వెలగపూడిపై ఏసీబీ ఉచ్చు?
- హైకోర్టు నిర్ణయంతో కదలనున్న మద్యం కేసు
- గతంలో విచారించి వదిలేసిన వైనం
- సిండికేట్ల జాబితాలో ఎంఎల్‌ఎకి చెందిన వైన్స్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీకి చెందిన తూర్పు నియోజక వర్గ శాసన సభ్యుడు వెలగపూడి రామకృష్ణబాబుపై మద్యం కేసు ఉచ్చు బిగయనుంది. మద్యం కేసుల నుంచి ప్రజాప్రతినిధులను, ముఖ్యులను మినహాయించడాన్ని హైకోర్టు తప్పుపట్టిన నేపథ్యంలో గతం లో ఏసీబీ విచారణను ఎదుర్కొన్న రామకృష్ణబాబుపై కేసు నమోదు చేసే అవకాశాలున్నాయని తెలిసింది. ఎంఆర్ పీ ధరలను కాదని అధిక ధరలకు మద్యం విక్రయించుకునేందుకు ఉత్తరాంధ్రాలోని పలు మద్యం సిండికేట్లు అధికారులకు లక్షల్లో లంచాలు ఇచ్చాయి.
సిండికేట్లపై ఏసీబీ అధికారులు జరిపిన దాడు ల్లో లంచాల చిట్టా బయటపడింది. వీటి ఆధారంగా ఏసీబీ అధికారులు అప్పట్లో మద్యం సిండికేట్ అధినేతలైన పుష్కర గణేష్, జనప్రియ ప్రసాద్‌లను అరెస్టు చేశారు. వీరు 92 రోజుల పాటు జైలులో కూడా ఉన్నారు. వీరి అరెస్టుకు కారణమై న లంచాల వ్యవహారాల్లో శాసనసభ్యుడు వెలగపూడి పేరుండడంతో ఏసీబీ అధికారులు ఆయన్ను విచారించారు.
ఈయన ప్రజాప్రతినిధిగా ఉన్న కారణంగా విచారణతోనే వ్యవహారాన్ని ముగించారు. సిండికేట్ల జాబితాలో వెలగపూడికి చెందిన విజయ వైన్స్ సిండికేట్ పేరు బహిర్కతమైంది. విమానంలో హైదరాబాద్ వెళ్లేం దుకు సిండికేట్ డబ్బులతో టిక్కెట్లు కొనుగోలు చేసిఇచ్చినట్లు వెలగపూడి పేరు ము డుపుల జాబితాలో రాసి ఉన్నా ఆయన ప్రజాప్రతినిధి కావడంతో ఏమీ చేయకుండా వదిలేశారనే విమర్శలు గుప్పుమన్నాయి.
ప్రజాప్రతినిధులను ప్రత్యేకంగా చూడాలంటూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వుండగా 1999లో ఇచ్చి న మెమోను బుధవారం హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో వెలగపూడిపై ఏసీబీ తిరిగి విచారణను ప్రారంభించే అవకాశాలున్నాయని అధికారులంటున్నారు. వుడా భూముల స్కాంలో చిక్కుకొన్న వెలగపూడి మున్సిపల్ మంత్రి మహీధర్ రెడ్డి ఆశీస్సులతో బయటపడ్డారు. ఏసీబీ విచారణ మాత్రం తప్పేలాలేదు.