లింగాలపల్లిలో బేస్ !
- వెయ్యిమందికి పైగా సీఆర్‌పీఎఫ్ బలగాలు
- దుమ్ముగూడెం సరిహద్దులోనూ మరో బేస్‌క్యాంప్?
- పైడిగూడెంను సందర్శించిన సీఆర్‌పీఎఫ్ ఐజీ
- పైడిగూడెంను సందర్శించిన సీఆర్‌పీఎఫ్ ఐజీ
దుమ్ముగూడెం : తెలంగాణ సరిహద్దు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా కుంట బ్లాక్ పరిధిలోని మారాయిగూడెం అటవీ ప్రాంతం లింగాలపల్లి గ్రామ సమీపంలో సీఆర్‌పీఎఫ్ బేస్ క్యాంపును ఏర్పాటు చేస్తున్నారు. రెండురోజులుగా ఈ క్యాంప్ పనుల్లో యంత్రాంగం తలమునకలైంది. ఇప్పటికే ఈ ప్రాంతానికి వెయ్యి మందికి పైగా ఉన్న సీఆర్‌పీఎఫ్ బలగాలు చేరుకున్నాయి. దుమ్ముగూడెం మండలంలోని సరిహద్దు గ్రామాల్లోనూ ఒక బేస్ క్యాంప్ ఏర్పాటుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే దీనికి ఇంకా ప్రభుత్వం నుంచి అనుమతి లభించలేదని సమాచారం. లింగాలపల్లిలో బేస్‌క్యాంప్ ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతంలో మావోల ప్రభావం తగ్గుతుందని పోలీసుల ఆలోచనగా తెలుస్తోంది. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో ధర్మపేట, ఎలకనగూడెం, కిష్టారంలో బేస్ క్యాంప్‌లు చేశారు. ఆ సరిహద్దు అటవీ ప్రాంతంలో మావోల ప్రభావం తగ్గించారు. మావోయిస్టులు తమ ఉనికిని చాటుకోవడానికి మారాయిగూడెం పోలీస్‌స్టేషన్ పరిధిలోని వంకమడుగు, కొత్తూరు, గంగిలేరులతో పాటు కిష్టారం పోలీస్‌స్టేషన్ సరిహద్దు గ్రామాలైన రాయిగూడెం, బట్టిగూడెం తదితర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లా కమిటీతో పాటు కిష్టారం , గొల్లపల్లి ఏరియా కార్యదర్శులు తమ బలగాలతో తిరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారని వినికిడి. ఆ ప్రభావాన్ని పూర్తిస్థాయిలో నిరోధించడానికి లింగాలపల్లిలో బేస్‌క్యాంప్ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఈ బేస్ క్యాంప్ ఏర్పాటుతో సీజీ మారాయిగూడెంతో పాటు దుమ్ముగూడెం మండల సరిహద్దున ఉన్న కొత్తూరు, కమలాపురం, ఎర్రబోరు, అడవిరామవరం ,కొమ్మనాపల్లి తదితర గ్రామాలలోకి మావోలు ప్రవేశించే అవకాశాలు తగ్గుముఖం పట్టనున్నాయి. ఇప్పటికే లింగాలపల్లికి చేరుకున్న పోలీస్ బలగాలు ఆ ప్రాంతాన్ని పూర్తిగా జల్లెడ పడుతున్నాయి. బేస్‌క్యాంప్ నిర్మాణ సామగ్రిని తరలించే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.
మండలంలోని గౌరారం, పైడిగూడెం అటవీ ప్రాంతాన్ని సీఆర్‌పీఎఫ్ ఐజి సదానంద్, ఇతర పోలీస్ అధికారులు సోమవారం సందర్శించారు. రక్షణ నిమిత్తం పోలీసులు ఆ ప్రాంతానికి భారీగా తరలివెళ్లారు. భద్రాచలం హెలీకాప్టర్‌లో వచ్చిన ఆయన వాహనంలో దుమ్ముగూడెం చేరుకున్నారు. అక్కడి నుంచి స్థానిక పోలీస్ అధికారుల బందోబస్తుతో పైడిగూడెం అటవీ ప్రాంతానికి తరలివెళ్లారు. అక్కడి నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని ధర్మపేట బేస్‌క్యాంప్‌నకు వెళ్లారని ప్రచారం సాగుతున్నా పోలీసులు ధ్రువీకరించడం లేదు. దుమ్ముగూడెం మండలం సరిహద్దు గ్రామం పైడిగూడెంలో బేస్‌క్యాంప్ ఏర్పాటుకు స్థలం పరిశీలించేందుకు వెళ్లినట్లు సమాచారం.