vinayaka statue
-
గణపతి విగ్రహాల తయారీలో శిక్షణ
ధారూరు : ఆధునిక యంత్రాలతో గణపతి విగ్రహాలను తయారు చేయడానికి రాష్ట్ర అత్యంత వెనుకబడిన అభివృద్ధి సంస్థ (ఎంబీసీ కార్పొరేషన్) కుమ్మరులకు శిక్షణ ఏర్పాటు చేసింది. జిల్లాలో ఎంపిక చేసిన కుమ్మరులకు యాదాద్రి జిల్లాలోని బూదాన్ పోచంపల్లి మండలంలో ఉన్న జలాల్పూర్ స్వామి రామానందతీర్థ గ్రామీణ శిక్షణ సంస్థలో 5వ బ్యాచ్ కింద ఐదుగురు శిక్షణ కోసం వెళ్లారు. ఈ సందర్భంగా కుమ్మరుల జర్నలిస్టు రాష్ట్ర సంఘం అధ్యక్షుడు కే.వెంకటయ్య మాట్లాడుతూ గుజరాత్లో ఆధునిక యంత్రాలతో కుమ్మరులు గణపతి విగ్రహాలు, ప్రమిదలు తయారు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కూడా కొంతమందికి శిక్షణ ఇవ్వడానికి ఎంబీసీ సంస్థ చైర్మన్ తాడూరీ శ్రీనివాస్ ప్రత్యేక చొరత తీసుకున్నారన్నారు. అక్కడ శిక్షణ పొందిన కుమ్మరులు జిల్లాలోని మండలానికి ఇద్దరు చొప్పున ఎంపిక చేసి మొత్తం 40 మందికి శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రంలో కూడా ఆధునిక యంత్రాలతో మట్టి గణపతులు, ప్రమిదలను తయారు చేసి వినాయక చవితికి సిద్ధం చేయనున్నట్లు ఆయన వివరించారు. రాష్ట్ర వాప్తంగా 5 నుంచి 7 లక్షల వరకు గణపతి విగ్రహాలను ఆధునిక యంత్రాల సహాయంతో తయారు చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం వాటికి మార్కెటింగ్ సౌకర్యం కల్గిస్తుందన్నారు. ఆధునిక యంత్రాల వల్ల తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో మట్టి వినాయకుల విగ్రహాలు, ప్రమిదలను తయారు చేసే వీలుంటుందన్నారు. -
ధన.. ధన.. గణనాథ
రూ. 20 లక్షల కరెన్సీతో వినాయకుడికి అలంకరణ దాచేపల్లి: దాచేపల్లిలోని అడితి నారాయణ కాంప్లెక్స్‌లో వినాయకుడి విగ్రహాన్ని నోట్లతో ఆదివారం అలంకరణ చేశారు. గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రూ. 20 లక్షల నోట్లతో వినాయకుడిని అందంగా అలంకరణ చేశారు. స్థానికులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకున్నారు. -
బతుకెంత దూరం
కడప కల్చరల్: వినాయక చవితి విగ్రహాల తయారీలో రాజస్థాన్ కళాకారుల తర్వాతే ఎవరైనా. ఉగాది తర్వాత ఇంటి బాధ్యతను పెద్దలకు అప్పగించి విగ్రహాల తయారీకి అవసరమైన పోత అచ్చులు, రంగులు, ఇతర సరంజామాతో లారీల్లో మన రాష్ట్రానికి చేరుకుంటారు. జిల్లాకు కొన్ని కుటుంబాలు చొప్పున వెళతారు. నెల రోజులు తాము తయారు చేసిన చిన్న చిన్న బొమ్మలను అద్దెకు తీసుకున్న తోపుడు బండ్లపై వీధుల్లో విక్రయిస్తారు. జూన్ ప్రారంభం నుంచి వినాయక విగ్రహాల తయారీని మొదలు పెడతారు. ఊరవతల బీడు పొలాల్లో పెద్ద పెద్ద గుడిసెలు వేసుకుని విగ్రహాలు తయారు చేసి, అవి వర్షాలకు పాడవకుండా గుడిసెలపై పెద్ద ప్లాస్టిక్ షీట్లు కప్పుతారు. కష్టం ఇలా.... చిన్నపిల్లలు అర అడుగు నుంచి ఒకటిన్నర అడుగుల ఎత్తుగల బొమ్మలను , మహిళలు రెండు, మూడు అడుగుల బొమ్మలు, మగవారు 4 నుంచి 12–13 అడుగుల వినాయక విగ్రహాలను పోత పోస్తారు. ఒక్కో కుటుంబం ఆర్థిక స్థాయిని బట్టి 20 నుంచి 40 విగ్రహాలను తయారు చేస్తారు. కిరీటాలు, చేతులు, తొండాలు మాత్రం విడిగా పోత పోస్తారు. అవి బాగా ఆరాక వాటిని (అతికించి) తగిలించి ఫినిషింగ్ చేస్తారు. స్ప్రే మిషన్‌తో రంగులు వేస్తారు. చివరగా మెరిసే రంగులు అద్ది తుది మెరుగు దిద్దుతారు. చిన్నవి రూ. 25 నుంచి రూ. 1000, పెద్దవి రూ. 4 వేల నుంచి రూ. 15 వేల వరకు విక్రయిస్తారు. విఘ్నాలు దాటి.... ఊరవతల ఆరుబయళ్లలో వేసుకునే గుడిసెలకు కొందరు యజమానులు అద్దె డిమాండ్ చేస్తారు. కొందరు దయ తలుస్తారు. మరికొందరు డూప్లికేట్ యజమానుల బాధ కూడా ఉంటుంది. ఎండా, వాన, చలి, దోమల బాధ భరిస్తూ చంటిబిడ్డలతో గుడిసెల్లోనే ఉంటారు. పెట్టుబడిని తమ ఊర్లలోని వ్యాపారుల వద్ద వడ్డీకి తెచ్చుకుంటారు. జూన్ నుంచి వినాయక చవితి వరకు విగ్రహాల తయారీలోనే నిమగ్నమవుతారు. ఈ జిల్లాలో పట్టణాల నుంచి చిన్న గ్రామాలతోపాటు వీధివీధికి రెండు, మూడు చొప్పున విగ్రహాలను పెడతారని, హైదరాబాదు తర్వాత ఈ జిల్లాలోనే వ్యాపారం బాగా జరుగుతుందని వారి భావన. జిల్లాకు 20 నుంచి 25 కుటుంబాలు చొప్పున వెళతారు. ప్రతి సంవత్సరం రొటేషన్ పద్ధతిలో జిల్లాలను కేటాయించుకుంటారు. ప్రత్యేకించి ఫలానా జిల్లాయే కావాలంటే గుడ్‌విల్ చెల్లించాల్సి వస్తుంది. ఈ సంవత్సరం జిల్లాలో వర్షాలు బాగా కురిసినందున పండుగతోపాటు తమ వ్యాపారం కూడా బాగుంటుందని కళాకారులు భావిస్తున్నారు. తమకు ఎన్ని కష్టాలు ఎదురైనా ఆ విఘ్నేశ్వరుడే తీరుస్తాడని గాఢంగా విశ్వసిస్తున్నారు. వ్యాపారంపై ఆశలు జిల్లాలో ఈసారి వర్షాలు బాగా కురిశాయి. వినాయక చవితి పండుగను ఘనంగా నిర్వహిస్తారని భావిస్తున్నాం. మా వ్యాపారం కూడా బాగా జరుగుతుందన్న నమ్మకం ఉంది. మిగతా ప్రాంతాల కంటే ఈ జిల్లాలోనే వినాయక చవితిని ఘనంగా నిర్వహిస్తారు. – జోదా, వినాయక విగ్రహాల కళాకారుడు, రాజస్థాన్ –––––– మాకూ పండుగ సంతోషం మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఈ జిల్లాలో వినాయక విగ్రహాల వ్యాపారం బాగుంటుంది. ఈ జిల్లాకు రావాలని మా ప్రాంతాల కళాకారులంతా ఆశిస్తారు. ఈసారి ఇక్కడ మంచి వర్షాలు కురవడంతో వ్యాపారంపై మా ఆశలు కూడా పెరిగాయి. నాలుగు పైసలు కళ్ల చూడగలమన్న విశ్వాసం సంతోషాన్ని కలిగిస్తోంది. – మశ్రరామ్, వినాయక విగ్రహాల కళాకారుడు, రాజస్థాన్ -
క్రేన్ తో దొంగతనానికి వచ్చి..
తలకొండపల్లి: చోరీ ఘటన సినిమా సీన్‌ను తలపించింది.. క్రేన్ సహాయంతో ఓ భారీ వినాయక విగ్రహాన్ని ఎత్తుకెళ్లేందుకు దొంగలు విఫలయత్నం చేశారు. అయితే క్రేన్ బురదలో కూరుకుపోవడంతో ప్రయత్నం బెడిసి విగ్రహాన్ని అక్కడే వదిలేసి పారిపోయారు. ఈ సంఘటన సోమవారం మండలంలోని వెల్జాల్ గ్రామంలో సంచలనం రేకెత్తించింది. గ్రామశివారులోని వెంకాయకుంటలో ఆరుబయట అతిపురాతన వినాయక విగ్రహం ఉంది. ఈ విగ్రహానికి అత్యంత పవిత్రత ఉందని ఈ ప్రాంతవాసుల ప్రగాఢనమ్మకం. కోరినకోర్కెలుతీర్చే దేవుడిగా గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. అయితే ఇంతటి విశిష్టత కలిగిన వినాయకుడి విగ్రహాన్ని దొంగలు ఎత్తుకెళ్లేందుకు పథకం రచించారు. ఆదివారం అర్ధరాత్రి క్రేన్‌తో వెంకాయకుంటకు చేరుకున్నారు. విగ్రహాన్ని ట్రక్కు, లారీ, తదితర వాహనాల్లో వేయడానికి యత్నించారు. కొద్దిదూరం పాటు విగ్రహాన్ని క్రేన్‌సాయంతో కదిలిం చారు. లారీలో వేస్తుండగా క్రేన్ బురదలో కూరుకుపోయింది. ఎంత ప్రయత్నించినా కదలకపోవడంతో దుండగులు విగ్రహంతో పాటు క్రేన్‌ను అక్కడే వదిలిపారిపోయారు. సోమవారం ఉదయం అటుగా వెళ్లిన స్థానికులు కొందరు క్రేన్‌ను గమనించి పోలీసులకు సమాచారమందించారు. ఆమనగల్లు సీఐ వేణుగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐలు మహేందర్, శ్రీనివాసులు, సాయికుమార్ అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. స్థానికులను అడిగి వివరాలు ఆరాతీరు. గ్రామస్తుల ఆందోళన క్రేన్‌ను అక్కడినుంచి తరలించేందుకు సన్నాహాలు చేశారు. గ్రామస్తులు క్రేన్‌ను ఎక్కడికీ తరలించొద్దని పోలీసులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. యజమాని ఇక్కడికి రావాలని, విగ్రహం చోరీ వివరాలను వెల్లడించాలని పట్టుబట్టారు. పోలీస్‌లు ఎంతచెప్పినా వినిపించుకోలేదు. దీంతో పోలీసులు, గ్రామస్తులకు కొద్దిసేపు వా గ్వాదం కొనసాగింది. విషయం తెలుసుకున్న మాజీ ఏంపీపీ శ్రీనివాస్‌యాదవ్‌తో పాటు తహశీల్దార్ జ్యోతిలు సంఘటన స్థలానికి చేరుకున్నారు. వినాయకుడి విగ్రహాన్ని యథాస్థానంలో ప్రతిష్టింపజేస్తామని ఇరువర్గాలను శాంతింపజేయడంతో గొడవ సద్దుమణిగింది. అక్కడే ఉన్న క్రేన్‌సాయంతో పూర్వస్థానంలో ఉంచారు. విగ్రహాన్ని అభిషేకించి ప్రత్యేకపూజలు జరిపారు. కేసుదర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. క్రేన్‌ను సీజ్‌చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
తెలుగు వినాయకులకు విశేష పూజలు
పింప్రి, న్యూస్‌లైన్: పుణే తెలుగు సమాజ్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠిం చిన వినాయక విగ్రహం రోజూ భక్తులతో విశేష పూజలు అందుకుంటోంది. శ్రీ బాలాజీ గణేష్ ఉత్సవ మిత్రమండలి గత పదేళ్లుగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఖడికిరేంజ్ హిల్స్‌లో ఏర్పాటు చేసిన ఈ వినాయక విగ్రహానికి శుక్రవారం సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఖడికి కంటోన్మెంట్ బోర్డు ఉపాధ్యక్షుడు మనీషానంద్, స్థానిక కార్పొరేటర్ సునీల్ జాదవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు ప్రజలు, మరాఠీలు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఇదిలాఉండగా స్థానిక తెలుగు మహిళలు మండపం ఆవరణలో రంగురంగుల ముగ్గులు వేసి తెలుగుదనం ఉట్టిపడేలా చేశారు. ప్రతి ఏటా మరాఠీయులతో కలిసి గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని పుణే తెలుగు సమాజ్ అధ్యక్షుడు సుబ్బలక్ష్మయ్య (స్వామి) తెలిపారు. రోజూ సాయంత్రం అధిక సంఖ్యలో తెలుగు మహిళలు ఇక్కడికి తరలి వచ్చి భక్తి పాటలు, కీర్తనలు ఆలపిస్తున్నారని ఆయన తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నామన్నారు. శుక్రవారం నాటి పూజల్లో సమితి కార్యాధ్యక్షుడు వెంకటేశ్వర్లు, కార్యదర్శి రాధాకృష్ణ, సభ్యులు పెంచలయ్య, కొండయ్య, కృష్ణంరాజు, పూలయ్య పాల్గొన్నారు. నిమజ్జనమైన తెలుగుసేన వినాయకుడు బోరివలి, న్యూస్‌లైన్: గోరేగావ్ పశ్చిమంలోని మోతీలాల్‌నగర్‌లో ముంబై తెలుగుసేన ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణనాథుడిని శుక్రవారం నిమజ్జనం చేశారు. గోరేగావ్ సముద్రపు ఒడ్డున ఉన్న ఓ నీటిగుంటలో నిమజ్జనం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక శివసేన ఎమ్మెల్యే సుభాష్ దేశాయ్, కార్పోరేటర్ లోచనాచవాన్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. తెలుగు యువమిత్ర మండలి ఆధ్వర్యంలో.. ఈ మండలి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణనాథుడు ఐదు రోజులపాటు విశేష పూజలు అందుకొని శుక్రవారం సాయంత్రం నిమజ్జన మయ్యాడు. గోరేగావ్ పశ్చిమం తీన్ డోంగ్రి ప్రాంతంలో ఉండే కరీంనగర్ ప్రజలు గత 1986 నుంచి క్రమం తప్పకుండా గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ శ్రమజీవి సంఘం ఆధ్వర్యంలో.. అంధేరి (పశ్చిమం) సుభాష్‌నగర్‌లో నల్గొండ జిల్లా వాసులు ప్రతిష్ఠించిన వినాయక విగ్రహాన్ని తెలంగాణ డప్పులతో నృత్యాలు చేస్తూ నిమజ్జనం చేశారు. తెలంగాణ అనుకూల ప్రకటన రావడంతో తమ ప్రాంతంలో తొలిసారిగా విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ఇదే మొదటిసారని వారు పేర్కొన్నారు. వర్సోవా సముద్రతీరంలో నిమజ్జనం చేశామని సంఘం అధ్యక్షులు నిమ్మల యాదయ్య, కార్యదర్శి ఎన్.నర్సిహ్మ, ఎన్.ఉమ, రామచంద్రం, వై.సురేష్, ఎన్.నాగేష్ తెలిపారు. 52,525 విగ్రహాలకు నిమజ్జనం సాక్షి, ముంబై: గత ఐదు రోజులుగా పూజలందుకున్న వాటిలో 52,525 వినాయక విగ్రహాలు శుక్రవారం నిమజ్జనమయ్యాయి. ఇందులో ఇళ్లలో ప్రతిష్ఠించినవి 47,735 కాగా, 431 విగ్రహాలు సార్వజనిక మండళ్లకు చెందిన విగ్రహాలు. వీటిలో 5,292 విగ్రహాలను తాత్కాలిక చెరువుల్లో నిమజ్జనం చేశారని కార్పొరేషన్ అధికారి ఒకరు వెల్లడించారు. భక్తులు సముద్రం లోపలికి వెళ్లకూడదని బీఎంసీ అధికారులు హెచ్చరించినా కొంత మంది వినిపించుకోకుండా చాలా దూరం వెళ్లి నిమజ్జనం చేశారని బృహన్ముంబై సార్వజనిక్ గణేషోత్సవ్ సమన్వయ సమితికి చెందిన నరేష్ దహిబావ్కర్ తెలిపారు. భివండీలో ఘనంగా నిమజ్జనం భివండీ, న్యూస్‌లైన్: ఐదు రోజుల గణపతి నిమజ్జనోత్సవాలు శుక్రవారం సాయంత్రం ఘనంగా జరిగాయి. భక్తులు వినాయకుడికి ఆఖరిహారతి అందించి భక్తిశ్రద్ధలతో వీడ్కోలు పలికారు. తెలుగుప్రజలు అధిక సంఖ్యలో నివసించే పద్మనగర్ నుంచి పెద్ద ఎత్తున గణపతి విగ్రహాలు నిమజ్జనమయ్యాయి. ఈ ప్రాంతంలోని ప్రతి వీధీ తెలుగువారితో కిటకిటలాడింది. అయితే సార్వజనిక మండళ్లలో చాలా తక్కువ గణపతులు నిమజ్జనానికి వచ్చాయని కార్పొరేషన్ సిబ్బంది తెలిపారు. ఐదు రోజులు పూజలందుకున్న వినాయకుడిని స్థానిక వరాలదేవి చెరువు, కామ్‌వారి నది ఘాట్, ఫేనేఘాట్, కామత్‌ఘర్ ఘాట్, టేమ్ఘర్, నార్‌పోళి, కరవళి ఘాట్ల వద్ద నిమజ్జనం చేశారు. 63 సార్వజనిక గణపతులు, 8,100 ఇంటి గణపతులు, 775 గౌరీగణపతుల విగ్రహాలు నిమజ్జనమయ్యాయని కార్పొరేషన్ తెలిపింది. విగ్రహాలను తోపుడుబళ్లు, లారీలు, టెంపోలు, కార్లలో తీసుకురాగా, కొందరు తలపై పెట్టుకొని ఘాట్లకు వచ్చారు. ఈ సందర్భంగా భివండీ-నిజాంపుర మున్సిపల్ కార్పొరేషన్ (బీఎన్‌ఎంసీ) నిమజ్జన స్థలాల వద్ద భారీ ఏర్పాట్లు చేసింది. డిప్యూటీ మేయర్ మనోజ్ కాటేకర్, ప్రభాగ్ సమితి-మూడు అధికారి సుధామ్ జాదవ్, సభాపతి మురళి మచ్చ, కార్పొరేటర్లు సంతోశ్ శెట్టి, లక్ష్మీ పాటిల్, సామాజిక కార్యకర్త వినోద్ పాటిల్, అనిల్ పాటిల్ వరాలదేవి ఘాట్ వద్ద భక్తులకు స్వాగతం పలికారు. తెలుగు కార్పొరేటర్ మురళి మచ్చ ఇంట్లో ప్రతిష్ఠించిన గణపతిని ఇదే ఘాట్‌లో నిమజ్జనం చేశారు.