liquor syndicates
-
బాబు హయాంలో మద్యం సిండికేట్లకు సలాం
సాక్షి, అమరావతి: చంద్రబాబు హయాంలో ఎక్సైజ్ శాఖలో జరిగిన అవినీతిని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) తూర్పారబట్టింది. లోపభూయిష్టంగా జరిగిన పన్నుల వసూళ్లు, నమోదైన కేసుల్లో అవకతవకలను ఎత్తి చూపింది. మద్యం సిండికేట్లకు అనుకూలంగా వ్యవహరించి.. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినట్లు కాగ్ తేల్చింది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖలో ఆడిట్ చేయాల్సిన కార్యాలయాలు 103 ఉండగా.. 2017–18 ఆర్థిక సంవత్సరంలో కాగ్ 14 కార్యాలయాలను మచ్చుకు తనిఖీ చేసింది. మొత్తం 41 కేసుల్లో రూ.6.71 కోట్ల మేర ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినట్లు నిర్ధారించింది. అంటే మిగిలిన కార్యాలయాల్లో ఎంత మేర అక్రమాలు జరిగి ఉంటాయో ఊహించుకోవచ్చని కాగ్ పేర్కొంది. కాగ్ ఎత్తి చూపిన తప్పులను ఎక్సైజ్ శాఖ కూడా అంగీకరించడం గమనార్హం. ఇష్టానుసారంగా అనుమతులు..: రాష్ట్రంలోని పలు గ్రామాలను సమీప నగర పాలక/పురపాలక సంస్థల్లో విలీనం చేశారు. ఇక్కడి మద్యం షాపులకు అదనపు లైసెన్సు ఫీజులు వసూలు చేయాలి. కానీ ఎక్సైజ్ శాఖ దీన్ని పట్టించుకోలేదు. కాగ్ తనిఖీ చేసిన సామర్లకోట మున్సిపాలిటీ, కాకినాడ, రాజమండ్రి కార్పొరేషన్లలో విలీనమైన గ్రామాలకు సంబంధించి ప్రభుత్వానికి రావాల్సిన రూ.2.01 కోట్ల ఆదాయానికి గండి కొట్టారు. పర్మిట్ రూంలకు ఫీజులు వసూలు చేయకుండా మద్యం సిండికేట్లతో కుమ్మక్కై రూ.3.16 కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు. అలాగే బార్లను అనుమతించిన విస్తీర్ణంలో కాకుండా.. బ్లూ ప్రింట్‌ను మించి వ్యాపారం నడిపినా పట్టించుకోలేదు. వీటికి అదనపు రుసుం వసూలు చేయలేదు. కాకినాడ, ఒంగోలు, రాజమండ్రిలో 13 మంది లైసెన్సుదారులకు రూ.94.11 లక్షల అదనపు ఫీజు విధించలేదు. ఇక కల్లు చెట్లకు వర్తించే రేట్లను తక్కువగా చేసి చూపడంతో రూ.28.89 లక్షల ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోయింది. కాకినాడ, ఏలూరు, రాజమండ్రి, విజయనగరంలో కల్లు చెట్లకు అద్దెలను తక్కువగా విధించినట్లు కాగ్ తేల్చింది. -
మళ్లీ ‘బెల్టు’ బాదుడు!
సాక్షి, హైదరాబాద్: లిక్కర్ సిండికేట్లు మద్యం మార్కెట్‌పై మళ్లీ పట్టు సాధించారు. బెల్టు దుకాణాల ద్వారా ఎమ్మార్పీ ధరలను ఉల్లంఘిస్తూ భారీగా దండుకుంటున్నారు. ఒక్కో మద్యం బాటిల్‌పై రూ.40 నుంచి రూ.80 వరకు అదనంగా వసూలు చేస్తూ వినియోగదారులను నిండా ముంచుతున్నారు. సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలంలోని బెల్టు దుకాణాల్లో ఫుల్ బాటిల్‌కు ఎమ్మార్పీపై రూ. 80 అదనంగా వసూలు చేస్తుండగా.. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి, కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల్లాలోని ఏ4 దుకాణాల్లో క్వార్టర్‌కు రూ. 10, ఫుల్ బాటిల్‌కు రూ. 40 చొప్పున వసూలు చేస్తున్నట్లు ‘సాక్షి’పరిశీలనలో వెల్లడైంది. ఆదివారం ఈ జిల్లాల్లోని 3 దుకాణాల్లో విక్రయాల తీరును ‘సాక్షి’పరిశీలించింది. మద్యం విక్రయాల రేటు 3 జిల్లాల్లో దాదాపు ఒకేలా ఉంది. బెల్టు దుకాణాలపై దాడులు జరగకుండా ఏ4 దుకాణ యజమానులే చూసుకుంటున్నారని, ఇందుకు పోలీసులకు నెలకు రూ. 20 వేలు, ఎక్సైజ్ అధికారులకు రూ. 8 వేల చొప్పన మామూళ్లు ఇస్తున్నారని తెలిసింది. దుకాణాదారుల ‘కొత్త’ రూటు ఎక్సైజ్ శాఖ లిక్కర్ ప్రైస్ యాప్ అమల్లోకి తెచ్చాక ఎమ్మార్పీ ఉల్లంఘనలపై భారీగా ఫిర్యాదు లొచ్చాయి. తొలిరోజుల్లో ఎౖMð్సజ్ ఎన్ఫోర్స్మెంట్ భారీగా దాడులు చేయడంతో దుకాణాదారులు కొత్త ఎత్తుగడ వేశారు. ఏ4 దుకాణంలో నేరుగా జరిగే విక్రయాల్లో, బెల్టు దుకాణాల ద్వారా విక్రయాలపై కేసులు పెట్టొద్దని ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. దీంతో బెల్టు దుకాణాలకిచ్చే ప్రతి క్వార్టర్ సీసా ఎమ్మార్పీ మీద రూ. 10, ఫుల్ బాటిల్‌పై రూ.40 అదనంగా తీసుకోవడం మొదలైంది. వారం వారం జాతర జరిగే దేవాలయాల పరిధిలోని దుకాణాల నిర్వాహకులైతే ఫుల్ బాటిల్‌కు రూ.80 అదనంగా వసూలు చేస్తున్నారు. ఇక బెల్టు దుకాణదారులు అదనపు సొమ్మకు రెట్టింపు సంఖ్యలో వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నారు. రాష్ట్రంలో లక్షకుపైగా ‘బెల్టు’లు రాష్ట్రవ్యాప్తంగా లక్షకు పైగా బెల్టు దుకాణాలు ఉన్నాయి. వీటి ద్వారా ఏటా రూ.16 వేల కోట్ల మద్యం వ్యాపారం సాగుతున్నట్లు అంచనా. బెల్టు దుకాణాల నిర్వాహణలో చూసి చూడనట్లుగా ఉండాలని ఎక్సైజ్ బాస్ నుంచి సంకేతాలు వెళ్లడంతో లిక్కర్ సిండికేట్లు రెచిపోతున్నారు. నేరుగా దుకాణాల్లో మద్యం తీసుకునే వినియోగదారులనూ బాదేస్తున్నారు. ప్రస్తుతం క్వార్టర్ ఎమ్మార్పీ మీద రూ. 2 అదనంగా తీసుకుంటున్నారు. -
సిండికేట్ల సిత్రాలు..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మద్యం దుకాణాలపై లిక్కర్ సిండికేట్లు పట్టు బిగిస్తున్నారు. లాటరీలో లైసెన్స్ దక్కకపోయినా లక్షలకు లక్షలు గుడ్‌విల్ పోసి దుకాణాలు సొంతం చేసుకుంటున్నారు. లిక్కర్ విక్రయాల డిమాండ్‌ను బట్టి ఒక్కో షాపునకు కనిష్టంగా రూ.లక్ష నుంచి గరిష్టంగా రూ.కోటి వరకు గుడ్‌విల్ ఇచ్చి లీజుకు తీసుకుంటున్నారు. ఎక్సైజ్ అధికారులు సేకరించిన వివరాల ప్రకారం ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,031 మద్యం దుకాణాలు సిండికేట్ల చేతుల్లోకి వెళ్లినట్లు అంచనా. కొత్త లైసెన్స్‌దారులు సిండికేట్ల గుడ్‌విల్ ఎరకు చిక్కి దుకాణాలు అప్పగిస్తుండగా.. మరికొందరు సిండికేట్లు ఇచ్చే డబ్బులు తీసుకోవడంతోపాటు వ్యాపారంలో భాగస్వాములుగా మారుతున్నారు. గుడ్‌విల్ పేరుతో ఎర.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎక్కువ శాతం దుకాణాలను సిండికేట్లు చేజిక్కించుకున్నారు. ఆ తర్వాత స్థానంలో రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలు ఉన్నాయి. ఆంధ్రాలో లైసెన్స్‌లు దక్కని మద్యం వ్యాపారులు ఇక్కడ పెట్టుబడి పెట్టి దుకాణాలు తీసుకున్నారు. సూర్యాపేట జిల్లాలోని 71 మద్యం దుకాణాలకుగానూ 54 మంది కొత్త వారికి లైసెన్స్ దక్కింది. వీళ్లలో దాదాపు 80 శాతం మంది సిండికేట్ల వలకు చిక్కి వ్యాపారం నుంచి తప్పుకున్నావారే. రాష్ట్రంలోనే ఎక్కువ దరఖాస్తులతో సంచలనం సృష్టించిన జాన్‌పహడ్ మద్యం దుకాణాన్ని ఆంధ్రా చెందిన ఓ సిండికేటు రూ.కోటికి సొంతం చేసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. మున గాల మండలంలోని ఓ దుకాణాన్ని రూ.63 లక్షలకు, మేళ్లచెరువులో ఓ షాపును రూ.44 లక్షలకు, గరిడేపల్లి మండ లం కీతవారిగూడెంలోని దుకాణాన్ని రూ.48 లక్షలకు, హుజూర్‌నగర్‌లోని ఓ షాపు ను రూ.40 లక్షలకు, సూర్యాపేటలో రెండు దుకాణాలకు రూ.40 లక్షలు, తుంగతుర్తి మండల కేంద్రంలోని దుకాణానికి రూ.15 లక్షలు చెల్లించి సిండికేటు గ్రూపులు వ్యాపారాన్ని సొంతం చేసుకున్నాయి. ఏజెన్సీ దుకాణాలు అన్యాక్రాంతం.. ఏజెన్సీలోని మద్యం దుకాణాలు సిండికేట్ల చేతుల్లోనే ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో మొత్తం 109కుగాను 98 దుకాణాలకు ఎౖక్సైజ్ అధికారులు లైసెన్స్‌లు కేటాయించారు. నిబంధనల ప్రకారం ఈ దుకాణాలను గిరిజనులే నిర్వహించాలి. కానీ, వీటిలో 90 షాపులు సిండికేట్ల చేతుల్లోకి వెళ్లాయి. గిరిజన లైసెన్స్‌దారునికి రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు ఇచ్చి వ్యాపారాన్ని సొంతం చేసుకున్నారు. ఎమ్మార్పీ ధరల ఉల్లంఘన.. : ఎమ్మార్పీ ఉల్లంఘనలపై ఎౖక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కఠినంగా ఉండటంతో సిండికేట్లు.. బెల్టు షాపులను సంపాదనా సాధనాలుగా మార్చుకుంటున్నారు. గత నెల వరకు ప్రతి క్వార్టర్‌పై రూ.2 అదనంగా వసూలు చేసిన సిండికేట్లు 10 రోజులుగా దీన్ని రూ.5కు పెంచారు. రెవెన్యూ గ్రామంలో సగటున 5, ప్రతి హాబిటేషన్ గ్రామంలో ఒకటి చొప్పున రాష్ట్రంలోని 65 వేలకుపైగా బెల్టుషాపులు ఉన్నాయి. ఎక్సైజ్ అధికారులే మధ్యవర్తులు? ఒకరికి వచ్చిన దుకాణాన్ని మరొకరు నడపటం ఎౖక్సైజ్ నిబంధనలకు విరుద్ధం. రూ.లక్షలు గుడ్‌విల్ ఇచ్చి లాభా లు ఆర్జించేందుకు వక్రమార్గం పడతారని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇటువంటి వాటిని స్థానిక ఎక్సైజ్ అధికారులు ఆదిలోనే గుర్తించి నివారించాలి. కానీ, కొన్ని చోట్ల వారే మధ్యవర్తిత్వం చేసి దుకాణాలు అప్పగించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. -
బినామీలు బలే!
► మద్యం టెండర్లల్లో భారీగా పేదలు ► కూలి పనికి వెళ్లే వారి చేత ఐటీ రిటర్న్స్ దాఖలు ► రేషన్ కార్డు, ఇతర సంక్షేమ పథకాలు రద్దయ్యే అవకాశం ప్రొద్దుటూరు క్రైం: మద్యం టెండర్లలో ఈసారి బినామీల హవా ఎక్కువగా ఉంది. చాలా మంది మద్యం వ్యాపారులు తమ బినామీల పేర్ల మీద టెండర్లు వేయించారు. భారీ ఎత్తున పోటీ నెలకొనడంతో మద్యం వ్యాపారులు, సిండికేట్లు ఎలాగైనా తమ షాపులను నిలబెట్టుకోవాలని అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. పనిలోపనిగా తమ వద్ద పనిచేసే పనివార్ల పేరుతో దరఖాస్తులు భారీగా దాఖలు చేయించారు. ఇదే ఇప్పుడు వారి కొంప ముంచనుంది. వివరాల్లోకి వెళితే..జిల్లాలో 255 మద్యం షాపులకు దరఖాస్తులు ఆహ్వానించగా 29వ తేదీ సాయంత్రం వరకు 1,900 దరఖాస్తులు వచ్చాయి. 30వ తేదీ (గురువారం) సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని ఇచ్చిన గడువును మరో మూడు గంటలుపెంచి 8 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని ఎక్సైజ్ అధికారులు ఆదేశాలిచ్చారు. దీంతో గడువులోగా 3,654 దరఖాస్తులు అందాయి. 31 మధ్యాహ్నం 2 గంటల నుంచి జెడ్పీ ఆవరణంలో కలెక్టర్ సమక్షంలో లక్కీ డిప్ ద్వారా మద్యం దుకాణాలను కేటాయిస్తారు. కూలి పనికి వెళ్లే వారి చేత ఐటీ రిటర్న్స్ దాఖలు: ఈసారి ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలనే నిబంధన వస్తుందని పసిగట్టిన కొందరు వ్యాపారులు తమ అనుమాయులకు పాన్‌కార్డులను ఇప్పించారు. ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్న 12-15 రోజుల్లోనే పాన్‌కార్డు జారీ చేస్తున్నారు. వీరిలో చాలామంది కూలి పనికి వెళ్తున్న వారు ఉన్నట్లు సమాచారం. మద్యం షాపులకు దరఖాస్తు చేసుకునే వారు ఈఎండీ కింద రూ.3 లక్షలు డీడీ తీయాల్సి ఉంది. ఒకరి పేరు మీదనే ఎక్కువ మొత్తంలో డీడీ తీస్తే ఐటీశాఖతో సమస్య వస్తుందని భావించిన మద్యం వ్యాపారులు తమ ఇళ్లల్లో పనిచేసే వారు, బంధువుల పేరు మీద దరఖాస్తు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. గత రెండు మూడు రోజుల నుంచి ఆదాయపు పన్ను శాఖ కార్యాలయానికి ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి వ్యాపారులు పెద్దఎత్తున వస్తున్నారు. వీరిలో కూలి పనికి వెళ్లేవారు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. రూ.లక్షల్లో వీరు ఆదాయం చూపించడంతో భవిష్యత్తులో వారి రేషన్‌కార్డు, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమయ్యే ప్రమాదం ఉంది. ఈపాస్‌తో పాటు ఆధార్‌కార్డు కూడా నమోదు చేస్తుండటంతో వారికి దక్కే ప్రభుత్వ లబ్ధి పూర్తిగా రద్దు అయ్యే అవకాశం ఉందని తెలియడంతో బినామీలు ఆందోళన చెందుతున్నారు. కొత్తగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన వారిపై ఐటీ అధికారులు కూడా దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. నాలుగైదు రోజుల్లో వారి చిట్టా బయటికి తీసే అవకాశం ఉంది. పెద్ద సంఖ్యలో దరఖాస్తులు: ఒక్క ప్రొద్దుటూరు ఎక్సైజ్ డివిజన్ పరిధిలో సుమారు 105 మద్యం షాపులు ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్లలోపు ఉన్న మద్యం షాపులను తొలగిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం నూతన మద్యం విధానంతో టెండర్లకు శ్రీకారం చుట్టింది. 105 షాపుల్లో 90 శాతం 500 మీటర్లలోపు ఉన్నాయి. జిల్లాలో ప్రొద్దుటూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని మద్యం షాపులకు మంచి డిమాండు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ 22 మద్యం షాపులు, 8 బార్లు ఉన్నాయి. ఒక్కో మద్యం షాపునకు సుమారు 100కు పైగా దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. రాజుపాళెం, చాపాడు మండలాల్లోని దుకాణాలకు ఎక్కువ డిమాండు ఉన్నట్లు సమాచారం. 22 షాపులకు 450 దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. -
సిండికేట్ దోపిడీ
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : మద్యం సిండికేట్లు మళ్లీ పుట్టుకొచ్చాయి. జిల్లాలోని పలు పట్టణాల్లో మద్యం వ్యాపారులు జట్టుకట్టి అడ్డగోలు దోపిడీ షురూ చేశారు. వరుస ఏసీబీ దాడులు, కేసుల నమోదుతో గతంలో సిండికేటు అక్రమాలకు చాలా వరకు చెక్‌పడింది. మళ్లీ ఇప్పుడు మద్యం వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. మద్యం అమ్మకాలపై వస్తున్న లాభాలు సరిపోవడం లేదని ఈ అక్రమార్జనకు తెరలేపా రు. ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తూ నిండా ముంచుతున్నారు. ఒక్కో మద్యం బాటిల్‌పై రూ.ఐదు నుంచి రూ.20 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. కూలింగ్ చార్జీల పేరుతో ఒక్కో బీరుపై అదనంగా రూ.ఐదు నుంచి పది రూపాయలు ఎక్కువ గుంజుతున్నారు. జిల్లాలోని పలుచోట్ల ఈ బహిరంగ దోపిడీ కొనసాగుతున్నా ఎక్సైజ్ శాఖ కనీసం పట్టించుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు. గతంలో మద్యం సిండికేట్ల వద్ద ప్రతినెలా మమూళ్లు పుచ్చుకున్న ఎక్సైజ్, పోలీసు ఇతర శాఖల అధికారులపై ఏసీబీ కేసులు కూడా నమోదు చేసింది. ఈ కేసుల విచారణ ఇంకా కొనసాగుతున్నా మళ్లీ ఇప్పుడు అదే తరహాలో మద్యం సిండికేట్లు షురూ చేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. జిల్లాలోని చెన్నూర్, బెల్లంపల్లి, మందమర్రి, తాండూరు, నిర్మల్, మంచిర్యాల, కాగజ్‌నగర్ తదితర పట్టణాల్లో మద్యం వ్యాపారులు సిండికేట్‌గా మారారు. గతంలో మాదిరిగా కొన్నిచోట్ల సిండికేట్ కార్యాలయాలను కూడా ఏర్పాటు చేశారు. ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్న బెల్లంపల్లిలోని ఓ వైన్సుపై ఇటీవల ఎక్సైజ్ అధికారులు దాడి చేసి కేసు నమోదు చేశారు. వారం రోజులపాటు ఈ మద్యం వైన్స్ లెసైన్సును సస్పెండ్ చేయడంతోపాటు, జరిమానా కూడా విధించారు. వచ్చే లాభాలు సరిపోవని.. జిల్లాలో 149 మద్యం దుకాణాలకు ఈ ఏడాది జూన్‌లో ఎక్సైజ్ శాఖ దరఖాస్తులు స్వీకరించింది. 