నగరంలో లిక్కర్‌ చాక్లెట్ల దందా! | liquor chocolate business in the city ! | Sakshi
Sakshi News home page

నగరంలో లిక్కర్‌ చాక్లెట్ల దందా!

Published Fri, Sep 2 2016 11:48 PM | Last Updated on Thu, Jul 18 2019 2:26 PM

పోలీసులు స్వాధీన పర్చుకున్న లిక్కర్‌ చాక్లెట్‌లు ఇవే.. - Sakshi

పోలీసులు స్వాధీన పర్చుకున్న లిక్కర్‌ చాక్లెట్‌లు ఇవే..

అబిడ్స్‌: లిక్కర్‌ చాక్లెట్స్‌ తయారుచేస్తున్న ఫ్యాక్టరీపై తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు నిర్వహించారు. చాక్లెట్‌పై లిక్కర్‌ పేరుండడం, అందులో వైన్‌ కలుపుతున్నట్లు సమాచారం రావడంతో శుక్రవారం ఓల్డ్‌ మల్లేపల్లిలోని ఈ అక్రమ చాక్లెట్‌ ఫ్యాక్టరీపై దాడులు చేశారు. రాష్ట్ర ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌ ఈఎస్‌ శశిధర్‌రెడ్డి, ఏఈఎస్‌ నాగేందర్, ఎస్‌ఐ పవన్‌గౌడ్‌లు తమ సిబ్బందితో కలిసి దాడులు చేయడంతో ఈ దాడుల్లో భారీ ఎత్తున లిక్కర్‌ చాక్లెట్స్‌ స్వాధీనం చేసుకున్నారు.

400 చాక్లెట్‌ పీస్‌లను ఎక్సైజ్‌ పోలీసులు స్వాధీనం చేసుకొని ధూల్‌పేట్‌ ఎక్సైజ్‌ పోలీస్‌స్టేషన్‌కు అప్పగించారు. నగరంలోని ఐమాక్స్‌ థియేటర్‌ వద్ద వీటిని విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు సమాచారం రావడంతో రాష్ట్ర ఎక్సైజ్‌ కమిషనర్‌ చంద్రవదన్‌ వెంటనే దాడులు నిర్వహించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మద్యం బాటిళ్ల కలకలం ..
ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు జరిపినప్పుడు లిక్కర్‌ చాక్లెట్ల ఫ్యాక్టరీలో నాలుగు మద్యం ఫుల్‌బాటిళ్లను ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  మధురావైన్, టీచర్స్, బకాడీ కంపెనీలకు చెందిన నాలుగు ఫుల్‌ బాటిల్స్‌ లభించడంతో లిక్కర్‌ చాక్లెట్స్‌లలో వైన్‌ కలుపుతున్నట్లు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. లిక్కర్‌ చాక్లెట్‌పై రూ.60 ధరను ముద్రించారు. ఇదిలా ఉండగా నగరంలోని పలు ప్రాంతాల్లో లిక్కర్‌ చాక్లెట్‌లు తయారవుతున్నాయని ఎక్సైజ్‌ పోలీసులకు సమాచారం అందింది.

ప్రయోగశాలకు పంపుతున్నాం...  
ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్న లిక్కర్‌ చాక్లెట్‌లను ప్రయోగశాలకు పంపుతున్నామని ధూల్‌పేట్‌ ఎక్సైజ్‌ అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ అంజిరెడ్డి తెలిపారు. ల్యాబ్‌ నుంచి నివేదిక వచ్చిన వెంటనే కేసులు నమోదు చేస్తామని వివరించారు. ముందుగా లిక్కర్‌ చాక్లెట్‌లు తయారు చేస్తున్న కృష్ణకు నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిపారు.

నిద్రమత్తులో వాణిజ్య పన్నుల శాఖ ...
ఓల్డ్‌ మల్లేపల్లిలో అక్రమంగా తయారుచేస్తున్న లిక్కర్‌ చాక్లెట్‌ల ఫ్యాక్టరీపై రాష్ట్ర ఎక్సైజ్‌ పోలీసులు దాడిచేసినట్లు వార్తలు మీడియాలో, సోషల్‌ మీడియాలో వచ్చినా  వాణిజ్య పన్నుల శాఖ అధికారులు మాత్రం నిద్రమత్తును వీడలేదు. చార్మినార్‌ కమర్షియల్‌ ట్యాక్స్‌ డీసీ అధికారులు గానీ, మెహిదీపట్నం సీటీవో సర్కిల్‌ అధికారులు గానీ ఓల్డ్‌మల్లేపల్లిలోని లిక్కర్‌ చాక్లెట్‌లు తయారు చేస్తున్న 11–1–940/1/2 నెంబర్‌ గల అడ్డా వద్దకు రాకపోవడంతో పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇదే ప్రాంతంలో మరిన్ని అక్రమ చాక్లెట్‌ ఫ్యాక్టరీలతో పాటు పలు అక్రమ ఫ్లైవుడ్‌ గోడౌన్‌లు ఉన్నా కూడా, వాణిజ్య పన్నుల శాఖ అధికారులు చర్యలు తీసుకోవడంలేదు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌ ఈ ప్రాంతంలో దాడులు చేపడితే అక్రమాలను అరికట్టవచ్చని పలువురు పేర్కొంటున్నారు.


 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement