బినామీలు బలే!
► మద్యం టెండర్లల్లో భారీగా పేదలు
► కూలి పనికి వెళ్లే వారి చేత ఐటీ రిటర్న్స్ దాఖలు
► రేషన్ కార్డు, ఇతర సంక్షేమ పథకాలు రద్దయ్యే అవకాశం
ప్రొద్దుటూరు క్రైం: మద్యం టెండర్లలో ఈసారి బినామీల హవా ఎక్కువగా ఉంది. చాలా మంది మద్యం వ్యాపారులు తమ బినామీల పేర్ల మీద టెండర్లు వేయించారు. భారీ ఎత్తున పోటీ నెలకొనడంతో మద్యం వ్యాపారులు, సిండికేట్లు ఎలాగైనా తమ షాపులను నిలబెట్టుకోవాలని అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. పనిలోపనిగా తమ వద్ద పనిచేసే పనివార్ల పేరుతో దరఖాస్తులు భారీగా దాఖలు చేయించారు. ఇదే ఇప్పుడు వారి కొంప ముంచనుంది. వివరాల్లోకి వెళితే..జిల్లాలో 255 మద్యం షాపులకు దరఖాస్తులు ఆహ్వానించగా 29వ తేదీ సాయంత్రం వరకు 1,900 దరఖాస్తులు వచ్చాయి. 30వ తేదీ (గురువారం) సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఇచ్చిన గడువును మరో మూడు గంటలుపెంచి 8 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఎక్సైజ్ అధికారులు ఆదేశాలిచ్చారు. దీంతో గడువులోగా 3,654 దరఖాస్తులు అందాయి. 31 మధ్యాహ్నం 2 గంటల నుంచి జెడ్పీ ఆవరణంలో కలెక్టర్ సమక్షంలో లక్కీ డిప్ ద్వారా మద్యం దుకాణాలను కేటాయిస్తారు.
కూలి పనికి వెళ్లే వారి చేత ఐటీ రిటర్న్స్ దాఖలు: ఈసారి ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలనే నిబంధన వస్తుందని పసిగట్టిన కొందరు వ్యాపారులు తమ అనుమాయులకు పాన్‌కార్డులను ఇప్పించారు. ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్న 12-15 రోజుల్లోనే పాన్‌కార్డు జారీ చేస్తున్నారు. వీరిలో చాలామంది కూలి పనికి వెళ్తున్న వారు ఉన్నట్లు సమాచారం. మద్యం షాపులకు దరఖాస్తు చేసుకునే వారు ఈఎండీ కింద రూ.3 లక్షలు డీడీ తీయాల్సి ఉంది. ఒకరి పేరు మీదనే ఎక్కువ మొత్తంలో డీడీ తీస్తే ఐటీశాఖతో సమస్య వస్తుందని భావించిన మద్యం వ్యాపారులు తమ ఇళ్లల్లో పనిచేసే వారు, బంధువుల పేరు మీద దరఖాస్తు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. గత రెండు మూడు రోజుల నుంచి ఆదాయపు పన్ను శాఖ కార్యాలయానికి ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి వ్యాపారులు పెద్దఎత్తున వస్తున్నారు. వీరిలో కూలి పనికి వెళ్లేవారు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. రూ.లక్షల్లో వీరు ఆదాయం చూపించడంతో భవిష్యత్తులో వారి రేషన్‌కార్డు, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమయ్యే ప్రమాదం ఉంది. ఈపాస్‌తో పాటు ఆధార్‌కార్డు కూడా నమోదు చేస్తుండటంతో వారికి దక్కే ప్రభుత్వ లబ్ధి పూర్తిగా రద్దు అయ్యే అవకాశం ఉందని తెలియడంతో బినామీలు ఆందోళన చెందుతున్నారు. కొత్తగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన వారిపై ఐటీ అధికారులు కూడా దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. నాలుగైదు రోజుల్లో వారి చిట్టా బయటికి తీసే అవకాశం ఉంది.
పెద్ద సంఖ్యలో దరఖాస్తులు: ఒక్క ప్రొద్దుటూరు ఎక్సైజ్ డివిజన్ పరిధిలో సుమారు 105 మద్యం షాపులు ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్లలోపు ఉన్న మద్యం షాపులను తొలగిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం నూతన మద్యం విధానంతో టెండర్లకు శ్రీకారం చుట్టింది. 105 షాపుల్లో 90 శాతం 500 మీటర్లలోపు ఉన్నాయి. జిల్లాలో ప్రొద్దుటూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని మద్యం షాపులకు మంచి డిమాండు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ 22 మద్యం షాపులు, 8 బార్‌లు ఉన్నాయి. ఒక్కో మద్యం షాపునకు సుమారు 100కు పైగా దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. రాజుపాళెం, చాపాడు మండలాల్లోని దుకాణాలకు ఎక్కువ డిమాండు ఉన్నట్లు సమాచారం. 22 షాపులకు 450 దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది.