బతుకెంత దూరం
కడప కల్చరల్:
వినాయక చవితి విగ్రహాల తయారీలో రాజస్థాన్ కళాకారుల తర్వాతే ఎవరైనా. ఉగాది తర్వాత ఇంటి బాధ్యతను పెద్దలకు అప్పగించి విగ్రహాల తయారీకి అవసరమైన పోత అచ్చులు, రంగులు, ఇతర సరంజామాతో లారీల్లో మన రాష్ట్రానికి చేరుకుంటారు. జిల్లాకు కొన్ని కుటుంబాలు చొప్పున వెళతారు. నెల రోజులు తాము తయారు చేసిన చిన్న చిన్న బొమ్మలను అద్దెకు తీసుకున్న తోపుడు బండ్లపై వీధుల్లో విక్రయిస్తారు. జూన్ ప్రారంభం నుంచి వినాయక విగ్రహాల తయారీని మొదలు పెడతారు. ఊరవతల బీడు పొలాల్లో పెద్ద పెద్ద గుడిసెలు వేసుకుని విగ్రహాలు తయారు చేసి, అవి వర్షాలకు పాడవకుండా గుడిసెలపై పెద్ద ప్లాస్టిక్ షీట్లు కప్పుతారు.
కష్టం ఇలా....
చిన్నపిల్లలు అర అడుగు నుంచి ఒకటిన్నర అడుగుల ఎత్తుగల బొమ్మలను , మహిళలు రెండు, మూడు అడుగుల బొమ్మలు, మగవారు 4 నుంచి 12–13 అడుగుల వినాయక విగ్రహాలను పోత పోస్తారు. ఒక్కో కుటుంబం ఆర్థిక స్థాయిని బట్టి 20 నుంచి 40 విగ్రహాలను తయారు చేస్తారు. కిరీటాలు, చేతులు, తొండాలు మాత్రం విడిగా పోత పోస్తారు. అవి బాగా ఆరాక వాటిని (అతికించి) తగిలించి ఫినిషింగ్ చేస్తారు. స్ప్రే మిషన్‌తో రంగులు వేస్తారు. చివరగా మెరిసే రంగులు అద్ది తుది మెరుగు దిద్దుతారు. చిన్నవి రూ. 25 నుంచి రూ. 1000, పెద్దవి రూ. 4 వేల నుంచి రూ. 15 వేల వరకు విక్రయిస్తారు.
విఘ్నాలు దాటి....
ఊరవతల ఆరుబయళ్లలో వేసుకునే గుడిసెలకు కొందరు యజమానులు అద్దె డిమాండ్ చేస్తారు. కొందరు దయ తలుస్తారు. మరికొందరు డూప్లికేట్ యజమానుల బాధ కూడా ఉంటుంది. ఎండా, వాన, చలి, దోమల బాధ భరిస్తూ చంటిబిడ్డలతో గుడిసెల్లోనే ఉంటారు. పెట్టుబడిని తమ ఊర్లలోని వ్యాపారుల వద్ద వడ్డీకి తెచ్చుకుంటారు. జూన్ నుంచి వినాయక చవితి వరకు విగ్రహాల తయారీలోనే నిమగ్నమవుతారు. ఈ జిల్లాలో పట్టణాల నుంచి చిన్న గ్రామాలతోపాటు వీధివీధికి రెండు, మూడు చొప్పున విగ్రహాలను పెడతారని, హైదరాబాదు తర్వాత ఈ జిల్లాలోనే వ్యాపారం బాగా జరుగుతుందని వారి భావన. జిల్లాకు 20 నుంచి 25 కుటుంబాలు చొప్పున వెళతారు. ప్రతి సంవత్సరం రొటేషన్ పద్ధతిలో జిల్లాలను కేటాయించుకుంటారు. ప్రత్యేకించి ఫలానా జిల్లాయే కావాలంటే గుడ్‌విల్ చెల్లించాల్సి వస్తుంది. ఈ సంవత్సరం జిల్లాలో వర్షాలు బాగా కురిసినందున పండుగతోపాటు తమ వ్యాపారం కూడా బాగుంటుందని కళాకారులు భావిస్తున్నారు. తమకు ఎన్ని కష్టాలు ఎదురైనా ఆ విఘ్నేశ్వరుడే తీరుస్తాడని గాఢంగా విశ్వసిస్తున్నారు.
వ్యాపారంపై ఆశలు
జిల్లాలో ఈసారి వర్షాలు బాగా కురిశాయి. వినాయక చవితి పండుగను ఘనంగా నిర్వహిస్తారని భావిస్తున్నాం. మా వ్యాపారం కూడా బాగా జరుగుతుందన్న నమ్మకం ఉంది. మిగతా ప్రాంతాల కంటే ఈ జిల్లాలోనే వినాయక చవితిని ఘనంగా నిర్వహిస్తారు.
– జోదా, వినాయక విగ్రహాల కళాకారుడు, రాజస్థాన్
––––––
మాకూ పండుగ సంతోషం
మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఈ జిల్లాలో వినాయక విగ్రహాల వ్యాపారం బాగుంటుంది. ఈ జిల్లాకు రావాలని మా ప్రాంతాల కళాకారులంతా ఆశిస్తారు. ఈసారి ఇక్కడ మంచి వర్షాలు కురవడంతో వ్యాపారంపై మా ఆశలు కూడా పెరిగాయి. నాలుగు పైసలు కళ్ల చూడగలమన్న విశ్వాసం సంతోషాన్ని కలిగిస్తోంది.
– మశ్రరామ్, వినాయక విగ్రహాల కళాకారుడు, రాజస్థాన్