హత్యకేసులో ఇద్దరికి జీవిత ఖైదు
Published Thu, Mar 9 2017 10:51 PM | Last Updated on Mon, Jul 30 2018 8:37 PM
చిన్న మల్కాపురంలో ఉద్రిక్తత
కర్నూలు(లీగల్)/ డోన్‌టౌన్: డోన్ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని చిన్నమల్కాపురంలో నివాసముంటున్న ఎం.శ్రీనివాసరెడ్డి హత్య కేసులో ఇద్దరు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ కర్నూలు నాలుగో అదనపు జిల్లా కోర్టు గురువారం తీర్పు ఇచ్చింది. నంద్యాలకు చెందిన ఎం.శ్రీనివాసరెడ్డి తన సోదరి లీలావతిని డోన్ మండలం చిన్నమల్కాపురం గ్రామానికి చెందిన శివశంకర్‌రెడ్డికి ఇచ్చి వివాహం చేశారు. వివాహం జరిగిన కొన్నాళ్లకు అనారోగ్యంతో శివశంకర్‌రెడ్డి మృతిచెందగా, ఆయనకున్న 30 ఎకరాల మైన్స్ వ్యాపారం చూసేందుకు శ్రీణివాసరెడ్డి నంద్యాల నుంచి తన నివాసాన్ని చిన్న మల్కాపురం మార్చాడు. లీలావతికి చెందిన మైన్స్ వ్యాపారంపై కన్నేసిన వారి బంధువు ఎస్.మహానందిరెడ్డి(ఏ1) తనకు భాగం ఇవ్వాలని తగాదా పడేవాడు.
ఈ నేపథ్యంలో శ్రీనివాసరెడ్డి కోర్టులో కేసు వేశాడు. ఈ క్రమంలో తన న్యాయవాదిని కలిసేందుకు 2013 ఏప్రిల్ 14వ తేదీన సాయంత్రం కర్నూలుకు చేరుకున్నాడు. తన పని పూర్తయిన తర్వాత రాత్రి చిన్న మల్కాపురం బయలుదేరాడు. విషయాన్ని ముందే తెలుసుకున్న ప్రత్యర్థులు డోన్–చిన్న మల్కాపురం రహదారిలో కాపు కాశారు. శ్రీనివాసరెడ్డి ప్రయాణిస్తున్న స్కార్పియోను అడ్డుకుని.. అతనిపై మారణాయుధాలతో దాడి చేసి హత్య చేశారు. నిందితులుగా మహానంది, సర్పంచ్ వెంకట సుబ్బమ్మ, పారిశ్రామిక వేత్త కృష్ణారెడ్డి దంపతుల ప్రథమ కుమారుడు మాజీ సింగిల్‌విండో అధ్యక్షుడు గోపాల్‌రెడ్డితోపాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేశారు.
కేసు విచారణ అనంతరం ఎస్.మహానందరెడ్డి, గోపాల్‌రెడ్డిపై మాత్రమే నేరం రుజువు కావడంతో వారికి జీవిత ఖైదుతో పాటు ఒక్కొక్కరికి రూ.15 వేలు చొప్పున జరిమానా విధిస్తూ న్యాయమూర్తి టి.రఘురాం తీర్పు చెప్పారు. మిగిలిన ఏడుగురు నిందితులపై నేరం రుజువు కాకపోవడంతో ఎ.నరేంద్రమూర్తి నాయుడు, ఈడిగ వెంకటేష్ గౌడు, తెలుగు నాగరాజు, డి.సుబ్బరామిరెడ్డి, వి.చిన్నలక్ష్మన్న, గొల్ల సంజప్ప, రేపల్లె రాజేంద్రకుమార్‌లపై కేసును కొట్టివేశారు. ప్రాసిక్యూషన్ తరపున ఏపీపీ రాజేంద్రప్రసాద్ వాదించారు. హత్యకేసులో ఇద్దరికి జీవిత ఖైదు పడటంతో గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
Advertisement
Advertisement