ర్యాగింగ్‌తో భవిష్యత్తు నాశనం
-
వెఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి
పట్నంబజారు : ప్రపంచంలోనే అణుబాంబు కన్నా విద్యార్థులే శక్తివంతులని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి అన్నారు. వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఆధ్వర్యంలో బుధవారం చుట్టుగుంట సెంటర్‌లో యాంటీ ర్యాగింగ్ పోస్టర్లును ఆవిష్కరించారు. అప్పిరెడ్డి మాట్లాడుతూ ర్యాగింగ్‌కు పాల్పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. చదువుతో పాటు విద్యార్థుల సమస్యలపై పోరాడి వాటిని పరిష్కరించే దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. విద్యార్థి వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న చంద్రబాబు సర్కార్‌పై పోరాడాలన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాతంశెట్టి రామాంజనేయులు (లాలుపురం రాము) మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకి లేదని విద్యార్థి, యువజనుల బలం వైఎస్సార్ సీపీకి ఉందన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి అంగడి శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులకు సంబంధించిన పథకాలకు తిలోదకాలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. చైతన్య మాట్లాడుతూ ప్రతి కళశాలలో అవగాహన సదస్సులు నిర్వహిస్తూ.. ర్యాగింగ్‌తో జరిగే అనర్థాలు వివరిస్తున్నట్లు తెలిపారు. పార్టీ విద్యార్థి విభాగం జిల్లా కమిటీ నేతలు విఠల్, వినోద్, పేటేటి బాజి, నాని, పవన్, వెంకట్, శివ, సాయిగోపి, సునీల్ తదితరులు పాల్గొన్నారు.