అంతా మా ఇష్టం: అక్కడ అన్నీ ‘వెలగపూడి’ ఫుడ్‌కోర్టులే.. | TDP MLA Velagapudi Ramakrishna Babu Followers Illegal Activities | Sakshi
Sakshi News home page

అంతా మా ఇష్టం: అక్కడ అన్నీ ‘వెలగపూడి’ ఫుడ్‌కోర్టులే..

Published Tue, Apr 27 2021 9:06 AM | Last Updated on Tue, Apr 27 2021 4:46 PM

TDP MLA Velagapudi Ramakrishna Babu Followers Illegal Activities - Sakshi

దొండపర్తి(విశాఖ దక్షిణ): టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు దందాలకు కాదేదీ అనర్హం అన్నట్లు ఉంది. లిక్కర్‌ మాఫియా.. భూకబ్జాలు.. సెటిల్‌మెంట్లు.. దౌర్జన్యాలు.. ఇలా అనేక అనైతిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన తూర్పు నియోజకవర్గం.. తాజాగా వెలగపూడి ఫుడ్‌స్టాళ్లకు కేంద్రంగా మారిపోయింది. ఇక్కడ 90 శాతం స్టాళ్లు, ఫుడ్‌ ట్రక్కులు ఆయన వర్గానికి చెందిన స్థానికేతర వ్యాపారులవే. స్థానికులకు అవకాశం లేకుండా కృష్ణా, ఇతర జిల్లాల నుంచి అనుచరగణాన్ని జిల్లాలోకి దింపి తూర్పులో స్థానిక చిరువ్యాపారులపై పెత్తనం సాగిస్తున్నారు. ఎమ్మెల్యే పేరు చెప్పి ఎంవీపీ కాలనీ, చినవాల్తేరు, పార్కు హోటల్‌ ప్రాంతాల్లో కూడళ్లు, ఫుట్‌పాత్‌లు, రోడ్లు సైతం ఆక్రమించారు. ఆ స్థలాల్లో అనధికారంగా ఫుడ్‌ట్రక్కులు, తోపుడుబళ్లు ఏర్పాటు చేసుకున్నారు. వాటిని తరువాత చిరు వ్యాపారులకు అద్దెలకిచ్చి వేల రూపాయలు ఆర్జిస్తున్నారు.

ఇలా మొదలు పెట్టి.. అలా పాగా 
తూర్పు నియోజకవర్గంలో కొంత మంది టీడీపీ నేతలు వ్యాపారాల పేరుతో ఆక్రమణలకు పాల్పడుతున్నారు. పేదల స్వయం ఉపాధి, చిరు వ్యాపారాల పేరు చెప్పి ప్రధాన జంక్షన్లు, ఫుట్‌పాత్‌లు, రోడ్లను ఆక్రమించుకుంటున్నారు. ముందు చిన్న తోపుడు బండ్లను పెట్టించడం.. కొద్ది కాలానికి నెమ్మదిగా ఒక బడ్డీ ఏర్పాటు చేయించడం.. మరికొద్ది రోజులకు అక్కడ ఒక షెడ్డును నిర్మించడం.. ఇలా పరిపాటిగా మార్చుకున్నారు.

అడుగడుగునా ఫుడ్‌ట్రక్కులు 
నియోజకవర్గంలో ఫుడ్‌ట్రక్కులు, టిఫిన్, ఫాస్ట్‌ఫుడ్‌ బళ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఎంవీపీ కాలనీలో ఏఎస్‌రాజా కాలేజీ గ్రౌండ్‌ నుంచి మొదలుకొని సమతా కాలేజీ వరకు సుమారు 80 వరకు ఫుడ్‌ ట్రక్కులు, ఫాస్ట్‌ఫుడ్‌ బళ్లు ఉన్నాయి. ఎంవీపీ రైతుబజార్‌ రోడ్డు నుంచి లుంబినీ పార్కు వరకు కూడా ఇదే తరహాలో ఫుడ్‌స్టాల్స్‌ వచ్చేశాయి. చినవాల్తేరు జంక్షన్‌ నుంచి పార్కు హోటల్‌ వరకు, హోటల్‌ ఎదురుగా పెదవాల్తేరుకు వెళ్లే దారిలో కూడా పదుల సంఖ్యలో బడ్డీలు, ఫుడ్‌ట్రక్కులు పుట్టుకొచ్చాయి.

అనధికార వ్యాపారాలే ఎక్కువ 
పేదల జీవనోపాధి కోసం చేసే వ్యాపారులకు జీవీఎంసీ అధికారులు అనుమతులు ఇస్తున్నారు. అధికారులకు దరఖాస్తు చేసుకుంటే తోపుడు బండ్లు, ఫుడ్‌ ట్రక్కులు పెట్టుకోవడానికి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేని స్థలాన్ని గుర్తించి అక్కడ వ్యాపారానికి అవకాశం కల్పిస్తున్నారు. చిరు వ్యాపారులను ఆదుకోవడానికి జీవీఎంసీ ఉదారంగా అనుమతులిస్తున్నప్పటికీ.. ఎమ్మెల్యే అనుచరులు కొంత మంది అనధికారంగా బడ్డీలు, ట్రక్కులను ఏర్పాటు చేయిస్తున్నారు. ఎంవీపీ కాలనీలో 25 మంది చిరు వ్యాపారులకు మాత్రమే జీవీఎంసీ అనుమతులు ఇచ్చింది.

అయితే అక్కడ 150 వరకు బండ్లు, ట్రక్కుల్లో ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్ల వ్యాపారం జరుగుతోంది. రోడ్లపై, ఫుట్‌పాత్‌లపై వ్యాపారాలు కారణంగా పాదచారులు, వాహనదారులు ఇబ్బందులుపడుతున్నప్పటికీ.. వారు ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ.. ఎమ్మెల్యే ఒత్తిడి కారణంగా అధికారులు వాటిపై చర్యలు తీసుకోలేకపోతున్నారు. ఇదిలా ఉంటే కొంత మంది వీధి వ్యాపారుల యూనియన్‌ పేరుతో చిరువ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేస్తుండడం గమనార్హం. ఎమ్మెల్యే వెలగపూడి అనుచరులే ఈ దందా సాగిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

వరుసగా ఆక్రమణల తొలగింపు 
జీవీఎంసీ అధికారులు ‘రైట్‌ టు వాక్‌’పేరుతో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. ఫుట్‌పాత్‌లు, రోడ్లపై పెట్టిన బడ్డీలు, బళ్లను తొలగిస్తున్నారు. అనుమతులు ఉన్న ప్రాంతాల్లోనే వీటిని ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఆంధ్రా యూనివర్సిటీ స్థలాన్ని ఆక్రమించి వేసుకున్న షాపులను కూలి్చవేశారు. రెండు రోజులుగా ఎన్‌ఏడీ, గోపాలపట్నం ప్రాంతాలతో పాటు నగరంలో కొన్ని చోట్ల బడ్డీలను తొలగించారు. ఆదివారం రుషికొండ ప్రాంతంలో అక్రమంగా వేసిన షాపులను కూడా తీసేశారు. తూర్పు నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే అనుచరుల నుంచి షాపులను ఖాళీ చేయించి నిజమైన లబ్ధిదారులు, అనుమతులు పొందిన చిరువ్యాపారులకు కేటాయించాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే ప్రధాన జంక్షన్లలో ఉన్న అనధికార ట్రక్కులు, ఫుట్‌స్టాల్స్‌ను తొలగించి ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా చేయాలని ప్రజలు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

స్థానిక వ్యాపారులకు మొండిచెయ్యి 
నియోజకవర్గంలో వందల సంఖ్యలో ఫుడ్‌ట్రక్కులు, ఫాస్ట్‌ఫుడ్‌ బండ్లు ఉన్నప్పటికీ.. వాటిల్లో స్థానికులకు 10 శాతం కూడా లేకపోవడం గమనార్హం. కృష్ణా, ఇతర జిల్లాల నుంచి ఎమ్మెల్యే అనుచరులు వచ్చి ఇక్కడ దందా సాగిస్తుండడం గమనార్హం. స్థానిక చిరు వ్యాపారులకు అవకాశం ఇవ్వకుండా అడ్డుపడుతున్నారు. అక్రమంగా, అనధికారంగా స్థానికేతరులు చేస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని స్థానిక వ్యాపారులు అధికారులను కోరుతున్నారు. అలాగే స్థానికులకే ముందు అవకాశం కలి్పంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 

వేలాది రూపాయల అద్దెల వసూలు 
ప్రభుత్వ స్థలాలు, ఫుట్‌పాత్‌లపై అనధికారికంగా ఏర్పాటు చేస్తున్న స్టాళ్లు, బడ్డీలు, ఫుడ్‌ట్రక్కులను టీడీపీ నేతలు, ఎమ్మెల్యే అనుచరులు ఆదాయ మార్గాలుగా మార్చుకున్నారు. అనధికారికంగా చేస్తున్న వ్యాపార స్థలాలు, బళ్లను వేలాది రూపాయలకు అద్దెలకిస్తూ డబ్బులు చేసుకుంటున్నారు. ప్రాంతం, షాపును బట్టి రూ.5 వేలు నుంచి రూ.30 వేలు వరకు వసూలు చేస్తున్నారు. కొన్ని చోట్ల రోజువారి అద్దెలు పిండుకుంటున్నారు. జీవీఎంసీకి ఒక పైసా కూడా కట్టకపోగా.. నిబంధనల ప్రకారం వ్యాపారానికి తీసుకోవాల్సిన ట్రేడ్‌ లైసెన్సులు కూడా పొందడం లేదు.  

రెండో రోజు 20 బడ్డీల తొలగింపు
కొమ్మాది(భీమిలి): రుషికొండ బీచ్‌ రోడ్డులోని ఫుట్‌పాత్‌పై అనధికారికంగా ఏర్పాటు చేసిన బడ్డీల తొలగింపు రెండో రోజు సోమవారం కూడా జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్‌ అధికారులు చేపట్టారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు పెదరుషికొండ నుంచి ఐటీ జంక్షన్‌ వరకూ రోడ్డుకు ఇరువైపులా ఫుట్‌పాత్‌లపై ఉన్న 20 బడ్డీలను తొలగించారు. మొత్తం 90 బడ్డీలను తొలగించినట్టు అధికారులు తెలిపారు. విశాఖ నుంచి భీమిలి వరకు త్వరలో చేపట్టనున్న రోడ్డు విస్తరణ, సుందరీకరణ పనుల నేపథ్యంలో త్వరితగతిన ఆక్రమణలు తొలగిస్తున్నట్లు అధికారులు వివరించారు. బడ్డీల తొలగింపు విషయం ముందుగానే తెలుసుకున్న నిర్వాహకులు తమ సామాన్లను ఇంటికి తీసుకెళ్లడంతో అంతా ప్రశాంతంగా జరిగింది. పీఎంపాలెం సీఐ రవికుమార్, ఏసీపీ అరుణవళ్లీ, టీపీవోలు రఘునాథరావు, ప్రసాద్‌ల పర్యవేక్షణలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలను తొలగించారు.

చదవండి: సాక్షి ఎఫెక్ట్‌: అక్రమాల కోటలు కూలుతున్నాయ్‌..  
నేడే చూడండి.. గణబాబు ఆక్రమణ ‘చిత్రం’

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement