మెరుపు.. మైమరపు
-
ఉత్తుంగ తరంగంగా ఒడిశా బాలల నాట్యం
-
గోఠిపువా నాట్యం ఉత్కంఠభరితం
-
ప్రాచీన కళారూపం.. నయన మనోహరం
విశాఖ–కల్చరల్ : మేఘాలు గజ్జెలు కట్టి ఘల్లుమని నాట్యం చేసినట్టు.. మెరుపు తీగలు ఇలకు దిగివచ్చి ఆడిపాడి అలరించినట్టు.. ఒడిశా చిన్నారులు చేసిన నాట్యం నయనమనోహరమై, హదయ సమ్మోహనమై సాగింది. ఒడిశా సంప్రదాయ కళావైభవ ప్రదర్శనతో ఊహాలోకం కళ్లెదుట ప్రత్యక్షమైన అనుభూతి కలిగింది. ఒడిశా సంప్రదాయ నాట్యమైన గోఠిపువా ప్రదర్శనతో గీతం విశ్వవిద్యాలయ వేదిక ఉప్పొంగిపోయింది. శనివారం పట్టభద్రుల దినోత్సవాన్ని పురస్కరించుకొని చిన్నారులు రమణీయ ఆహార్యంతో, అంతకుమించిన హావభావ ప్రదర్శనతో గీతం ఆనంద డోలికల్లో తేలిపోయింది. భారతీయ యువతకు మన సంస్కృతి సంప్రదాయాల వైభవాన్ని తెలియజెప్పే ధ్యేయంతో స్పిక్‌మెకే సంస్థ ఈ ప్రదర్శన ఏర్పాటు చేసింది. ప్రసిద్ధ క్షేత్రమైన పూరీకి చేరువలోని రఘురాజ్‌పూర్ నుంచి వచ్చిన బాలలు కనువిందైన వేషధారణలో కళ్లు చెదిరేలా నత్య ప్రదర్శనలు ఇచ్చారు. శ్రీకష్ణుని జీవితాన్ని ప్రతిబింబిస్తూ యోగా భంగిమలను తలపించుతూ నాట్యం చేశారు. గ్రామీణ వాయిద్యాలతో మనోహర సంగీతాన్ని వినిపిస్తూ నేత్రపర్వంగా గంటసేపు నాట్యమాడారు. ఈ సందర్భంగా స్పిక్‌మేకే సంస్థ ప్రతినిధి టి.గంగాదేవి మాట్లాడుతూ దేశం గర్వించదగ్గ ఈకళాకారులకు కార్యక్రమాన్ని అంకితం చేస్తున్నట్టు తెలిపారు. మన ప్రాచీన కళలను కాపాడుకోవలసిన బాధ్యత అందరిపై ఉందని గీతం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి.షీలా చెప్పారు.