అబ్కారీ గ‘మ్మత్తు’
హోటళ్లు, దాబాల్లో యథేచ్ఛగా మద్యం విక్రయాలు
అర్ధరాత్రి వరకూ తాగేందుకు అనుమతులు
ప్రాణం..లేదా పరువు పోగొట్టుకుంటున్న మందుబాబులు
అనంతపురం సెంట్రల్ :
– అనంతపురం నగర శివార్లలో ఉంటున్న శ్రీధర్‌రెడ్డి ఓ దాబాలో స్నేహితులతో కలిసి అర్ధరాత్రి వరకూ మద్యం తాగి ఇంటికి బయలు దేరాడు. అయితే మార్గమధ్యలో రోడ్డు ప్రమాదానికి గురై మృత్యువాత పడ్డాడు.
– గుత్తికి చెందిన సుధాకర్ జాతీయ రహదారి పక్కన ఉన్న ఓ డాబాలో మద్యం తాగాడు. అర్ధరాత్రి వేళ ఇంటికి వెళ్తుండగా ట్రాఫిక్ పోలీసులు అతనిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేశారు. కోర్టు ముందు హాజరు పర్చగా జరిమానా విధించి రిమాండ్‌కు పంపించారు. దీంతో కుటుంబ సభ్యులతో పాటు బంధువుల్లో సైతం అతనికి పరువు పోయింది.
అర్ధరాత్రి మద్యం అమ్మకాల వల్ల జరిగే అనర్థాలకు పైరెండు సంఘటనలు ఉదాహరణలు మాత్రమే..ఇలాంటి నిత్యం ఏదోచోట చేటే చేసుకుంటూనే ఉన్నాయి. అయినప్పటికీ సంబంధిత శాఖ మాత్రం తనకేం తెలియనట్టు వ్యవహరిస్తోంది.
తప్పు ఒకరిది..శిక్షణ మరొకరికి..
రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసు అధికారులు చేస్తున్నది మంచిదే అయినా... తప్పు చేస్తున్నది ఒకరైతే.. శిక్ష వేస్తున్నది మరొకరికి అన్నట్లు తయారైంది. హోటళ్లు, దాబాల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేసుకోవడానికి ఎక్సైజ్ అధికారులు అనధికార అనుమతులు మంజూరు చేశారు. ఎంతైనా అమ్ముకోండి.. నెల మామూళ్లు పంపిస్తే చాలు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో మద్యం దొరకని హోటల్, డాబా ఉందంటే అది అతిశయోక్తిగానే అనిపిస్తుంది. కోరుకున్న బ్రాండ్ ఏదైనా సరే ఇట్టే సరఫరా చేస్తున్నారు. కేవలం మద్యం అమ్మడమే కాదు అర్ధరాత్రి వరకూ తాగేందుకు అనుమతులు ఇస్తున్నారు. ఫలితంగా రోడ్డు ప్రమాదాల రూపంలో ప్రాణాలు పొగొట్టుకుని భారీ మూల్యం చెల్లించుకుంటున్నారు.
హోటల్, డాబాలు వదిలి ప్రజలపై కేసులా?
ఏపీ ప్రొహిబిషన్ చట్టం 1995, సెక్షన్ 9 ప్రకారం దాబాలు, హోటల్స్‌లో మద్యం సేవించడం, విక్రయించడం చట్ట విరుద్ధం. కానీ ఈ చట్టం జిల్లాలో ఎక్కడా అమలు కావడం లేదు. ఎక్సైజ్, పోలీస్ అధికారులకు వైన్‌షాపుల నుంచే కాకుండా దాబాల నుంచి కూడా నెలనెలా మామూళ్లు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. వైన్ షాపుల్లో అధిక ధరలకు అమ్ముకున్నా... డాబాల్లో అర్ధరాత్రి వరకూ తప్ప తాగుతున్నా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
గత ఐదేళ్ల రోడ్డు ప్రమాదాల వివరాలు
సంవత్సరం ప్రమాదాలు మృతులు
2012–13 89 23
2013–14 133 24
2014–15 102 35
2015–16 73 41
2016–ఇప్పటి వరకూ 28 12
తాగి నడిపితే కేసులు నమోదు
మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. ముఖ్యంగా అర్ధరాత్రి 12 గంటల సమయంలో నగరంలో ద్విచక్ర వాహనాలు ఢీకొని మృతి చెందిన ఘటనలు ఇటీవల ఎక్కువగా ఉన్నాయి. ఇందుకు కారణం తాగి వాహనాలు నడపడమే. ఇలాంటి ప్రమాదాలు నివారించేందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేస్తున్నాం. అంతేకాదు..తీవ్రతను బట్టి రిమాండ్‌కు కూడా పంపుతున్నాం.
– నరసింగప్ప, డీఎస్పీ, అనంతపురం ట్రాఫిక్ ∙
దాడులు నిర్వహిస్తాం
దాబాలు, హోటళ్లలో మద్యం విక్రయించడం, తాగడం చట్ట రీత్యా నేరం. దీన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. దాడులు చేసిన సమయంలో దాబాల్లో మద్యం ఉన్నట్లైతే నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తాం.
–అనసూయదేవి, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్