
ఏరులై పారుతున్న మద్యం
► జాతీయ రహదారులపైనే అమ్మకాలు
► మోటారు సైకిళ్లపై సరుకు పెట్టి సరఫరా
► విచ్చలవిడిగా బెల్టుషాపుల నిర్వహణ
► కోర్టు ఆదేశాలు బేఖాతర్
► నరసాపురంలో మద్యం సిండికేట్ల బరితెగింపు
నరసాపురం: జాతీయ రహదారులకు 500 మీటర్లు మేర మద్యం షాపులు ఉండకూడదని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను తుంగలో తొక్కుతున్నారు. మున్సిపాలిటీ పరిధిలో రాష్ట్ర రహదారులను జిల్లా రోడ్లుగా మారుస్తూ ప్రభుత్వం గండి కొట్టగా వ్యాపారులు మరో రకంగా రెచ్చిపోతున్నారు. నరసాపురం పట్టణం గుండా 216 జాతీయ రహదారి వెళ్లడంతో పాత షాపు ఒక్కటి కూడా ఇక్కడ యథాస్థానంలో పెట్టే వీలు లేపోయింది. దీంతో మద్యం వ్యాపారులు బస్టాండ్ చుట్టుపక్కల గతంలో ఉండే మద్యం దుకాణాల స్థానంలో బెల్టుషాపులు పెట్టి అమ్మకాలు సాగిస్తున్నారు. ఏకంగా మోటార్‌సైకిళ్లపై పెట్టి జాతీయ రహదారిమీదే మద్యం విక్రయాలు సాగిస్తుండడం విశేషం.
విచ్చల‘ విడి’గా..
నరసాపురంలో పది రోజులుగా విచ్చల విడిగా బెల్టుషాపుల నిర్వహణ సాగుతోంది. మున్సిపాలిటీ పరిధిలో రాష్ట్ర రహదారులను జిల్లా రోడ్లుగా మార్చినా మినహాయింపు దక్కక పోవడంతో బస్టాండ్ చుట్టుపక్కల పాత షాపుల స్థానంలో బెల్టుషాపులు నిర్వహిస్తున్నారు. మద్యం వ్యాపారి కూనపరెడ్డి ప్రసాద్ ఈ వ్యవహారం వెనుక కీలకపాత్ర పోషిస్తున్నారని సమాచారం. ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టుకున్న మద్యం బాటిళ్లు కూడా కూనపరెడ్డి ప్రసాద్‌వని చెబుతున్నారు. బస్టాండ్ పక్కన, గడ్డి బజార్ సందులోను పాత షాపుల్లోనే ఫుల్‌గా స్టాకు నిలువ ఉంచి రాత్రి, పగలూ తేడా లేకుండా బెల్టు విక్రయాలు సాగిస్తున్నారు.
5,291 బాటిళ్ల మద్యం స్వాధీనం
బెల్టుషాపు నిర్వహణ నిమిత్తం పట్టణంలో ఓ చెరువుగట్టు వద్ద షెడ్డులో దాచి ఉంచిన మద్యం బాటిళ్లను సోమవారం ఉదయం 6 గంటలకు ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 110 కేసుల మద్యం సీసాలతో పాటుగా, విడిగా మరో 11 బాటిళ్లు ఉన్న కేస్‌ను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఎస్పీ సీతారామస్వామి సిబ్బందితో కలిసి దాడిచేసి పట్టుకున్నారు. ఈ దాడిలో మొత్తం రూ.5 లక్షల విలువగల 5,291 బాటిళ్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్టు డీఎస్పీ చెప్పారు. పట్టుకున్న మద్యం బాటిళ్లు మండలంలోని లక్ష్మణేశ్వరం గ్రామంలో నడుస్తున్న గాయత్రి వైన్స్‌షాపులోనివని గుర్తించారు. ఈ దాడిలో రుస్తుంబాధకు చెందిన మోకా సత్యనారాయణ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు నరసాపురం ఎక్సైజ్ సీఐ టి.గోపాలకృష్ణ చెప్పారు. మద్యం బాటిళ్లు గాయత్రి వైన్స్‌లోనివి కాగా, వాటిని పట్టుకున్న షెడ్డు మరో మద్యం వ్యాపారి కూనపరెడ్డి ప్రసాద్‌దని చెప్పారు. సత్యనారాయణ తనకు ఏ సంబంధం లేదని చెప్పడం విశేషం.