సాక్షి, హైదరాబాద్: లిక్కర్ సిండికేట్లు మద్యం మార్కెట్‌పై మళ్లీ పట్టు సాధించారు. బెల్టు దుకాణాల ద్వారా ఎమ్మార్పీ ధరలను ఉల్లంఘిస్తూ భారీగా దండుకుంటున్నారు. ఒక్కో మద్యం బాటిల్‌పై రూ.40 నుంచి రూ.80 వరకు అదనంగా వసూలు చేస్తూ వినియోగదారులను నిండా ముంచుతున్నారు.
సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలంలోని బెల్టు దుకాణాల్లో ఫుల్ బాటిల్‌కు ఎమ్మార్పీపై రూ. 80 అదనంగా వసూలు చేస్తుండగా.. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి, కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల్లాలోని ఏ4 దుకాణాల్లో క్వార్టర్‌కు రూ. 10, ఫుల్ బాటిల్‌కు రూ. 40 చొప్పున వసూలు చేస్తున్నట్లు ‘సాక్షి’పరిశీలనలో వెల్లడైంది.
ఆదివారం ఈ జిల్లాల్లోని 3 దుకాణాల్లో విక్రయాల తీరును ‘సాక్షి’పరిశీలించింది. మద్యం విక్రయాల రేటు 3 జిల్లాల్లో దాదాపు ఒకేలా ఉంది. బెల్టు దుకాణాలపై దాడులు జరగకుండా ఏ4 దుకాణ యజమానులే చూసుకుంటున్నారని, ఇందుకు పోలీసులకు నెలకు రూ. 20 వేలు, ఎక్సైజ్ అధికారులకు రూ. 8 వేల చొప్పన మామూళ్లు ఇస్తున్నారని తెలిసింది.
దుకాణాదారుల ‘కొత్త’ రూటు
ఎక్సైజ్ శాఖ లిక్కర్ ప్రైస్ యాప్ అమల్లోకి తెచ్చాక ఎమ్మార్పీ ఉల్లంఘనలపై భారీగా ఫిర్యాదు లొచ్చాయి. తొలిరోజుల్లో ఎౖMð్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ భారీగా దాడులు చేయడంతో దుకాణాదారులు కొత్త ఎత్తుగడ వేశారు. ఏ4 దుకాణంలో నేరుగా జరిగే విక్రయాల్లో, బెల్టు దుకాణాల ద్వారా విక్రయాలపై కేసులు పెట్టొద్దని ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది.
దీంతో బెల్టు దుకాణాలకిచ్చే ప్రతి క్వార్టర్ సీసా ఎమ్మార్పీ మీద రూ. 10, ఫుల్ బాటిల్‌పై రూ.40 అదనంగా తీసుకోవడం మొదలైంది. వారం వారం జాతర జరిగే దేవాలయాల పరిధిలోని దుకాణాల నిర్వాహకులైతే ఫుల్ బాటిల్‌కు రూ.80 అదనంగా వసూలు చేస్తున్నారు. ఇక బెల్టు దుకాణదారులు అదనపు సొమ్మకు రెట్టింపు సంఖ్యలో వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నారు.
రాష్ట్రంలో లక్షకుపైగా ‘బెల్టు’లు
రాష్ట్రవ్యాప్తంగా లక్షకు పైగా బెల్టు దుకాణాలు ఉన్నాయి. వీటి ద్వారా ఏటా రూ.16 వేల కోట్ల మద్యం వ్యాపారం సాగుతున్నట్లు అంచనా. బెల్టు దుకాణాల నిర్వాహణలో చూసి చూడనట్లుగా ఉండాలని ఎక్సైజ్ బాస్ నుంచి సంకేతాలు వెళ్లడంతో లిక్కర్ సిండికేట్లు రెచిపోతున్నారు. నేరుగా దుకాణాల్లో మద్యం తీసుకునే వినియోగదారులనూ బాదేస్తున్నారు. ప్రస్తుతం క్వార్టర్ ఎమ్మార్పీ మీద రూ. 2 అదనంగా తీసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment