సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ నేటి నుంచి ఆరంభం కానుంది. కొత్త విధానంలో ప్రభుత్వం దశల వారీగా మద్యనిషేధానికి అధిక ప్రాధాన్యం ఇవ్వనుంది. ఇందులో భాగంగా మంగళవారం అక్టోబర్ 1 నుంచి పలు కీలక మార్పులను సర్కారు తీసుకొస్తోంది. ప్రధానంగా మద్యం అమ్మకాలు ఇకపై రాత్రి 8 గంటల వరకే పరిమితం చేస్తున్నారు. దీని ప్రభావం ఒకరోజు ముందుగానే కనపడింది. మద్యం షాపులు సోమవారం రాత్రి పదిగంటలకే మూతబడ్డాయి. అలాగే, బార్ల సమయం కూడా కుదిస్తున్నారు. దీనికి సంబంధించి మంగళవారం ఉత్తర్వులు వెలువడనున్నాయి. మరోవైపు.. మంగళవారం నుంచి ప్రైవేట్ మద్యం షాపులు కనుమరుగు కానున్నాయి.
వీటి స్థానంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వమే 3,500 షాపులను అధికారికంగా నిర్వహించనుంది. దశల వారీగా మద్యనిషేధం అమలుచేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ షాపులను నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. రాష్ట్రం మొత్తమ్మీద 4,380 మద్యం షాపులు ఉంటే.. వీటిలో 20 శాతం షాపులు అంటే 880 తగ్గించి 3,500 షాపులు నిర్వహించబోతున్నారు. ఇందుకు ఎక్సైజ్ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. అలాగే, నూతన మద్యం పాలసీలో ప్రకటించిన విధంగా షాపుల సమయ వేళల్ని మారుస్తూ సోమవారం రాష్ట్ర ప్రభుత్వం జీఓ జారీచేసింది. గతంలో ఉ.10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రభుత్వ మద్యం దుకాణంలో అమ్మకాల వేళల్ని ప్రకటించారు. అయితే, ఈ సమయ వేళల్ని మరింత కుదించారు. ఉ.11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే అమ్మకాలు చేపట్టాలని గతంలో జారీచేసిన నోటిఫికేషన్‌ను సవరించారు.
బెల్ట్ షాపుల నుంచి మొదలు..
ఇదిలా ఉంటే.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కాగానే ఎక్సైజ్ యంత్రాంగం ముందుగా బెల్ట్‌షాపుల భరతం పట్టింది. అప్పటివరకు గ్రామాల్లో వేళ్లూనుకుని ఉన్న వీటిని పూర్తిగా నిర్మూలించారు. అలాగే, గతంలో మాదిరిగా ప్రభుత్వ మద్యం షాపుల్లో ఇప్పుడు ఎమ్మార్పీ ఉల్లంఘనలకు పాల్పడితే వెంటనే సంబంధిత షాపులో సిబ్బందిని తొలగిస్తారు. అంతేకాదు.. పాత పద్ధతిలో మాదిరిగా పర్మిట్ రూమ్‌లూ ఉండవు. ఈ నూతన విధానం పక్కాగా అమలుచేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 3,500 ప్రభుత్వ మద్యం దుకాణాల్లో 3,500 మంది సూపర్‌వైజర్లు, 8,033 మంది సేల్స్‌మెన్‌లను నియమించారు.
గరిష్టంగా మూడు బాటిళ్లే అమ్మకం
మద్యం అమ్మకాలు, కొనుగోళ్లపైనా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అమ్మకాల్లో సమయ వేళల్ని తగ్గించింది. దీంతో పాటు ఒక్కో వ్యక్తి ఏ సైజులో అయినా సరే.. మూడు బాటిళ్లకు మించి కొనుగోలుకు అనుమతించరు. బీరు అయితే 650 ఎంఎల్ బాటిళ్లు ఆరు వరకు కొనుగోలు చేసుకోవచ్చు. మరోవైపు.. అక్రమ మద్యం తయారీకి అడ్డుకట్ట వేసేందుకు స్పిరిట్ అమ్మకాలపైనా ఆంక్షలు విధించారు. కాగా, దశల వారీగా మద్యపాన నిషేధాన్ని రాష్ట్ర ప్రభుత్వం మహిళా పోలీసింగ్‌తో అమలుచేయనుంది.
బార్ల సమయ వేళలూ కుదింపు
రాష్ట్రంలో 880 బార్లున్నాయి. మద్యం షాపుల వేళల మాదిరిగానే బార్ల సమయ వేళల్ని కుదించనున్నారు. ప్రస్తుతం బార్లలో ఉ.10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు, ఫుడ్ సర్వింగ్ పేరిట అర్ధరాత్రి 12 గంటల వరకు అమ్మకాలు సాగుతున్నాయి. వీటిపైనా నేడు అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి.
అలవాటు మాన్పించడమే లక్ష్యంగా ప్రభుత్వ నిర్ణయం
దశల వారీ మద్య నిషేధంలో మరో కీలక నిర్ణయం ప్రభుత్వం ప్రకటించింది. మద్యాన్ని ప్రజలకు దూరం చేసే ప్రక్రియలో భాగంగా మద్యం ధరలను పెంచింది. పెంచిన రేట్లు మంగళవారం నుంచే అమల్లోకి వస్తాయి. మద్యం రేట్లు పెంచితే ప్రజలు మద్యానికి దూరం అవుతారని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్రలో మద్యం రేట్లు షాక్ కొట్టేలా పెంచుతామని, తద్వారా మద్యాన్ని ప్రజలకు దూరం చేస్తామని చెప్పారు. ఈ మేరకు ఇప్పుడు బ్రాండ్లతో సంబంధం లేకుండా మద్యం బాటిళ్లపై ధరలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన ధరలు ఈ విధంగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment