సాక్షి, అమరావతి : అధికారంలోకి వస్తే దశల వారీగా మద్యనిషేధం అమలు చేస్తామని ప్రకటించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వేదికపై నుంచే ఆ హామీ అమలుకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే బెల్టు షాపులను పూర్తిస్థాయిలో నియంత్రించి, సమయపాలనను కట్టుదిట్టంగా అమలుచేస్తున్న సర్కారు..
అక్టోబర్ 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిస్థాయిలో మద్యం షాపులను నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకు తొలి బడ్జెట్ సమావేశాల్లోనే చట్టాన్ని సైతం సవరించారు. ఇందులో భాగంగా ఇప్పుడు సెప్టెంబర్ 1 ఆదివారం నుంచి ప్రయోగాత్మకంగా 503 మద్యం షాపుల నిర్వహణకు సర్కారు శ్రీకారం చుడుతోంది. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో దుకాణాలను నిర్వహించడం ద్వారానే దశల వారీ మద్యనిషేధం సాధ్యమని ప్రభుత్వం దృఢసంకల్పంతో ఉంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్ధితో ఉన్నారనడానికి గత మూడు నెలల పాలనలో తీసుకున్న నిర్ణయాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి.
మద్యాన్ని ఆదాయ వనరుగా చూడని సర్కార్
కాగా, మద్యాన్ని ఆదాయ వనరుగా చూడని సర్కారు ఏదైనా ఉందంటే అది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్కారు అనే చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో మాదిరి మద్యం విక్రయాలకు టార్గెట్లు పెట్టలేదు.. ఆదాయం తగ్గడానికి వీల్లేదని, వీలైనంత ఎక్కువ మద్యం తాగించాలనే చాటుమాటు ఆదేశాలు కూడా ఇవ్వలేదు. ఫలితంగా మద్యం ఆదాయం తగ్గిపోయింది. గత ఆర్థిక సంవత్సరం జూలై వరకు ఎక్సైజ్ రెవెన్యూ కింద రూ.2,635.14 కోట్ల ఆదాయం వస్తే.. ఈ ఆర్థిక సంవత్సరం జూలై వరకు రూ.2,184.17 కోట్లు వచ్చింది. అంటే.. రూ.450.97 కోట్లు తగ్గిపోయింది. దశల వారీ మద్య నిషేధం అమలు ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే, గత ఆర్థిక సంవత్సరం జూలై వరకు 125లక్షల కేసుల వరకు మద్యం విక్రయాలు జరిగితే.. ఈ ఆర్థిక సంవత్సరం జూలై వరకు 113 లక్షల కేసులే అమ్ముడయ్యాయి.
లైసెన్సు ఫీజుల ఆదాయంలోనూ తగ్గుదల
ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించాలని నిర్ణయించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 777 మద్యం దుకాణాల యజమానులు తమ లైసెన్సులను రెన్యువల్ చేసుకోలేదు. దీంతో లైసెన్సు ఫీజు ద్వారా వచ్చే ఆదాయం కూడా పడిపోయింది. గత ఆర్థిక సంవత్సరం జూలై వరకు లైసెన్సు ఫీజు ద్వారా రూ.508.44 కోట్ల ఆదాయం రాగా.. ఈ ఆర్థిక సంవత్సరం జూలై వరకు లైసెన్సు ఫీజు ద్వారా కేవలం రూ.146.69 కోట్లు మాత్రమే వచ్చింది. దీంతోపాటు 20 శాతం మేర మద్యం దుకాణాలను తగ్గించేస్తున్నారు. అంటే.. 4,380 వరకు ఉన్న మద్యం దుకాణాలను అక్టోబర్ 1 నుంచి 3,500కు తగ్గించేస్తున్నారు. అంతేకాక.. జాతీయ, రాష్ట్ర రహదారుల వెంబడి మద్యం దుకాణాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే, ఇప్పటివరకు ఒక్కో వ్యక్తికి ఆరు బాటిళ్ల వరకు విక్రయించుకునేలా ఉన్న నిబంధనను సైతం సవరించి మూడు బాటిళ్లకు పరిమితం చేస్తున్నారు. ఇలా క్రమంగా వీలైనంత మేర పేదలకు, మధ్య తరగతి వారికి మద్యం అందుబాటులో లేకుండా చేస్తానని.. వాటి ధరలను షాక్ కొట్టేలాగ పెంచుతామని ఎన్నికల ముందే వైఎస్ జగన్ ప్రకటించిన హామీ కార్యరూపం దాలుస్తోంది. ఇందులో భాగంగా మద్యం ధరలను కూడా పెంచేందుకు వీలుగా అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు.
ధరలకూ రెక్కలు
కాగా, ఒక్కో మద్యం బాటిల్‌పై రూ.5 నుంచి రూ.40 వరకు పెంచాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్‌ను కూడా పెంచేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ పెంపుదల ఆదాయం కోసం కాదని.. పేదలు, మధ్య తరగతి ప్రజలను మద్యం నుంచి దూరంగా ఉంచేందుకేనని అధికార వర్గాలు స్పష్టంచేశాయి. ఎటువంటి రాజకీయ జోక్యం లేకపోవడంతో పాటు ముఖ్యమంత్రి గట్టి పట్టుదలతో ఉండటంతో ఇప్పటికే బెల్టుషాపులు లేకుండా చేయగలిగామని, అంతేకాక.. నిర్ధారించిన సమయానికి మద్యం దుకాణాలు మూసివేస్తున్నారని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. కాగా.. మద్యం నియంత్రణ, నిషేధంలో భాగంగా డీఎడిక్షన్ కేంద్రాలకు నిధులను రూ.500 కోట్లకు కూడా పెంచినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే.. ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించడంవల్ల కొత్తగా 16వేల మందికి ఉద్యోగాలు కూడా వస్తాయని అధికార వర్గాలు తెలిపాయి.
మద్యనిషేధంలో మరో ముందడుగు
Published Sun, Sep 1 2019 4:55 AM | Last Updated on Sun, Sep 1 2019 11:51 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment