beltshops
-
బార్ల సమయం కూడా కుదింపు.. నేడు ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ నేటి నుంచి ఆరంభం కానుంది. కొత్త విధానంలో ప్రభుత్వం దశల వారీగా మద్యనిషేధానికి అధిక ప్రాధాన్యం ఇవ్వనుంది. ఇందులో భాగంగా మంగళవారం అక్టోబర్ 1 నుంచి పలు కీలక మార్పులను సర్కారు తీసుకొస్తోంది. ప్రధానంగా మద్యం అమ్మకాలు ఇకపై రాత్రి 8 గంటల వరకే పరిమితం చేస్తున్నారు. దీని ప్రభావం ఒకరోజు ముందుగానే కనపడింది. మద్యం షాపులు సోమవారం రాత్రి పదిగంటలకే మూతబడ్డాయి. అలాగే, బార్ల సమయం కూడా కుదిస్తున్నారు. దీనికి సంబంధించి మంగళవారం ఉత్తర్వులు వెలువడనున్నాయి. మరోవైపు.. మంగళవారం నుంచి ప్రైవేట్ మద్యం షాపులు కనుమరుగు కానున్నాయి. వీటి స్థానంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వమే 3,500 షాపులను అధికారికంగా నిర్వహించనుంది. దశల వారీగా మద్యనిషేధం అమలుచేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ షాపులను నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. రాష్ట్రం మొత్తమ్మీద 4,380 మద్యం షాపులు ఉంటే.. వీటిలో 20 శాతం షాపులు అంటే 880 తగ్గించి 3,500 షాపులు నిర్వహించబోతున్నారు. ఇందుకు ఎక్సైజ్ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. అలాగే, నూతన మద్యం పాలసీలో ప్రకటించిన విధంగా షాపుల సమయ వేళల్ని మారుస్తూ సోమవారం రాష్ట్ర ప్రభుత్వం జీఓ జారీచేసింది. గతంలో ఉ.10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రభుత్వ మద్యం దుకాణంలో అమ్మకాల వేళల్ని ప్రకటించారు. అయితే, ఈ సమయ వేళల్ని మరింత కుదించారు. ఉ.11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే అమ్మకాలు చేపట్టాలని గతంలో జారీచేసిన నోటిఫికేషన్‌ను సవరించారు. బెల్ట్ షాపుల నుంచి మొదలు.. ఇదిలా ఉంటే.. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం కాగానే ఎక్సైజ్ యంత్రాంగం ముందుగా బెల్ట్‌షాపుల భరతం పట్టింది. అప్పటివరకు గ్రామాల్లో వేళ్లూనుకుని ఉన్న వీటిని పూర్తిగా నిర్మూలించారు. అలాగే, గతంలో మాదిరిగా ప్రభుత్వ మద్యం షాపుల్లో ఇప్పుడు ఎమ్మార్పీ ఉల్లంఘనలకు పాల్పడితే వెంటనే సంబంధిత షాపులో సిబ్బందిని తొలగిస్తారు. అంతేకాదు.. పాత పద్ధతిలో మాదిరిగా పర్మిట్ రూమ్లూ ఉండవు. ఈ నూతన విధానం పక్కాగా అమలుచేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 3,500 ప్రభుత్వ మద్యం దుకాణాల్లో 3,500 మంది సూపర్వైజర్లు, 8,033 మంది సేల్స్మెన్లను నియమించారు. గరిష్టంగా మూడు బాటిళ్లే అమ్మకం మద్యం అమ్మకాలు, కొనుగోళ్లపైనా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అమ్మకాల్లో సమయ వేళల్ని తగ్గించింది. దీంతో పాటు ఒక్కో వ్యక్తి ఏ సైజులో అయినా సరే.. మూడు బాటిళ్లకు మించి కొనుగోలుకు అనుమతించరు. బీరు అయితే 650 ఎంఎల్ బాటిళ్లు ఆరు వరకు కొనుగోలు చేసుకోవచ్చు. మరోవైపు.. అక్రమ మద్యం తయారీకి అడ్డుకట్ట వేసేందుకు స్పిరిట్ అమ్మకాలపైనా ఆంక్షలు విధించారు. కాగా, దశల వారీగా మద్యపాన నిషేధాన్ని రాష్ట్ర ప్రభుత్వం మహిళా పోలీసింగ్‌తో అమలుచేయనుంది. బార్ల సమయ వేళలూ కుదింపు రాష్ట్రంలో 880 బార్లున్నాయి. మద్యం షాపుల వేళల మాదిరిగానే బార్ల సమయ వేళల్ని కుదించనున్నారు. ప్రస్తుతం బార్లలో ఉ.10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు, ఫుడ్ సర్వింగ్ పేరిట అర్ధరాత్రి 12 గంటల వరకు అమ్మకాలు సాగుతున్నాయి. వీటిపైనా నేడు అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి. అలవాటు మాన్పించడమే లక్ష్యంగా ప్రభుత్వ నిర్ణయం దశల వారీ మద్య నిషేధంలో మరో కీలక నిర్ణయం ప్రభుత్వం ప్రకటించింది. మద్యాన్ని ప్రజలకు దూరం చేసే ప్రక్రియలో భాగంగా మద్యం ధరలను పెంచింది. పెంచిన రేట్లు మంగళవారం నుంచే అమల్లోకి వస్తాయి. మద్యం రేట్లు పెంచితే ప్రజలు మద్యానికి దూరం అవుతారని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్రలో మద్యం రేట్లు షాక్ కొట్టేలా పెంచుతామని, తద్వారా మద్యాన్ని ప్రజలకు దూరం చేస్తామని చెప్పారు. ఈ మేరకు ఇప్పుడు బ్రాండ్లతో సంబంధం లేకుండా మద్యం బాటిళ్లపై ధరలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన ధరలు ఈ విధంగా ఉన్నాయి. -
మద్యనిషేధంలో మరో ముందడుగు
సాక్షి, అమరావతి : అధికారంలోకి వస్తే దశల వారీగా మద్యనిషేధం అమలు చేస్తామని ప్రకటించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వేదికపై నుంచే ఆ హామీ అమలుకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే బెల్టు షాపులను పూర్తిస్థాయిలో నియంత్రించి, సమయపాలనను కట్టుదిట్టంగా అమలుచేస్తున్న సర్కారు.. అక్టోబర్ 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిస్థాయిలో మద్యం షాపులను నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకు తొలి బడ్జెట్ సమావేశాల్లోనే చట్టాన్ని సైతం సవరించారు. ఇందులో భాగంగా ఇప్పుడు సెప్టెంబర్ 1 ఆదివారం నుంచి ప్రయోగాత్మకంగా 503 మద్యం షాపుల నిర్వహణకు సర్కారు శ్రీకారం చుడుతోంది. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో దుకాణాలను నిర్వహించడం ద్వారానే దశల వారీ మద్యనిషేధం సాధ్యమని ప్రభుత్వం దృఢసంకల్పంతో ఉంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధితో ఉన్నారనడానికి గత మూడు నెలల పాలనలో తీసుకున్న నిర్ణయాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. మద్యాన్ని ఆదాయ వనరుగా చూడని సర్కార్ కాగా, మద్యాన్ని ఆదాయ వనరుగా చూడని సర్కారు ఏదైనా ఉందంటే అది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్కారు అనే చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో మాదిరి మద్యం విక్రయాలకు టార్గెట్లు పెట్టలేదు.. ఆదాయం తగ్గడానికి వీల్లేదని, వీలైనంత ఎక్కువ మద్యం తాగించాలనే చాటుమాటు ఆదేశాలు కూడా ఇవ్వలేదు. ఫలితంగా మద్యం ఆదాయం తగ్గిపోయింది. గత ఆర్థిక సంవత్సరం జూలై వరకు ఎక్సైజ్ రెవెన్యూ కింద రూ.2,635.14 కోట్ల ఆదాయం వస్తే.. ఈ ఆర్థిక సంవత్సరం జూలై వరకు రూ.2,184.17 కోట్లు వచ్చింది. అంటే.. రూ.450.97 కోట్లు తగ్గిపోయింది. దశల వారీ మద్య నిషేధం అమలు ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే, గత ఆర్థిక సంవత్సరం జూలై వరకు 125లక్షల కేసుల వరకు మద్యం విక్రయాలు జరిగితే.. ఈ ఆర్థిక సంవత్సరం జూలై వరకు 113 లక్షల కేసులే అమ్ముడయ్యాయి. లైసెన్సు ఫీజుల ఆదాయంలోనూ తగ్గుదల ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించాలని నిర్ణయించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 777 మద్యం దుకాణాల యజమానులు తమ లైసెన్సులను రెన్యువల్ చేసుకోలేదు. దీంతో లైసెన్సు ఫీజు ద్వారా వచ్చే ఆదాయం కూడా పడిపోయింది. గత ఆర్థిక సంవత్సరం జూలై వరకు లైసెన్సు ఫీజు ద్వారా రూ.508.44 కోట్ల ఆదాయం రాగా.. ఈ ఆర్థిక సంవత్సరం జూలై వరకు లైసెన్సు ఫీజు ద్వారా కేవలం రూ.146.69 కోట్లు మాత్రమే వచ్చింది. దీంతోపాటు 20 శాతం మేర మద్యం దుకాణాలను తగ్గించేస్తున్నారు. అంటే.. 4,380 వరకు ఉన్న మద్యం దుకాణాలను అక్టోబర్ 1 నుంచి 3,500కు తగ్గించేస్తున్నారు. అంతేకాక.. జాతీయ, రాష్ట్ర రహదారుల వెంబడి మద్యం దుకాణాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే, ఇప్పటివరకు ఒక్కో వ్యక్తికి ఆరు బాటిళ్ల వరకు విక్రయించుకునేలా ఉన్న నిబంధనను సైతం సవరించి మూడు బాటిళ్లకు పరిమితం చేస్తున్నారు. ఇలా క్రమంగా వీలైనంత మేర పేదలకు, మధ్య తరగతి వారికి మద్యం అందుబాటులో లేకుండా చేస్తానని.. వాటి ధరలను షాక్ కొట్టేలాగ పెంచుతామని ఎన్నికల ముందే వైఎస్ జగన్ ప్రకటించిన హామీ కార్యరూపం దాలుస్తోంది. ఇందులో భాగంగా మద్యం ధరలను కూడా పెంచేందుకు వీలుగా అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు. ధరలకూ రెక్కలు కాగా, ఒక్కో మద్యం బాటిల్‌పై రూ.5 నుంచి రూ.40 వరకు పెంచాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్‌ను కూడా పెంచేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ పెంపుదల ఆదాయం కోసం కాదని.. పేదలు, మధ్య తరగతి ప్రజలను మద్యం నుంచి దూరంగా ఉంచేందుకేనని అధికార వర్గాలు స్పష్టంచేశాయి. ఎటువంటి రాజకీయ జోక్యం లేకపోవడంతో పాటు ముఖ్యమంత్రి గట్టి పట్టుదలతో ఉండటంతో ఇప్పటికే బెల్టుషాపులు లేకుండా చేయగలిగామని, అంతేకాక.. నిర్ధారించిన సమయానికి మద్యం దుకాణాలు మూసివేస్తున్నారని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. కాగా.. మద్యం నియంత్రణ, నిషేధంలో భాగంగా డీఎడిక్షన్ కేంద్రాలకు నిధులను రూ.500 కోట్లకు కూడా పెంచినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే.. ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించడంవల్ల కొత్తగా 16వేల మందికి ఉద్యోగాలు కూడా వస్తాయని అధికార వర్గాలు తెలిపాయి. -
ఫుల్‌గా తాగించారు.. దండిగా దోచేశారు
సాక్షి, అమరావతి: చంద్రబాబు తన హయాంలో రాష్ట్రమంతటా మద్యాన్ని ఏరులై పారించారు. టార్గెట్లు పెట్టి మరీ మద్యాన్ని తాగించే చర్యలు చంద్రబాబు సర్కారులో యథేచ్ఛగా కొనసాగాయి. ఏకంగా రూ.75,259 కోట్లను ప్రజల నుంచి పీల్చేశారు. ప్రజలను మద్యానికి బానిసలు చేసేలా డోర్ డెలివరీ ఏర్పాట్లు జరిగాయి. జనాన్ని మద్యానికి బానిసలుగా మార్చేశారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా పగటి పూట కూడా రోడ్డు పక్కన టీ తాగినట్లు మద్యం దుకాణాల దగ్గర బహిరంగంగా తాగేస్తున్నారు. మహిళలు అటువైపు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి తెచ్చారు. మద్యంతో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటున్నా, ఆర్థికంగా నష్టపోయి లక్షలాది కుటుంబాలు రోడ్డున పడుతున్నా, ఆడపడుచుల ఆక్రందనలు వినిపిస్తున్నా...చంద్రబాబు ఖజానా నింపుకోవడానికే ప్రాధాన్యమిచ్చారు. ఇంకా తాగించండంటూ ఆబ్కారీ శాఖకు టార్గెట్లు పెట్టి మరీ బొక్కసాన్ని నింపుకున్నారు. టీడీపీ హయాంలో అడుగడుగునా బెల్ట్ షాపులు... గత ఎన్నికల ముందు బెల్ట్‌షాపులన్నీ తొలగిస్తానంటూ చంద్రబాబు ప్రచారం చేశారు. తొలి సంతకాల్లో బెల్ట్‌షాపుల రద్దును కూడా చేర్చారు. అసలు బెల్ట్ షాపులంటేనే అనధికారికంగా కొనసాగడం. అలాంటి అనుమతి లేని బెల్ట్‌షాపులు రద్దు అంటూ ప్రచారం కోసం ఉత్తర్వులు జారీ చేయించారు. ఆ ఉత్తర్వులు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి తప్ప బెల్ట్‌షాపులు మాత్రం తగ్గలేదు. బాబు హయాంలో జనరల్ స్టోర్స్, పాన్ షాపులు, సొంత నివాసాలు బెల్ట్ షాపులుగా మారాయి. జాతీయ రహదారులవెంట డాబాలు కూడా బెల్ట్‌షాపులుగా కొనసాగాయి. బాబు హామీలకే పరిమితం.. జగన్ చర్యలతో శ్రీకారం... ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నసమయంలో చేపట్టిన పాదయాత్ర సందర్భంగా అన్ని జిల్లాల్లో బెల్ట్‌షాపులపై మహిళలు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు. బెల్ట్‌షాపులు తమ కుంటుంబాలను నాశనం చేస్తున్నాయని, వాటిని తొలగించి తమ కుంటుంబాలను రక్షించాలని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే బెల్ట్‌షాపుల తొలగింపుపై చర్యలను చేపట్టారు. అనుమతి లేని బెల్ట్ షాపుల రద్దుకు చంద్రబాబు ఉత్తర్వులు జారీ చేసి చేతులు దులుపుకోగా జగన్మోహన్రెడ్డి ఉత్తర్వులు ఇవ్వకుండానే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అధికారులు కూడా బెల్ట్‌షాపుల తొలగింపుపై వెంటనే కార్యాచరణకు దిగారు. చంద్రబాబుకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి ఇక్కడే తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో ఇచ్చిన ఆదేశాలను అధికారులు అమలు చేయడానికి నడుం బిగించారు. చంద్రబాబు హాయాంలో రాష్ట్రం వృద్ధి దేవుడెరుగు గానీ మద్యం, బీర్ల అమ్మకాల్లో ఏటా భారీగా వృద్ధి నమోదైంది. మద్యం విక్రయాల ద్వారా ఆర్జించిన సొమ్ము ప్రతీ ఏడాది పెరుగుతూనే పెరుగుతూనే ఉంది. 2014–15లో 11,569.65 కోట్ల రూపాలయ విలువైన మద్యం, బీరు అమ్మకాలు జరగగా, అది చంద్రబాబు పదవినుంచి దిగిపోయేనాటికి రూ. 20,128.42 కోట్లకు చేరిందంటే ఆయన ప్రజలను ఏ స్థాయిలో మద్యానికి బానిసలుగా చేశారో అవగతమవుతోంది. -
ఏరులై పారుతున్న మద్యం
► జాతీయ రహదారులపైనే అమ్మకాలు ► మోటారు సైకిళ్లపై సరుకు పెట్టి సరఫరా ► విచ్చలవిడిగా బెల్టుషాపుల నిర్వహణ ► కోర్టు ఆదేశాలు బేఖాతర్ ► నరసాపురంలో మద్యం సిండికేట్ల బరితెగింపు నరసాపురం: జాతీయ రహదారులకు 500 మీటర్లు మేర మద్యం షాపులు ఉండకూడదని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను తుంగలో తొక్కుతున్నారు. మున్సిపాలిటీ పరిధిలో రాష్ట్ర రహదారులను జిల్లా రోడ్లుగా మారుస్తూ ప్రభుత్వం గండి కొట్టగా వ్యాపారులు మరో రకంగా రెచ్చిపోతున్నారు. నరసాపురం పట్టణం గుండా 216 జాతీయ రహదారి వెళ్లడంతో పాత షాపు ఒక్కటి కూడా ఇక్కడ యథాస్థానంలో పెట్టే వీలు లేపోయింది. దీంతో మద్యం వ్యాపారులు బస్టాండ్ చుట్టుపక్కల గతంలో ఉండే మద్యం దుకాణాల స్థానంలో బెల్టుషాపులు పెట్టి అమ్మకాలు సాగిస్తున్నారు. ఏకంగా మోటార్‌సైకిళ్లపై పెట్టి జాతీయ రహదారిమీదే మద్యం విక్రయాలు సాగిస్తుండడం విశేషం. విచ్చల‘ విడి’గా.. నరసాపురంలో పది రోజులుగా విచ్చల విడిగా బెల్టుషాపుల నిర్వహణ సాగుతోంది. మున్సిపాలిటీ పరిధిలో రాష్ట్ర రహదారులను జిల్లా రోడ్లుగా మార్చినా మినహాయింపు దక్కక పోవడంతో బస్టాండ్ చుట్టుపక్కల పాత షాపుల స్థానంలో బెల్టుషాపులు నిర్వహిస్తున్నారు. మద్యం వ్యాపారి కూనపరెడ్డి ప్రసాద్ ఈ వ్యవహారం వెనుక కీలకపాత్ర పోషిస్తున్నారని సమాచారం. ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్న మద్యం బాటిళ్లు కూడా కూనపరెడ్డి ప్రసాద్వని చెబుతున్నారు. బస్టాండ్ పక్కన, గడ్డి బజార్ సందులోను పాత షాపుల్లోనే ఫుల్‌గా స్టాకు నిలువ ఉంచి రాత్రి, పగలూ తేడా లేకుండా బెల్టు విక్రయాలు సాగిస్తున్నారు. 5,291 బాటిళ్ల మద్యం స్వాధీనం బెల్టుషాపు నిర్వహణ నిమిత్తం పట్టణంలో ఓ చెరువుగట్టు వద్ద షెడ్డులో దాచి ఉంచిన మద్యం బాటిళ్లను సోమవారం ఉదయం 6 గంటలకు ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 110 కేసుల మద్యం సీసాలతో పాటుగా, విడిగా మరో 11 బాటిళ్లు ఉన్న కేస్‌ను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ సీతారామస్వామి సిబ్బందితో కలిసి దాడిచేసి పట్టుకున్నారు. ఈ దాడిలో మొత్తం రూ.5 లక్షల విలువగల 5,291 బాటిళ్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్టు డీఎస్పీ చెప్పారు. పట్టుకున్న మద్యం బాటిళ్లు మండలంలోని లక్ష్మణేశ్వరం గ్రామంలో నడుస్తున్న గాయత్రి వైన్స్షాపులోనివని గుర్తించారు. ఈ దాడిలో రుస్తుంబాధకు చెందిన మోకా సత్యనారాయణ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు నరసాపురం ఎక్సైజ్ సీఐ టి.గోపాలకృష్ణ చెప్పారు. మద్యం బాటిళ్లు గాయత్రి వైన్స్లోనివి కాగా, వాటిని పట్టుకున్న షెడ్డు మరో మద్యం వ్యాపారి కూనపరెడ్డి ప్రసాద్దని చెప్పారు. సత్యనారాయణ తనకు ఏ సంబంధం లేదని చెప్పడం విశేషం. -
ఆ ఊర్లో మందు తాగకూడదు
సిద్దిపేట : ఆగ్రామంలో ఎవరూ మద్యం అమ్మొద్దని పంచాయతీ సభ్యులు తీర్మానం చేశారు. జిల్లాలోని కొండంరాజుపల్లిలో శుక్రవారం గ్రామ సభ నిర్వహించారు. అభివృద్ధి పనులపై చర్చించారు. ఈ సందర్భంగా పలువురు యువకులు మాట్లాడుతూ గ్రామంలో నిర్వహిస్తున్న బెల్ట్‌షాపులతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. చీకటి పడగానే మద్యం సేవించి మందుబాబులు గొడవలకు దిగుతున్నారని తెలిపారు. గ్రామంలో మద్యం విక్రయిస్తే జరిమానా విధించాలని కోరారు. దీనికి స్పందించిన సర్పంచ్ తుంగ కనుకయ్య అప్పటికప్పుడు గ్రామ పంచాయతీలో తీర్మానం ప్రవేశపెట్టగా సభ్యులు ఆమోదించారు. అనంతరం మద్య నిషేధ కమిటీ అధ్యక్షుడిగా శ్రీనివాస్‌రెడ్డి, ఉపాధ్యక్షుడిగా ఎల్ల తిరుపతిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా బాగు తిరుపతి, సభ్యులను ఎన్నుకున్నారు. -
వారే డిక్టేటర్స్
ఎక్సైజ్ వ్యవస్థను శాసిస్తున్న సిండికేట్లు ప్రభుత్వ లక్ష్యాలు చేరాలంటే వారే కీలకం కేసులు ఎవరిపై... ఎప్పుడు నమోదు చేసేదీ నిర్దేశించేది వారే బెల్టుషాపులు.. ఎమ్మార్పీ ఉల్లంఘనలకు దశానిర్దేశం వారిదే అధికారులు కేవలం నిమిత్తమాత్రులే... సాక్షి ప్రతినిధి, విజయనగరం : మద్యాన్ని పూటుగా తాగించాలి. గతేడాది కన్న 15శాతం అదనంగా విక్రయాలు జరిగేలా చూడాలి. ఏం చేస్తారో తెలియదు... ప్రభుత్వానికి మద్యం ఆదాయం భారీగా రావాలి.’ ఇదీ ఎక్సైజ్ అధికారులకు ప్రభుత్వమిచ్చిన లక్ష్యం. ఉన్నవి 207షాపులు... 27బార్లు... ఎంతైనా వీటిలోనే విక్రయించాలి. లైసెన్సు షాపు యజమానులకే ఆ బాధ్యత అప్పగించాలి. అందువల్ల సిండికేట్లను ఆశ్రయించక తప్పట్లేదు. వారి గొంతెమ్మ కోర్కెలకు అధికారులు దాసోహం కాక తప్పడం లేదు. ఇదే అదనుగా ఎమ్మార్పీకి మించి విక్రయించినా... లెక్కలేనన్ని అక్రమ బార్లు నడిపిస్తున్నా... ఇష్టానుసారం బెల్టుషాపులు ఏర్పాటు చేస్తున్నా... అధికారులు కిమ్మనడంలేదు. ఇప్పుడు జిల్లాలో ఎక్సైజ్‌ను శాసిస్తున్నది సిండికేట్లే. ప్రభుత్వమిచ్చిన లక్ష్యం మేరకు విక్రయాలు జరగాలంటే లైసెన్సు షాపులతో అయ్యే పనికాదు. ఇక తప్పనిసరిగా బెల్ట్‌షాపులు ఏర్పాటు చేయాలి. రోజురోజుకూ వీటి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. కొన్ని చోట్ల వేలంపాట నిర్వహించి మరీ ఏర్పాటు చేస్తున్నారు. ఒకప్పుడు జిల్లాలో మూడు నాలుగు వేలు ఉండే బెల్ట్‌షాపులు ఇప్పుడవి 10వేలకు దాటిపోయాయి. వ్యాపారులు అంతటితో ఆగలేదు. ఎంఆర్పీకి మించి విక్రయించుకునే అవకాశమిస్తేనే లక్ష్యాల మేర అమ్మగలమని కండిషన్ పెట్టారు. చేసేదేమి లేక ఎక్సైజ్ అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు. లొసుగులకు పచ్చ జెండా గతేడాది సెప్టెంబర్‌లో లక్షా 52వేల 300 ఐఎంఎల్ కేసులు, 57,848బీరు కేసులు విక్రయించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ సెప్టెంబర్‌లో దానికి 15శాతం పెంచి విక్రయాలు జరపాలి. ఈ ఒక్క సెప్టెంబర్‌లోనే కాదు దాదాపు ప్రతీ నెలా, గతేడాది అదే నెలలో చేసిన విక్రయాలకు 15శాతం అదనంగా విక్రయాలు చేపట్టాలి. అంటే మద్యం ఆదాయాన్ని పెంచుతూ రావాలి. దీని కోసం ఎక్సైజ్ అధికారులు పడరాని పాట్లు