అనంతపురం సెంట్రల్ : ఓ వ్యక్తిని దారుణంగా కొట్టి చంపిన కేసులో నిందితుడికి జీవిత ఖైదు, రూ. 500 జరిమానా విధిస్తూ జిల్లా జడ్జి శశిధర్‌రెడ్డి సోమవారం తీర్పు వెలువరించారు. వివరాలు.. 2013 ఆగస్టు 5న నార్పల క్రాస్‌లోని బయపురెడ్డి దాబా వద్ద నార్పల మండలం దగుమర్రి గ్రామానికి చెందిన ఆదినారాయణ(42) దారుణహత్యకు గురయ్యాడు. తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే నెపంతో అదే గ్రామానికి చెందిన హరిజన సాకే వెంకటరాముడు మరో వ్యక్తి సాకే నల్లప్పతో కలిసి అతడిని కట్టెలతో కొట్టి చంపారు. అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో సాక్షులను విచారించిన అనంతరం సోమవారం ప్రధాన నిందితుడు సాకే వెంకటరాముడుకు జీవితఖైదు విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. రెండో ముద్దాయి సాకే నల్లప్ప అనారోగ్యంతో మృతి చెందడంతో గతంలోనే ఆయనపై కేసు కొట్టి వేశారు. బాధితుల తరుఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ నారాయణస్వామి వాదించారు.