సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మద్యం దుకాణాలపై లిక్కర్ సిండికేట్లు పట్టు బిగిస్తున్నారు. లాటరీలో లైసెన్స్ దక్కకపోయినా లక్షలకు లక్షలు గుడ్‌విల్ పోసి దుకాణాలు సొంతం చేసుకుంటున్నారు. లిక్కర్ విక్రయాల డిమాండ్‌ను బట్టి ఒక్కో షాపునకు కనిష్టంగా రూ.లక్ష నుంచి గరిష్టంగా రూ.కోటి వరకు గుడ్‌విల్ ఇచ్చి లీజుకు తీసుకుంటున్నారు. ఎక్సైజ్ అధికారులు సేకరించిన వివరాల ప్రకారం ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,031 మద్యం దుకాణాలు సిండికేట్ల చేతుల్లోకి వెళ్లినట్లు అంచనా. కొత్త లైసెన్స్‌దారులు సిండికేట్ల గుడ్‌విల్ ఎరకు చిక్కి దుకాణాలు అప్పగిస్తుండగా.. మరికొందరు సిండికేట్లు ఇచ్చే డబ్బులు తీసుకోవడంతోపాటు వ్యాపారంలో భాగస్వాములుగా మారుతున్నారు.
గుడ్‌విల్ పేరుతో ఎర..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎక్కువ శాతం దుకాణాలను సిండికేట్లు చేజిక్కించుకున్నారు. ఆ తర్వాత స్థానంలో రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలు ఉన్నాయి. ఆంధ్రాలో లైసెన్స్‌లు దక్కని మద్యం వ్యాపారులు ఇక్కడ పెట్టుబడి పెట్టి దుకాణాలు తీసుకున్నారు. సూర్యాపేట జిల్లాలోని 71 మద్యం దుకాణాలకుగానూ 54 మంది కొత్త వారికి లైసెన్స్ దక్కింది. వీళ్లలో దాదాపు 80 శాతం మంది సిండికేట్ల వలకు చిక్కి వ్యాపారం నుంచి తప్పుకున్నావారే. రాష్ట్రంలోనే ఎక్కువ దరఖాస్తులతో సంచలనం సృష్టించిన జాన్‌పహడ్ మద్యం దుకాణాన్ని ఆంధ్రా చెందిన ఓ సిండికేటు రూ.కోటికి సొంతం చేసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. మున గాల మండలంలోని ఓ దుకాణాన్ని రూ.63 లక్షలకు, మేళ్లచెరువులో ఓ షాపును రూ.44 లక్షలకు, గరిడేపల్లి మండ లం కీతవారిగూడెంలోని దుకాణాన్ని రూ.48 లక్షలకు, హుజూర్‌నగర్‌లోని ఓ షాపు ను రూ.40 లక్షలకు, సూర్యాపేటలో రెండు దుకాణాలకు రూ.40 లక్షలు, తుంగతుర్తి మండల కేంద్రంలోని దుకాణానికి రూ.15 లక్షలు చెల్లించి సిండికేటు గ్రూపులు వ్యాపారాన్ని సొంతం చేసుకున్నాయి.
ఏజెన్సీ దుకాణాలు అన్యాక్రాంతం..
ఏజెన్సీలోని మద్యం దుకాణాలు సిండికేట్ల చేతుల్లోనే ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో మొత్తం 109కుగాను 98 దుకాణాలకు ఎౖక్సైజ్ అధికారులు లైసెన్స్‌లు కేటాయించారు. నిబంధనల ప్రకారం ఈ దుకాణాలను గిరిజనులే నిర్వహించాలి. కానీ, వీటిలో 90 షాపులు సిండికేట్ల చేతుల్లోకి వెళ్లాయి. గిరిజన లైసెన్స్‌దారునికి రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు ఇచ్చి వ్యాపారాన్ని సొంతం చేసుకున్నారు.
ఎమ్మార్పీ ధరల ఉల్లంఘన.. : ఎమ్మార్పీ ఉల్లంఘనలపై ఎౖక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కఠినంగా ఉండటంతో సిండికేట్లు.. బెల్టు షాపులను సంపాదనా సాధనాలుగా మార్చుకుంటున్నారు. గత నెల వరకు ప్రతి క్వార్టర్‌పై రూ.2 అదనంగా వసూలు చేసిన సిండికేట్లు 10 రోజులుగా దీన్ని రూ.5కు పెంచారు. రెవెన్యూ గ్రామంలో సగటున 5, ప్రతి హాబిటేషన్ గ్రామంలో ఒకటి చొప్పున రాష్ట్రంలోని 65 వేలకుపైగా బెల్టుషాపులు ఉన్నాయి.
ఎక్సైజ్ అధికారులే మధ్యవర్తులు?
ఒకరికి వచ్చిన దుకాణాన్ని మరొకరు నడపటం ఎౖక్సైజ్ నిబంధనలకు విరుద్ధం. రూ.లక్షలు గుడ్‌విల్ ఇచ్చి లాభా లు ఆర్జించేందుకు వక్రమార్గం పడతారని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇటువంటి వాటిని స్థానిక ఎక్సైజ్ అధికారులు ఆదిలోనే గుర్తించి నివారించాలి. కానీ, కొన్ని చోట్ల వారే మధ్యవర్తిత్వం చేసి దుకాణాలు అప్పగించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment