నిద్రమత్తుకు నిండు ప్రాణం బలి
Published Thu, Sep 29 2016 12:45 AM | Last Updated on Mon, Sep 4 2017 3:24 PM
– మార్నింగ్ వాకింగ్ చేస్తున్న వ్యక్తిని ఢీ కొన్న ఐషర్
–అక్కడికక్కడే అతను మృతి
డోన్: డ్రై వర్ నిద్రమత్తు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. బుధవారం గుత్తి–కర్నూలు హైవేలో డోన్‌పట్టణంలోని కంబాలపాడు క్రాస్ వద్ద మార్నింగ్‌వాకింగ్ చేస్తున్న సీనియర్ ఎల్‌ఐసీ ఏజెంట్ రామచంద్రారెడ్డి (54)ని సీజీ–07, ఏఎక్స్ 5575 నెంబర్‌గల ఐషర్ వేగంగా వచ్చి వెనుక వైపు నుంచి వచ్చి ఢీ కొంది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందగా, లారీ ముందుకు దూసుకెళ్లి గుంతలో పడింది. మార్నింగ్ వాకింగ్ కోసం వచ్చిన పలువురు ఈ ఘటనను చూసి భీతిల్లిపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని చూసి రామచంద్రారెడ్డిదిగా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న స్నేహితులు, ఎల్‌ఐసీ ఏజెంట్లు, బంధువులు డోన్‌ప్రభుత్వ వైద్యశాలకు చేరుకున్నారు. టౌన్ ఎస్‌ఐ శ్రీనివాసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కన్నీటి పర్యంతం
ఎల్‌ఐసీ ఏజెంటుగా రామచంద్రారెడ్డి పట్టణంలో పలువురు ప్రముఖులతో పాటు ప్రజల్లో కూడా మంచి గుర్తింపు వుంది. రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందడం తో వైఎస్‌ఆర్‌సీపీ పత్తికొండ నియోజకవర్గ ఇన్‌ఛార్జి చెరుకులపాడు నారాయణరెడ్డి హుటాహుటిన డోన్ చేరుకొని ఆయన భౌతిక కాయాన్ని సందర్శించారు. బాధితులను ఓదార్చేక్రమంలో ఆయన కూడా కన్నీటి పర్యంతమై తన ప్రగాఢసానుభూతిని వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే కోట్లసుజాతమ్మ భౌతిక కాయాన్ని సందర్శించి ప్రగాఢసంతాపాన్ని తెలిపారు.
హైవేపై భయంభయం..:
జాతీయ రహదారిపై నడకను సాగించాలంటే పలువురు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ప్రాంతంలోని ప్రధాన కూడళ్లలో అండర్‌పాస్‌లు లేకపోవడం, సెంట్రల్ లైటింగ్‌తో పాటు హెచ్చరికలు లేకపోవడంతో రహదారిపై నడవాలంటేనే పలువురు హడలెత్తిపోతున్నారు.
Advertisement
Advertisement