పడుతున్నారు. లొసుగులన్నింటికీ పచ్చ జెండా ఊపేస్తున్నారు. బయటికి చెప్పలేకపోయినా కాదనడానికి ఏమీ లేదు. సిండికేట్ల డైరెక్షన్ ప్రకారమే ప్రభుత్వ లక్ష్యాల మేరకు విక్రయాలు జరపాల్సి రావడంతో ఎక్సైజ్ అధికారులు నిమిత్తమాత్రులైపోయారు. సిండికేట్‌గా మారిన వ్యాపారుల డైరెక్షన్ మేరకే నడుచుకోవల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ విధంగా ప్రేక్షక పాత్ర పోషించడం వల్లనే విచ్చలవిడిగా బెల్ట్‌షాపులు, ఎంఆర్పీకి మించి విక్రయాలకు అడ్డు అదుపూ లేకుండా పోయింది. కొన్ని చోట్ల క్వార్టర్ బాటిల్‌పై రూ. 5నుంచి రూ. 10, మరికొన్నిచోట్ల రూ. 10 నుంచి రూ. 15కు పెంచి అమ్ముకుంటున్నారు. దీనికి కొందరు సర్కిల్ ఇన్స్పెక్టర్లు వత్తాసు పలుకుతున్నారు. వారి కనుసన్నల్లోనే బెల్ట్ షాపుల ఏర్పాటుకు వేలం పాటలు కూడా జరుగుతున్నాయన్న ఆరోపణలూ లేకపోలేదు. నేతల అండదండల గురించైతే ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎవరికి అందాల్సిన ముడుపులు వారికి అందడంతో అక్రమాలకు తనవంతు సహకరిస్తున్నారు. పథకం ప్రకారమే కేసులు ఇంత అడ్డగోలుగా జరుగుతున్న విక్రయాలపై స్పందించలేదనే అపవాదు ఎక్సైజ్ అధికారులకు రాకుండా సిండికేట్లే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. సందర్భాను సారంగా ఎవరిపైన ఎంఆర్పీ ఉల్లంఘన కేసు పెట్టాలన్నదానిపై సిండికేట్లు డిక్టేట్ చేస్తున్నాయి. వారే లాటరీ వేస్తారు. అందులో ఏ షాపు పేరు పలికితే దానిపై కేసు పెట్టేలా అధికారులకు సంకేతాలిస్తున్నారన్న వాదనలు ఉన్నాయి. ఆ కేసు పరిష్కారానికయ్యే ఖర్చు అంతా సిండికేట్‌లో ఉన్న వ్యాపారులంతా భరిస్తారు. ఇప్పుడిదొక సంప్రదాయంగా సాగిపోతోంది. ఇలా సిండికేట్ల డైరెక్షన్ కొనసాగుతుండటం వల్లనే ఎంఆర్పీ ఉల్లంఘన కేసులు పెద్దగా నమోదు కావడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు జిల్లా వ్యాప్తంగా కేవలం 11కేసులు మాత్రమే నమోదయ్యాయి. అందులో ఒక్క కొత్తవలస సర్కిల్లో మాత్రం మూడు కేసులు నమోదవ్వగా, మిగతా నెల్లిమర్ల, విజయనగరం–1, గజపతినగరం, బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం, తెర్లాంలో ఒక్కొక్క కేసే నమోదైంది. అడ్డగోలుగా ఎంఆర్పీకి మించి విక్రయాలు ప్రతీచోట జరుగుతున్నాయి. కానీ, ఉల్లంఘన కేసులు మాత్రం ఇప్పటికి ఐదు నెలలవుతన్నా కేవలం 11 నమోదయ్యాయంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. -
ఏపీలో ఏరులై పారనున్న మద్యం
-
బెల్టుషాపులు ఎత్తేయాలని ఏఐవైఎఫ్ ధర్నా
ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలంలో బెల్టుషాపులు ఎత్తివేయాలని ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్(ఏఐవైఎఫ్) ఆధ్వర్యంలో మండల ఎక్సైజ్ కార్యాలయాన్ని ముట్టడించారు. బెల్టుషాపులు ఎత్తివేయాలని ఏఐవైఎస్ సభ్యులు ధర్నా చేశారు. బెల్టుషాపులు ఎత్తివేయకపోతే భవిష్యత్‌లో మరిన్ని ఉద్యమాలు చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు చిరంజీవితో పాటు మండలానికి చెందిన నాయకులు పాల్గొన్నారు.