార్లలో తవ్వకాలకు లక్ష్మణ రావుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే ఐదు హెక్టార్లు, అంతకుమించిన విస్తీర్ణంలో తవ్వకాలు జరపడానికి పర్యావరణ అనుమతులు తప్పనిసరి. కానీ ఆ అనుమతులు రాకపోవడంతో వారిద్దరూ తవ్వకాలు చేపట్టలేదు.
ఒత్తిళ్లు.. కేసులు..
రెండేళ్ల కిందట టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్ మారింది. ప్రజాప్రతినిధి కుమారుడైన లోకల్ బాబు కన్ను లేటరైట్ గనులపై పడింది. ముందుగా అధికారబలాన్ని ప్రయోగించి సింగం భవానీ పేరిట ఉన్న ఐదు హెక్టార్లను తన ఆధీనంలోకి తెచ్చుకున్నారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ ఎంపీ కుమారుడితో కలిసి గత ఏడాది సెప్టెంబరులో భారీ యంత్రాలతో తవ్వకాలు మొదలెట్టారు. ఈ 11 నెలల కాలంలోనే రూ.20 కోట్లు విలువైన ఖనిజాన్ని తరలించి సొమ్ము చేసుకున్నారని అంచనా. కేవలం ఐదు హెక్టార్లలో చేపట్టిన తవ్వకాలకే ఇంత ఆదాయం వస్తుంటే 110 హెక్టార్లలో తవ్వకాలు చేస్తే ఇంకెంత వస్తుందోనని లెక్కలు వేసుకున్నారు. అంతే.. బమిడికలొద్ది ప్రాంతంలోని 110 హెక్టార్ల బినామీ లీజుదారుడైన లవకుమార్ రెడ్డిపై లోకల్ బాబు ఒత్తిడి చేశారు. 80 శాతం వాటా ఇస్తే తవ్వకాలకు అనుమతులు ఇప్పిస్తానని బేరం పెట్టారు. దానికి లవకుమార్‌రెడ్డి నిరాకరించడంతో వేధింపులకు దిగారు. ఆ మైనింగ్ అనుమతులు రద్దు చేయాలని గ్రామ సర్పంచ్ సాగిన లక్ష్మణ మూర్తిపై ఒత్తిడి చేశారు. అయితే దానికి సర్పంచ్ కూడా అంగీకరించలేదు. కక్ష గట్టిన సదరు బాబు సర్పంచ్ లక్ష్మణ మూర్తి, బినామీ లీజుదారుడు లవకుమార్‌రెడ్డిలపై కేసులు పెట్టించారు. పంచాయతీ నిధుల వినియోగంలో అవకతవకలు జరిగాయంటూ సర్పంచ్ చెక్‌పవర్ రద్దు చేయించారు. మరో వైపు అసలు లీజుదారుడైన జర్తా లక్ష్మణ రావునూ వదల్లేదు. అతనికి ఇచ్చిన మైనింగ్ అనుమతులను రద్దు చేయాలంటూ సదరు బాబు తన తండ్రి అయిన టీడీపీ ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే ఆయన పంచాయతీరాజ్‌శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శికి వివరాలు నివేదించారు. దీంతో పంచాయతీరాజ్ కమిషనర్ అసలు ఆ ప్రాంతంలో ఎక్కడా లేటరైట్ తవ్వకాలు చేపట్టకూడదంటూ ఆదేశాలిచ్చారు. ఆ మేరకు అప్పటి జిల్లా కలెక్టర్ యువరాజ్ సరుగుడు ప్రాంతంలో ఎక్కడా మైనింగ్ జరగకుండా చూడాలని తొమ్మిది శాఖల అధికారులకు ఆదేశాలు ఇస్తూ జీవో జారీ చేశారు.
కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు
జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తూ సదరు ప్రజాప్రతినిధి కుమారుడు సింగం భవానీ పేరున ఉన్న ఐదు హెక్టార్లలో మాత్రం అడ్డూ అదుపూ లేకుండా తవ్వకాలు జరిపేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుగుతున్నట్లు తెలిసినప్పటికీ అధికారులు ఇప్పటివరకు అడ్డుకునే యత్నం కూడా చేయలేదు. కనీసం ఆవైపు కన్నెత్తి చూసే సాహసం కూడా చేయలేదు. ఇక అడ్డగోలు తవ్వకాలతో కోట్ల ఆదాయం రుచిమరిగిన ఆ బాబు ఇటీవల 8 మంది గిరిజనుల పేరుతో మైనింగ్ లీజ్‌కు దరఖాస్తు చేయించారు. ఆయన ఒత్తిడితో ఇక్కడి మైనింగ్ అధికారులు కొత్తవాటి అనుమతికి ప్రతిపాదనలు తయారు చేసి పంపించారు.
ఈ ప్రశ్నలకు సమాధానమేదీ?
-
నిబంధనల మేరకు గిరిజనులు చేయాల్సిన మైనింగ్‌ను ఓ పచ్చనేత కుమారుడు దగ్గరుండి చేయిస్తుంటే అధికారులు ఏం చేస్తున్నట్టు..
-
అసలు ఆ ప్రాంతంలో మైనింగ్ నిషేధిస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేస్తే.. వాటిని బేఖాతరు చేస్తూ తవ్వకాలకు పాల్పడుతుంటే అధికారులు ఎందుకు నోరు మెదపడం లేదు.
-
మైనింగ్‌కు అర్హులైన గిరిజనులు అనుమతులు తెచ్చుకుంటే వేధింపులకు గురి చేసి తవ్వకాలకు చెక్‌పెట్టిన అధికారులు సదరు బాబు తవ్వకాలను ఎందుకు అడ్డుకోవడం లేదు.
-
కొత్తగా కొలువుదీరిన అధికారులైనా పనితీరులో ప్రావీణ్యం చూపి సదరు బాబు తవ్వకాలకు, అక్రమాలకు చెక్ పెట్టగలరా... ఏమో చూద్దాం..