పిస్టల్ చూపించి బెదిరించారు
పిస్టల్ చూపించి బెదిరించారు
Published Sun, Nov 22 2015 2:20 AM | Last Updated on Sun, Sep 3 2017 12:49 PM
* అందుకే నా భర్త ప్రాణహాని లేదని చెప్పారు
* లేదంటే భార్యాపిల్లలను మళ్లీ చూడలేవన్నారు
* గంగిరెడ్డి భార్య మాళవిక ఆరోపణ
* కక్షసాధింపుతోనే తప్పుడు కేసులు పెట్టారు
* ఆయనపై ఉన్నవి రెండు కేసులే..
* ఇపుడు ఏకంగా చంపాలని చూస్తున్నారు
* ఏం జరిగినా చంద్రబాబు సర్కారుదే బాధ్యత
సాక్షి, హైదరాబాద్: ఎర్రచందనం స్మగ్లింగ్ ఆరోపణలపై పోలీసుల అదుపులో ఉన్న గంగిరెడ్డికి టీడీపీ నేతల నుంచి ప్రాణహాని ఉందని ఆయన భార్య మాళవిక ఆందోళన వ్యక్తం చేశారు. తన భర్తను ఎన్‌కౌంటర్ చేస్తారని భయంగా ఉందన్నారు. మారిషస్ నుంచి తరలిస్తుండగా గంగిరెడ్డిని పోలీసులు పిస్టల్‌తో బెదిరించి భయపెట్టటంతో ప్రాణహాని లేదని మీడియాకు చెప్పారని తెలిపారు. తన భర్త ప్రాణాలను కాపాడాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. తన భర్తకు ఏదైనా అయితే అందుకు చంద్రబాబు ప్రభుత్వానిదే బాధ్యత అని స్పష్టం చేశారు. శనివారం ఆమె ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ కక్షసాధింపుతోనే తన భర్తపై తప్పుడు కేసులు పెట్టారని పేర్కొన్నారు. వివరాలు ఆమె మాటల్లోనే..
బెదిరించి చెప్పించారు
'నా భర్తను మారిషస్ నుంచి తీసుకొచ్చే మార్గంలో పిస్టల్‌తో బెదిరించారు. వారు చెప్పినట్లు చెప్పకపోతే భార్య, పిల్లలను కూడా చూసుకోలేవంటూ భయపెట్టారు. అందుకనే మొన్న మీడియాతో మాట్లాడుతూ తనకు ఎలాంటి ప్రాణహానీ లేదని చెప్పారు. కానీ నేను జైలుకు వెళ్లి ఆయన్ను కలిస్తే తాను ఎందుకలా చెప్పాల్సి వచ్చిందో వివరించారు. పిస్టల్‌తో బెదిరించారు. మిమ్మల్ని మళ్లీ చూస్తానో లేదోనన్న భయంతో అలా చెప్పాల్సి వచ్చిందని తెలిపారు. ఇటీవల బస్సులో ప్రయాణిస్తున్న 20 మంది అమాయకులను తీసుకువచ్చి అడవిలో ఎన్‌కౌంటర్ చేసి చంపేశారు. ఆయన్ను కూడా అలా చేస్తారని భయంగా ఉంది. పారిపోతున్నారు.. పారిపోతున్నారు అని పదేపదే చెబుతున్నారు. కానీ మా ఆయన పారిపోవడం లేదు. కోర్టు ఎలాంటి శిక్ష విధించినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారు.
అయితే మాకు అనుమానాలున్నాయి. అందుకే మీడియా ద్వారా గవర్నర్‌గారికి విజ్ఞప్తి చేసుకునేదేమిటంటే... మేం మీ దగ్గరకు వచ్చి లేఖ ఇచ్చేంత శక్తి కలిగిన వాళ్లం కాదు సార్.. నా మాటలను మీరు పరిగణనలోకి తీసుకుని నా భర్తకు ఎలాంటి హానీ లేకుండా సురక్షితంగా ఉండేటట్లు చూడాలని కోరుతున్నాను... జైలులో ఆయనను ఏమన్నా చేస్తారన్న అనుమానాలు ఉండబట్టే నేను ఇలా మీడియా ముందుకు రావలసి వచ్చింది. జైలులో గానీ, కోర్టుకు తీసుకెళ్లే సమయంలో గానీ, ఆహారం ద్వారా గానీ దేనిద్వారా అయినా ఆయనకు హాని జరిగితే అందుకు పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వమే వహించాలి..
నాడు చంద్రబాబే తెలియదని చెప్పలేదా?
అలిపిరి ఘటనలో 2003లో మా ఆయన్ను ఇంటరాగేషన్ పేరుతో తీసుకెళ్లి చాలా హింసించారు. మానసికంగానే కాదు శారీరకంగానూ హింసించారు. ఇప్పుడు కూడా కస్టడీకి తీసుకునేటపుడు గానీ, వాయిదాలకు తీసుకెళ్లే మార్గమధ్యంలో గానీ ఎన్‌కౌంటర్ చేస్తారని భయంగా ఉంది. అలిపిరి ఘటనలో నా భర్త ప్రమేయమున్నదన్న వార్తలు అవాస్తవం. ఆనాటి చానళ్ల వార్తలు గానీ, పేపర్ల వార్తలు గానీ చూడండి. ఎక్కడా నా భర్త పేరు లేనేలేదు. మా ఆయన అంతటివాడు కాదు. కేవలం కక్ష సాధించడానికే ఈ కేసులు పెట్టారు. ఆనాడు చంద్రబాబు స్వయంగా కోర్టుకు వెళ్లి ఈయనెవరో తనకు తెలియదని చెప్పారు కూడా.
రెండే కేసులు.. మిగిలినవన్నీ కక్షపూరితం..
డీజీపీ రాముడుగారు గంగిరెడ్డిపై 28 కేసులున్నాయని చెబుతున్నారు. వాస్తవానికి ఆయనపై రెండే కేసులున్నాయి. వాటిలో ఒక కేసులో శిక్ష అనుభవించారు. కానీ ఆయనను మారిషస్ నుంచి తీసుకురావడం కోసం రద్దయిపోయిన కేసులో ప్రత్యేకంగా జీవో జారీ చేసి అక్కడి నుంచి తీసుకువచ్చారు. ఇవన్నీ కక్షపూరిత చర్యలు కావా.. అందుకనే మాకు అనుమానాలున్నాయి. ఆయన బెరైటిస్ ఎక్స్‌పోర్ట్ పర్మిషన్ల కోసం దుబాయి వెళ్లారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గవర్నర్‌కు లేఖ ఇచ్చారు. ఆ తర్వాత లుక్ అవుట్ నోటీసులు, రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. దానివల్ల భయపడి ఆయన అక్కడ ఉండి ఉండవచ్చు కానీ పారిపోయే ఉద్దేశం ఆయనకు లేదు. ఆయనపై మోపిన కేసులకు ఆయనకు సంబంధం లేదు. అందుకు అనేక ఉదాహరణలు చెప్పగలను. ఆయన దుబాయిలో ఉన్నారని అన్ని మీడియాలలో వచ్చింది. కానీ ఆయన కోడూరు తాలూకా ఓబుళవారిపల్లిలో దగ్గరుండి ఎర్రచందనం మోయిస్తున్నారని కేసులు పెట్టారు. చంద్రబాబునాయుడి మెప్పు పొందడం కోసమే పోలీసులు ఇలాంటి తప్పుడు కేసులు పెడుతున్నారు.
రాజకీయంగా కక్షసాధించేందుకే..
మొదటి నుంచి మేం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. 1992 నుంచి మాపై కక్షసాధిస్తున్నారు. 2003లోనూ, 2014లోనూ ఎన్నికల ముందు ఆయనపై కేసులు పెట్టి వేధిస్తున్నారు. మా తాతగారైన పెంచలరెడ్డిగారు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 1981 వరకు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1982లో మా బావగారైన బ్రహ్మానందరెడ్డిగారు పంచాయతీ ప్రెసిడెంట్ అయ్యారు. ఆ తర్వాత ఆయన మండలాధ్యక్షుడిగా, డీసీసీ బ్యాంకు చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం కోడూరు తాలూకా పార్టీ ఇన్‌చార్జిగా ఉన్నారు. మా తండ్రిగారైన బాబుల్‌రెడ్డి పుల్లంపేట ప్రెసిడెంట్ కాగా, మా అమ్మగారు అనాసంద్రం ప్రెసిడెంట్. మాది పూర్తిగా రాజకీయ కుటుంబం. అందుకే టీడీపీవారు కక్షసాధిస్తున్నారు.
మాకు వేల కోట్ల ఆస్తులా..?
నాటుసారా కాసి ఈ స్థితికి ఎదిగామని ఆరోపిస్తున్నారు. కానీ అది సరికాదు. మాకు వేల కోట్ల ఆస్తులున్నాయన్నది కూడా వట్టిమాట. వ్యవసాయ కుటుంబం మాది. 2000 సంవత్సరం నుంచి సాయిబాలాజీ కన్‌స్ట్రక్షన్స్ అనే కంపెనీ ఉంది. మా ఆస్తి మూడునాలుగు కోట్లుంటుంది. అది కూడా కన్‌స్ట్రక్షన్స్ కంపెనీలో వర్క్‌లు చేశాం. హెచ్‌ఆర్ పల్వరైజింగ్ మిల్లు ఉంది. లీజుకు తీసుకున్న పెట్రోల్ బంక్ ఉంది. అంతేకానీ నాటుసారా కాసేంత దుస్థితిలో మేం లేం.'అని మాళవిక వివరించారు.
Advertisement
Advertisement