ప్రాణసంకటం | Life crisis | Sakshi
Sakshi News home page

ప్రాణసంకటం

Published Mon, Dec 5 2016 11:47 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

ప్రాణసంకటం - Sakshi

ప్రాణసంకటం

  • డబ్బుల్లేక జనం విలవిల
  • రోగులు, వృద్ధులు, వికలాంగుల పరిస్థితి మరీ దయనీయం
  • జనంతో కిక్కిరిసిపోతున్న బ్యాంకులు
  • చాలాచోట్ల ‘సర్దుబాటు’తో  సరి
  • మెరుగు కాని ఏటీఎంల పరిస్థితి
  • అనంతపురం నగరానికి చెందిన ఈ పెద్దాయన పేరు వెంకటేశులు. ఉద్యోగ విరమణ చేసి ఐదారేళ్లయ్యింది. ఇటీవల ప్రమాదంలో కాలు దెబ్బతినడంతో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పెన్షన్‌ డబ్బుతోనే సంసారం గడవాలి. ఇప్పుడు చికిత్సకు కూడా డబ్బు అవసరమైంది. ఆయనొస్తే కానీ విత్‌డ్రా చేసుకోలేని పరిస్థితి. దీంతో కుటుంబ సభ్యులు  అష్టకష్టాలు పడి వెంకటేశులును స్థానిక సాయినగర్‌ ఎస్‌బీఐకి తీసుకొచ్చారు.కొంత నగదు డ్రా చేసుకుని వెళ్లారు. ఏటీఎంలు పనిచేసి ఉంటే తమకీ పరిస్థితి వచ్చేది కాదని వారు వాపోయారు.

     

    ప్రజల కరెన్సీ కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. బ్యాంకులు, ఏటీఎంల వద్ద పడిగాపులు తప్పడం లేదు. ఎప్పటిలాగే సోమవారం కూడా జిల్లా వ్యాప్తంగా బ్యాంకులు కిక్కిరిసిపోయాయి. చాలా వరకు ఏటీఎంలు పనిచేయలేదు. పనిచేసిన వాటి వద్ద చాంతాడంత క్యూలు కన్పించాయి. పెద్ద నోట్లు రద్దు చేసి సోమవారం నాటికి  27 రోజులైనా సమస్య ఏమాత్రమూ తీరలేదు. ఇంకెన్నాళ్లు కొనసాగుతుందోనని జనం ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు, రోగులకు ప్రాణసంకటంగా మారింది. ఇంట్లో మంచానపడ్డ వారు, వివిధ జబ్బులతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులు, వికలాంగులు, అంధులు, వయో వృద్ధులు, సీనియర్‌ సిటిజన్స్‌ పింఛన్‌ సొమ్ము కోసం ప్రాణాలకు తెగించి..బ్యాంకుల వద్దకు రావాల్సి వస్తోంది. పేదలు, రైతులు, మహిళలు, గర్భిణులు, బాలింతలకు కూడా కష్టాలు తప్పడం లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు బ్యాంకుల వద్ద క్యూలైన్లలో పడిగాపులు కాయాల్సివస్తోంది.

    నగదు కొరతతో సర్దుబాట్లు

        జిల్లా వ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లోనూ నగదు కొరత తీవ్రంగా ఉంది. సరఫరా అవుతున్న అరకొర నగదు ఒకట్రెండు రోజుల్లోనే ఖాళీ అవుతోంది.  దీంతో ఎక్కడా ఒకేసారి రూ.24 వేలు విత్‌డ్రా ఇచ్చే పరిస్థితి లేదు. రూ.4 వేల నుంచి గరిష్టంగా రూ.10 వేలతో సర్దుబాటు చేసి పంపుతున్నారు. చిన్న డినామినేషన్‌ నోట్లు తక్కువగా ఉండటంతో 80 శాతం వరకు రూ.2 వేల నోట్లతో సరిపెడుతున్నారు. రోజుకు రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్లు ఉంటే కాని అందరికీ న్యాయం చేయలేమని బ్యాంకర్లు చేతులెత్తేస్తున్నారు. ప్రస్తుతం రూ.20 కోట్ల నుంచి రూ.25 కోట్ల వరకు మాత్రమే దినసరి లావాదేవీలు జరుగుతున్నట్లు అంచనా. ఎస్‌బీఐ పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నా.. ఆంధ్రా, సిండికేట్‌, కెనరా, ఏపీజీబీ, కార్పొరేషన్, ఎస్‌బీహెచ్‌ లాంటి ప్రధాన బ్యాంకుల్లో సైతం నగదు కొరత కొనసాగుతోంది. వీటికి సంబంధించి సోమవారం కూడా దాదాపు 30 శాఖల్లో 'నోక్యాష్‌', 'క్యాష్‌ నిల్‌' బోర్డులు తగిలించారు. యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఐడీబీఐ, బ్యాంకు ఆఫ్‌ బరోడా లాంటి కొన్ని ప్రైవేట్‌ వాణిజ్య బ్యాంకుల్లో పరిస్థితి బాగానే ఉన్నా, ఇండస్‌ఇండ్, ఇండియన్, బ్యాంకు ఆఫ్‌ ఇండియా, దేనా, పంజాబ్‌నేషనల్‌ బ్యాంకు, విజయా, కరూర్‌ వైశ్యా, కొటక్‌ మహింద్రా బ్యాంకుల్లో నగదు కొరత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

    నిరవధికంగా మూతబడ్డ ఏటీఎంలు

    సోమవారం కూడా అనంతపురం నగరంలో ఏటీఎంలు పనిచేయలేదు. కౌంటర్ల ద్వారా నగదు ఇవ్వడానికే ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఏటీఎంలలో పెట్టడానికి బ్యాంకర్లు సాహసించడం లేదు. సాయంత్రం, రాత్రి వేళల్లో 10 నుంచి 15 ఏటీఎంలలో కొంత నగదు పెడుతుండగా, అది గంటల్లోనే అయిపోతోంది. జిల్లాలో ఎస్‌బీఐ ఏటీఎంలు 212 ఉండగా, నాలుగైదు మాత్రమే పనిచేయడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా మొత్తం 556 ఏటీఎంలకు గానూ సోమవారం 20కి మించి పనిచేయలేదని బ్యాంకింగ్‌ వర్గాలు తెలిపాయి.

    నగదు రహితంపై అవగాహన

     నగదు రహిత లావాదేవీలపై బ్యాంకర్లు, అధికారులు జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. అయితే..వీటికి ప్రజల నుంచి స్పందన కనిపించడంలేదు. ఉన్నఫళంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం, స్మార్ట్‌ఫోన్ల వాడకం ఇబ్బందే  అని ప్రజలు అంటున్నారు. స్వైప్‌మిషన్లు, రకరకాల యాప్‌లు ఉపయోగించి బ్యాంకింగ్‌ సేవలు పొందడానికి చదువుకున్నవారు, అధికారులు, బ్యాంకర్లే అవస్థలు పడుతుండటంతో ఇక రైతులు, పేదలు, సామాన్య వర్గాల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement