ఇస్లామాబాద్: పాకిస్థాన్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు పేట్రేగిపోతున్నారు. తెహ్రిక్ ఏ తాలిబాన్ పాకిస్థాన్(టీటీపీ) సంస్థతో పాక్ ప్రభుత్వం చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందం కిందటి ఏడాది ముగిసింది. అప్పటి నుంచి దేశంలో ఉగ్రవాదం మళ్లీ ఊపందుకుంది. తాజాగా శనివారం పంజాబ్ ప్రావిన్స్‌లోని మియన్వాలిలో గల వైమానిక స్థావరంపై శనివారం తెల్లవారుజామున ఉగ్రవాదులు దాడి చేశారు. అయితే సైన్యం అప్రమత్తం కావడంతో పెను విధ్వంసం తప్పింది.
శనివారం ఫైటర్ జెట్లు ఉన్న స్థావరంలోకి ఐదు నుంచి ఆరుగురు సాయుధ ఉగ్రవాదులు తెల్లవారుజామున చొరబాటుకు యత్నించారని పాక్ ఎయిర్ ఫోర్స్ (పీఏఎఫ్) ధ్రువీకరించింది. తాము అప్రమత్తమై ఆ దాడిని భగ్నం చేశామని పేర్కొంది. కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని, ఒక పాక్ సైనికుడు వీరమరణం పొందారని.. పలువురికి గాయాలయ్యాయని ప్రకటించుకుంది. ఈ ఘటనలో ఎయిర్‌బేస్‌లోని మూడు యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయని వెల్లడించింది.
దాడికి గల కారణాలు తెలియ రావాల్సి ఉంది. అయితే.. ఇది బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(BLA) పనేనని ఆర్మీ వర్గాలు భావిస్తున్నాయి. బీఎల్‌ఏ.. పాక్ నుంచి స్వాతంత్రం కోరుతూ 2004 నుంచి పోరాడుతోంది. సాధారణ పౌరులనే కాకుండా.. ఈ ఏడాది జూన్‌లోనూ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని తొలిసారిగా దాడికి పాల్పడింది.
ఇదిలా ఉంటే.. శుక్రవారం కూడా పాక్‌లో ఉగ్రదాడి జరిగింది. పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో పోలీసు గస్తీ బృందాలే లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు బాంబులతో దాడికి దిగారు. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా వీరిలో ఇద్దరు పోలీసులు. మరో 24 మంది గాయాలపాలయ్యారని ఓ అధికారి తెలిపారు. ఇదిలాఉంటే.. గత ఆరునెలలుగా పఖ్తుంఖ్వా, బలూచిస్థాన్ ప్రాంతాలు తీవ్ర ఉగ్రవాద దాడులను చవిచూస్తున్నాయి.
అయితే ఈ దాడులు పాక్ భద్రతకు ముప్పుగా మారడమే కాదు.. పొరుగు దేశాలతో సంబంధాలను దెబ్బ తీస్తున్నాయి. తాలిబన్, హక్కానీ నెట్‌వర్క్‌లను ప్రోత్సహిస్తూ పాక్ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోందన్న విమర్శలు ఉన్నాయి. కానీ, ఆ విమర్శలను తోసిపుచ్చుతున్న పాక్.. తాము ఉగ్ర పీడిత దేశమేనని చెప్పుకుంటోంది. మరోవైపు అంతర్జాతీయ సమాజం, ఉగ్రవాదాన్ని అణచివేసే చర్యలు చేపట్టాలంటూ పాక్‌ను కోరుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment