అల్లుడిని చంపిన కేసులో మేనమామకు జీవితఖైదు
Published Tue, Mar 28 2017 9:34 PM | Last Updated on Sun, Sep 2 2018 4:37 PM
ఆదోని రూరల్: పెసలబండ గ్రామంలో సొంత అక్క కుమారుడిని గొంతు కోసి హత్య చేసిన కేసులో మేనమామకు కోర్టు జీవితఖైదు విధించినట్లు తాలూకా సీఐ దైవప్రసాద్ తెలిపారు. 2016 మే 12వ తేదీన వీరేష్ తన అక్క కుమారుడైన మోహన్(7)ను మాయమాటలు చెప్పి పొలానికి తీసుకెళ్లి బ్లేడుతో గొంతు కోసి హత్య చేసినట్లు అప్పట్లో కేసు నమోదైంది. వీరేష్‌కు తన అక్క అప్పుడప్పుడు ఎవరికీ తెలియకుండా డబ్బులు ఇస్తుందనే విషయాన్ని మోహన్ తన కుటుంబీకులకు చెప్పడంతో అతనిపై కక్ష పెంచుకుని చంపేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు సాక్షాధారాలు రుజువు కావడంతో జిల్లా అదనపు జడ్జి శ్రీనివాసరావు మంగళవారం జీవితఖైదు శిక్షను విధించినట్లు సీఐ తెలిపారు. దర్యాప్తు అధికారిగా వ్యవహరించిన సీఐ దైవప్రసాద్‌ను ఆదోని డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు, ఎస్పీ రవికృష్ణ అభినందించారు. ఈ కేసులో బాధితుడి తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ రఫత్ కేసును వాదించారు.
Advertisement