974 మంది వ్యాపారులు దరఖాస్తు చేసుకున్నారు. 35 దుకాణాలకు సింగిల్ టెండర్లు రాగా, మిగిలిన షాపులకు గట్టి పోటీ నెలకొంది. జూన్ 23న లాటరీ పద్ధతిలో ఈ మద్యం షాపులను కేటాయించారు. మద్యం షాపుల యజమానులు ఐఎంఎల్ డిపో నుంచి మద్యాన్ని కొనుగోలు చేసి రిటైల్‌గా విక్రయిస్తుంటారు. ఇలా ఏడు పర్యాయాలు మద్యం డ్రా చేసిన తర్వాత తమకు వచ్చే లాభాలు తగ్గిపోయాయంటూ ఈ దోపిడీకి తెరలేపారు. కొన్ని చోట్ల సిండికేటు వ్యాపారులు కల్తీ మద్యం విక్రయాలకు తెర లేపారు. మద్యం సీసా మూతను తీసి అందులో నీళ్లు గానీ, చీప్ లిక్కర్ని కలిపి ఏ మాత్రం గుర్తుపట్టని విధంగా ఆ సీసా మూతను బిగించేస్తున్నారు. ఇలా మద్యం కల్తీకి పాల్పడిన లక్సెట్టిపేటలోని ఓ వైన్సుపై ఎక్సైజ్ అధికారులు ఇటీవల కేసు నమోదు చేశారు. బార్‌కోడ్‌కు ససేమిరా.. బార్కోడ్ విధానాన్ని అమలు చేసేందుకు మద్యం వ్యాపారులు ససేమిరా అంటున్నారు. ఈ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిబంధనలు విధించింది. ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదు. బార్కోడ్ విధానం అమలైతే మద్యం వ్యాపారుల అక్రమాలకు చాలా మట్టుకు చెక్ పడుతుంది. నాన్‌డ్యూటీ పెయిడ్ మద్యం విక్రయాలు జరిగితే ఎక్సైజ్ అధికారులకు ఇట్టే తెలిసిపోతుంది. ఆయా మద్యం షాపుల్లో మద్యం విక్రయాలపై ఆన్లైన్ పర్యవేక్షణ ఉంటుంది. ఈ విధానం అమలైతే తమ గుట్టు రట్టవుతుందనే భయంతో వ్యాపారులు ముందుకు రావడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వ్యాపారులేమో దీన్ని అనవసర వ్యయంగా చెప్పుకొస్తున్నారు. నిబంధనల ప్రకారం ఇప్పటికే ఈ బార్ కోడ్ విధానం అమలులోకి రావాల్సి ఉండగా, జిల్లాలో కనీసం ఒక్క షాపులో కూడా కనిపించడం లేదంటే ఎక్సైజ్ అధికారులు, మద్యం వ్యాపారులకు మధ్య ఉన్న ‘అనుబంధం’ ఎలాంటిదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. మా దృష్టికి వచ్చింది - శివరాజు, డిప్యూటీ కమిషనర్, ఎక్సైజ్ శాఖ జిల్లాలో కొన్ని చోట్ల ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. తరచూ తనిఖీలు చేస్తున్నాం. కేసులు కూడా నమోదు చేశాం. నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటాం. మద్యం షాపుల్లో బార్కోడ్ విధానం అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. -
మద్యం సిండికేట్ల కేసు విచారణ వాయిదా
సాక్షి, హైదరాబాద్: మద్యం సిండికేట్ల వ్యవహారంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు చెరో అధికారిని ప్రాసిక్యూషన్‌కు అనుమతినివ్వాల్సి ఉందని అవినీతి నిరోధక శాఖ తరఫు న్యాయవాది హైకోర్టుకు నివేదించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను తెలంగాణ ప్రభుత్వం కోరిందని, వాటిని అందించామని ఆయన తెలిపారు. ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చిన తరువాత పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతానని, అందుకు గడువునివ్వాలని ఆయన కోర్టును కోరారు. అంగీకరించిన ధర్మాసనం, విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం సిండికేట్ల వ్యవహారంతో సంబంధమున్న ప్రతీ వ్యక్తినీ వారి హోదాలకు అతీతంగా విచారించేలా ఆదేశాలివ్వాలంటూ హైదరాబాద్‌కు చెందిన దేబరా, మద్యం సిండికేట్లకు సంబంధించి ప్రభుత్వ నివేదికను బహిర్గతం చేసేలా ఆదేశించాలంటూ న్యాయవాది పి.వి.కృష్ణయ్య వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలను ఇప్పటికే పలుమార్లు విచారించిన సీజే నేతత్వంలోని ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. -
ఆ భారం.. సిండికేట్‌కు ఆధారం
శ్రీకాకుళం: సర్కారు విధానాలు.. రోజుకోరీతిలో తీసుకుంటున్న నిర్ణయాలు.. మద్యం సిండికేట్లను ప్రోత్సహించే రీతిలో ఉన్నాయి. ఫలితంగా జిల్లాలో మద్యం ఎమ్మార్పీకి అమ్మే పరిస్థితులు కనిపించడం లేదు. మద్యం విక్రయాలకు సంబంధించి ఆగస్టు ఒకటో తేదీ నుంచి బార్ కోడింగ్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో సదరు యంత్రాల కొనుగోలు రూపంలో మద్యం వ్యాపారులపై రూ.3 కోట్ల భారం పడుతుంది. జిల్లాలో 232 మద్యం దుకాణా లు, 16 బార్లు ఉన్నాయి. వీట న్నింటిలోనూ కంప్యూటర్లు, స్కానర్లు, ప్రింటర్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే వీటిని ఎవరికి వారు బయట కొనుగోలు చేయడం కాకుండా తామే ఆ యంత్రాలను శాఖాపరం గా సరఫరా చేస్తామని.. ఇందుకుగానూ ఒక్కో షాపు, బార్ నిర్వాహకులు రూ. 80వేలు చొప్పున చెల్లించాలని ఎక్సైజ్‌శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే లెసైన్స్ ఫీజులు పెంచడంతో పాటు షాపుల నుంచి సిటింగ్ రూమ్‌ల పేరుతో అదనంగా రూ. రెండు లక్షలు వసూలు చేస్తున్నారు. ఇప్పుడు మరో రూ.80 వేలు వసూలు చేస్తుండడంపై లెసైన్స్‌దారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బెల్టుషాపులు మూసివేయాలని, ఎమ్మార్పీకే మద్యం అమ్మాలని చెబుతున్న ప్రభుత్వం.. మరోవైపు రోజుకో అదనపు భారం మోపడాన్ని ట్టుకోలేకపోతున్నా రు. వీరి అభిప్రాయాలతో పని లేదన్నట్లు అధికారులు మాత్రం జూలై నెలాఖరులోగా రూ.80 వేలు చెల్లించకుంటే మద్యం సరఫరా నిలిపివేస్తామని హెచ్చరిస్తున్నారు. బార్ కోడింగ్ వల్ల ఎన్నో లాభాలున్నాయని వారంటున్నారు. బెల్టుషాపుల్లో మద్యం పట్టుబడితే ఎవరు సరఫరా చేశారో తెలుస్తుందని అంటున్నారు. అలాగే షాపుల్లో నిల్వ, అమ్మకాల పరిస్థితి, అనధికారి కంగా ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అయితే ఆ వివరాలు తెలుసుకోవచ్చంటున్నారు. తాము వసూలు చేసిన మొత్తంతో కంప్యూటర్, ప్రింటర్‌తో పాటు స్యానింగ్ యంత్రాన్ని ఇస్తామని చెబుతున్నారు. అమ్మకందారులు బాటిల్‌పై ఉన్న బార్‌కోడ్‌ను స్కాన్ చేస్తే ప్రింటెడ్ బిల్లు వస్తుందని, దాన్ని వినియోగదారుడికి ఇవ్వాల్సి ఉంటుం దని అంటున్నారు. ఇది బాగానే ఉన్నప్పటికీ వ్యాపారులపై భారం మోపడం.. పరోక్షంగా సిండికేట్ అయ్యేం దుకు ప్రోత్సహించడమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ భారాన్ని తట్టుకోవడానికి లెసైన్స్దారులందరూ సిండికేట్‌గా ఏర్పడి ఇష్టారాజ్యంగా ధరలు పెంచే ప్రమాదముంది. ఇప్పటికే సిండికేట్ ఏర్పాటులో వ్యాపారులు నిమగ్నమయ్యారు. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, వారి అనుయాయులు ఈ వ్యాపారంలో ఎక్కువగా ఉండడంతో సిండికేట్‌ను అడ్డుకోవడం కూడా అధికారులకు తలకు మించిన పని అవుతుందన్న వాదన వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఎక్సైజ్ అధికారులు లెసైన్సుదారుల నుంచి రూ. 80 వేలు వసూలు చేయడం వెనుక మరో కథనం కూడా ప్రచారంలో ఉంది. ఈ మొత్తంతో కంప్యూటర్లు, స్కానర్లు, ప్రింటర్లు ఒకే కంపెనీ నుంచి కొనుగోలు చేయడం ద్వారా ఆ సంస్థకు లబ్ధి చేకూర్చి.. ప్రతి ఫలం గా వారి నుంచి కొంత మొత్తాలు స్వీకరించేం దుకు ఒప్పందాలు కుదుర్చుకున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది అటుం చితే మద్యం మాత్రం ప్రియం కానుందనడంలో సందేహం లేదు. -
వెలగపూడిపై ఏసీబీ ఉచ్చు?
హైకోర్టు నిర్ణయంతో కదలనున్న మద్యం కేసు గతంలో విచారించి వదిలేసిన వైనం సిండికేట్ల జాబితాలో ఎంఎల్ఎకి చెందిన వైన్స్ సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీకి చెందిన తూర్పు నియోజక వర్గ శాసన సభ్యుడు వెలగపూడి రామకృష్ణబాబుపై మద్యం కేసు ఉచ్చు బిగయనుంది. మద్యం కేసుల నుంచి ప్రజాప్రతినిధులను, ముఖ్యులను మినహాయించడాన్ని హైకోర్టు తప్పుపట్టిన నేపథ్యంలో గతం లో ఏసీబీ విచారణను ఎదుర్కొన్న రామకృష్ణబాబుపై కేసు నమోదు చేసే అవకాశాలున్నాయని తెలిసింది. ఎంఆర్ పీ ధరలను కాదని అధిక ధరలకు మద్యం విక్రయించుకునేందుకు ఉత్తరాంధ్రాలోని పలు మద్యం సిండికేట్లు అధికారులకు లక్షల్లో లంచాలు ఇచ్చాయి. సిండికేట్లపై ఏసీబీ అధికారులు జరిపిన దాడు ల్లో లంచాల చిట్టా బయటపడింది. వీటి ఆధారంగా ఏసీబీ అధికారులు అప్పట్లో మద్యం సిండికేట్ అధినేతలైన పుష్కర గణేష్, జనప్రియ ప్రసాద్‌లను అరెస్టు చేశారు. వీరు 92 రోజుల పాటు జైలులో కూడా ఉన్నారు. వీరి అరెస్టుకు కారణమై న లంచాల వ్యవహారాల్లో శాసనసభ్యుడు వెలగపూడి పేరుండడంతో ఏసీబీ అధికారులు ఆయన్ను విచారించారు. ఈయన ప్రజాప్రతినిధిగా ఉన్న కారణంగా విచారణతోనే వ్యవహారాన్ని ముగించారు. సిండికేట్ల జాబితాలో వెలగపూడికి చెందిన విజయ వైన్స్ సిండికేట్ పేరు బహిర్కతమైంది. విమానంలో హైదరాబాద్ వెళ్లేం దుకు సిండికేట్ డబ్బులతో టిక్కెట్లు కొనుగోలు చేసిఇచ్చినట్లు వెలగపూడి పేరు ము డుపుల జాబితాలో రాసి ఉన్నా ఆయన ప్రజాప్రతినిధి కావడంతో ఏమీ చేయకుండా వదిలేశారనే విమర్శలు గుప్పుమన్నాయి. ప్రజాప్రతినిధులను ప్రత్యేకంగా చూడాలంటూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వుండగా 1999లో ఇచ్చి న మెమోను బుధవారం హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో వెలగపూడిపై ఏసీబీ తిరిగి విచారణను ప్రారంభించే అవకాశాలున్నాయని అధికారులంటున్నారు. వుడా భూముల స్కాంలో చిక్కుకొన్న వెలగపూడి మున్సిపల్ మంత్రి మహీధర్ రెడ్డి ఆశీస్సులతో బయటపడ్డారు. ఏసీబీ విచారణ మాత్రం తప్పేలాలేదు. -
సిండికేట్లకు ‘రూ.5 వరం’
ఫుల్‌బాటిల్ మద్యం ధరపై రూ.5 అదనంగా అమ్ముకునేందుకు అనధికార అనుమతి లిక్కర్ సిండికేట్లకు సర్కార్ చట్టవిరుద్ధ వరం క్వార్టర్ మీదే రూ.5 అదనంగా తీసుకుంటున్న లిక్కర్ సిండికేట్లు ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్షనేత సొంత నియోజకవర్గాల్లో ‘డబుల్’ దోపిడీ ‘సాక్షి’ పరిశీలనలో లిక్కర్ సిండికేట్ల అక్రమాలు బట్టబయలు సాక్షి, హైదరాబాద్: లిక్కర్ సిండికేట్లకు ప్రభుత్వం ‘ఐదు రూపాయల వరం’ ప్రకటించింది. మద్యం ఎమ్మార్పీ ధర మీద రూ.5 అదనంగా వసూలు చేసుకోవడానికి ఎక్సైజ్ కమిషనర్ అనధికారికంగా అంగీకరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఓ మంత్రి, లిక్కర్ డీలర్ల అసోషియేషన్ చేసిన ఒత్తిడికి కమిషనర్ తలొగ్గినట్టు సమాచారం. రాష్ట్రంలో ఇబ్బడిముబ్బడిగా వచ్చిపడుతున్న ఎన్టీపీఎల్ మద్యం, కల్తీ మద్యం నిరోధించాలంటే ఎమ్మార్పీ ఉల్లంఘన తప్ప మరో మార్గం లేదని ఎక్సైజ్ ఉన్నతాధికారులు చెప్తున్నారు. దొరికిన వెసులుబాటుతో లిక్కర్ సిండికేట్లు క్వార్టర్ బాటిల్ మీద రూ.5 అదనంగా అమ్ముతున్నాయి. ఈ లెక్కన ఫుల్ బాటిల్‌కు రూ.20 పైగా అదనంగా అమ్ముతుండగా... ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత సొంత నియోజకవర్గాలు పీలేరు, కుప్పంలో క్వార్టర్ మీద రూ.10, ఫుల్ బాటిల్ మీద రూ.40 అదనంగా తీసుకుంటున్నారు. ‘సాక్షి’ ప్రతినిధులు పరిశీలనాత్మకంగా రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో 19 జిల్లాల్లో మద్యం కొనుగోలు చేయగా ఒక్క హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లోని మద్యం దుకాణాల్లో కూడా గరిష్ట చిల్లర ధర నిబంధన ఉల్లంఘించారు. ఎమ్మార్పీ ధర కంటే ఎక్కువ డబ్బు ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నిస్తే మద్యం ధరలు పెరిగాయని చెప్తున్నారు. ఏసీబీ దాడులతో కేసుల పాలై అదనపు ఆదాయాన్ని కోల్పోయిన స్థానిక ఎకై ్సజ్ అధికారులు కూడా ఇప్పుడు సిండికేటుకు పూర్తిగా సహకరిస్తున్నారు. ప్రతి క్వార్టర్‌కు పెంచిన రూ.5లో రూ 2 ఎకై ్సజ్ అధికారులకు (కింది నుంచి పై స్థాయి అధికారుల వరకు), రూ.3 లిక్కర్ సిండికేట్లు తీసుకోవాలని రహస్య ఒప్పందం కుదిరినట్లు ‘సాక్షి’ పరిశీలనలో తేలింది. ఏపీబీసీఎల్ డిపోల నుంచి డీలర్లు తీసుకున్న మద్యం వివరాలు దుకాణాల వారీగా తీసుకొని వాటి ఆధారంగా నెలనెల లెక్కలు వేసి డబ్బు పంచుకోవాలని ఎక్సైజ్ సిబ్బంది, మద్యం సిండికేట్ల మధ్య ఒప్పందం కుదిరినట్టు సమాచారం. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సొంత నియోజకవర్గం పీలేరులో ఆయన ప్రధాన అనుచరుడు ఓ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ దుకాణంలో మద్యం కొనుగోలు చేయగా ప్రతి బ్రాండ్ మీద క్వార్టర్‌కు రూ.10 అదనంగా తీసుకున్నారు. ఫుల్ బాటిల్‌కు రూ.40 అదనం. నియోజకవర్గం అంతటా ఇవే ధరలు ఉన్నాయి ప్రతిపక్ష నాయకుడు చం ద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోని ఆయన అనుచరుని దుకాణంలో కూడా క్వార్టర్ మీద రూ.10 అదనంగా తీసుకున్నారు. వైఎస్సార్ జిల్లాలో ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే తన నియోజకవర్గ కేంద్రం లోనే బినామీ పేరుతో వైన్ షాపు తెరిచారు. దుకాణం తెరిచిన 2 నెలల వ్యవధిలోనే క్వార్టర్ మద్యంకు ఎమ్మార్పీ ధర మీద రూ.10 అదనంగా తీసుకుంటూ ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారులకు దొరికిపోయారు. ఇదే జిల్లాలో సదరు ఎమ్మెల్యేకు కమలాపురంలో రెండు, ఎర్రగుంట్లలో ఒక దుకాణం, ప్రొద్దుటూరులో బార్ అండ్ వైన్స్ బినామీల పేర్లతో ఉన్నాయి. ఈ దుకాణాలన్నింటిలోనూ ఇప్పుడు ఫుల్ బాటిల్ మీద బ్రాండును బట్టి రూ.15నుంచి రూ.25 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో ఉన్న 11 మద్యం దుకాణాలను ఒకే సిండికేటు కిందకు తెచ్చారు. అన్ని దుకాణాల్లో కూడా ఒకే ధర ఉంది. ప్రతి క్వార్టర్ మద్యం సీసా మీద బ్రాండును బట్టి ఎమ్మార్పీ మీద రూ.6నుంచి రూ.12 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. విశాఖపట్నం సిటీతో పాటు, రూరల్ ప్రాంతంలోని యలమంచిలి, అనకాపల్లి, పెందుర్తి పట్టణాల్లో ఓ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అజమాయిషీ కింద 25 మద్యం దుకాణాలు ఉన్నాయని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంటు నిర్ధారించింది. ఈ దుకాణాల్లో క్వార్టర్‌కు రూ.5 ఎమ్మార్పీ ఉల్లంఘన జరుగుతోంది. ప్రకాశం జిల్లా చీరాలలో దాదాపు 6 మద్యం దుకాణాలు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ యువ ఎమ్మెల్యే ఆధీనంలో ఉన్నాయి. ఈ దుకాణాల్లో క్వార్టర్ చీప్ లిక్కరుకు రూ.10, మీడియం లిక్కర్‌కు రూ.15, ప్రీమియం లిక్కర్‌కు రూ.15 చొప్పున ఎమ్మార్పీ మీద అదనంగా వసూలు చేస్తున్నారు. విజయనగరం జిల్లాల్లో గత ఏడాది ఏసీబీ దాడుల నేపథ్యంలో కొద్దికాలం స్తబ్దుగా ఉన్న కీలక నేత బంధువులు మళ్లీ తెర మీదకు వచ్చారు. ఆయన సోదరులిద్దరూ, మేనల్లుడు కలిసి విజయనగరం, పార్వతీపురం, బొబ్బిలి, చీపురుపల్లి, విశాఖ జిల్లా అనకాపల్లి మద్యం దుకాణాల్లో పాగా వేశారు. క్వార్టర్ సీసా మీద రూ.5 నుంచి రూ.10 వరకు పెంచి అమ్ముతున్నారు. దీనిపై మాజీ ఎకై ్సజ్ కమిషనర్ శర్మ గతంలోనే శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. పాలమూరు జిల్లాలో ఓ మంత్రి బంధువుల కనుసన్నల్లోనే 2 డివిజన్లలో మద్యం దుకాణాలు నడుస్తున్నాయి. ఇక్కడి మద్యం దుకాణాల్లో చీప్ లిక్కర్ ఫుల్ బాటిల్‌కు రూ.20, మీడియం, ప్రీమియం లిక్కర్ ఫుల్ బాటిల్‌కు రూ.30 చొప్పున అదనంగా తీసుకుంటున్నారు.