ఆ భారం.. సిండికేట్‌కు ఆధారం
శ్రీకాకుళం: సర్కారు విధానాలు.. రోజుకోరీతిలో తీసుకుంటున్న నిర్ణయాలు.. మద్యం సిండికేట్లను ప్రోత్సహించే రీతిలో ఉన్నాయి. ఫలితంగా జిల్లాలో మద్యం ఎమ్మార్పీకి అమ్మే పరిస్థితులు కనిపించడం లేదు. మద్యం విక్రయాలకు సంబంధించి ఆగస్టు ఒకటో తేదీ నుంచి బార్ కోడింగ్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో సదరు యంత్రాల కొనుగోలు రూపంలో మద్యం వ్యాపారులపై రూ.3 కోట్ల భారం పడుతుంది. జిల్లాలో 232 మద్యం దుకాణా లు, 16 బార్‌లు ఉన్నాయి. వీట న్నింటిలోనూ కంప్యూటర్లు, స్కానర్లు, ప్రింటర్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే వీటిని ఎవరికి వారు బయట కొనుగోలు
చేయడం కాకుండా తామే ఆ యంత్రాలను శాఖాపరం గా సరఫరా చేస్తామని..
ఇందుకుగానూ ఒక్కో షాపు, బార్ నిర్వాహకులు రూ. 80వేలు చొప్పున చెల్లించాలని ఎక్సైజ్‌శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే లెసైన్స్ ఫీజులు పెంచడంతో పాటు షాపుల నుంచి సిటింగ్ రూమ్‌ల పేరుతో అదనంగా రూ. రెండు లక్షలు వసూలు చేస్తున్నారు. ఇప్పుడు మరో రూ.80 వేలు వసూలు చేస్తుండడంపై లెసైన్స్‌దారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బెల్టుషాపులు మూసివేయాలని, ఎమ్మార్పీకే మద్యం అమ్మాలని చెబుతున్న ప్రభుత్వం.. మరోవైపు రోజుకో అదనపు భారం మోపడాన్ని ట్టుకోలేకపోతున్నా రు. వీరి అభిప్రాయాలతో పని లేదన్నట్లు అధికారులు మాత్రం జూలై నెలాఖరులోగా రూ.80 వేలు చెల్లించకుంటే మద్యం సరఫరా నిలిపివేస్తామని హెచ్చరిస్తున్నారు. బార్ కోడింగ్ వల్ల ఎన్నో లాభాలున్నాయని వారంటున్నారు. బెల్టుషాపుల్లో మద్యం పట్టుబడితే ఎవరు సరఫరా చేశారో తెలుస్తుందని అంటున్నారు.
అలాగే షాపుల్లో నిల్వ, అమ్మకాల పరిస్థితి, అనధికారి కంగా ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అయితే ఆ వివరాలు తెలుసుకోవచ్చంటున్నారు. తాము వసూలు చేసిన మొత్తంతో కంప్యూటర్, ప్రింటర్‌తో పాటు స్యానింగ్ యంత్రాన్ని ఇస్తామని చెబుతున్నారు. అమ్మకందారులు బాటిల్‌పై ఉన్న బార్‌కోడ్‌ను స్కాన్ చేస్తే ప్రింటెడ్ బిల్లు వస్తుందని, దాన్ని వినియోగదారుడికి ఇవ్వాల్సి ఉంటుం దని అంటున్నారు. ఇది బాగానే ఉన్నప్పటికీ వ్యాపారులపై భారం మోపడం.. పరోక్షంగా సిండికేట్ అయ్యేం దుకు ప్రోత్సహించడమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ భారాన్ని తట్టుకోవడానికి లెసైన్స్‌దారులందరూ సిండికేట్‌గా ఏర్పడి ఇష్టారాజ్యంగా ధరలు పెంచే ప్రమాదముంది. ఇప్పటికే సిండికేట్ ఏర్పాటులో వ్యాపారులు నిమగ్నమయ్యారు.
అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, వారి అనుయాయులు ఈ వ్యాపారంలో ఎక్కువగా ఉండడంతో సిండికేట్‌ను అడ్డుకోవడం కూడా అధికారులకు తలకు మించిన పని అవుతుందన్న వాదన వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఎక్సైజ్ అధికారులు లెసైన్సుదారుల నుంచి రూ. 80 వేలు వసూలు చేయడం వెనుక మరో కథనం కూడా ప్రచారంలో ఉంది. ఈ మొత్తంతో కంప్యూటర్లు, స్కానర్లు, ప్రింటర్లు ఒకే కంపెనీ నుంచి కొనుగోలు చేయడం ద్వారా ఆ సంస్థకు లబ్ధి చేకూర్చి.. ప్రతి ఫలం గా వారి నుంచి కొంత మొత్తాలు స్వీకరించేం దుకు ఒప్పందాలు కుదుర్చుకున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది అటుం చితే మద్యం మాత్రం ప్రియం కానుందనడంలో సందేహం లేదు.