తిరస్కరించిన అభ్యర్థులకే పోస్టింగ్ !
Published Mon, Sep 12 2016 1:07 AM | Last Updated on Mon, Sep 4 2017 1:06 PM
2013లో రిజెక్ట్ అయిన వారినే ఎంపిక చేసిన వైనం
చక్రం తిప్పిన ఓ ప్రజాప్రతినిధి
ఐటీడీఏ, గిరిజన సంక్షేమ శాఖలో గుబులు
ఏటూరునాగారం : జిల్లాస్థాయి ఎంపిక కమిటీ ఒకసారి తిరస్కరించిన అభ్యర్థులకు ఉద్యోగాలు ఎలా వచ్చాయి? అనే ప్రశ్న ఐటీడీఏ, గిరిజన సంక్షేమ శాఖను వెంటాడుతోంది. ఐటీడీఏ విద్యా విభాగంలో 10 మంది ఉపాధ్యాయుల నియామక ప్రక్రియలో అక్రమాలు జరిగాయ ని పలు సంఘాలు బాహాటంగా ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో విద్యార్థులున్నా ఉపాధ్యాయులు లేని పాఠశాలను గుర్తించి వాటిలో టీచర్ పోస్టుల భర్తీకిగానూ 2012–2013లో స్పెషల్ డీఎస్సీ నోటిఫికేషన్‌ను ఇచ్చారు. వీటికి ఎంతోమంది దరఖాస్తు చేసుకోగా పదిమందిని ట్రైబల్ విభాగం ఎంపిక చేసింది.
అనంతరం ఆ జాబితాను 2013లో జిల్లా స్థాయి కమిటీ(డీఎల్‌సీ)కి పం పించారు. కాగా, డీఎల్‌సీ సభ్యులు జాబితాను పరిశీలించారు. ఎంపికైనవారు ఉపాధ్యాయ పోస్టులకు అర్హులు కారనీ, నియామక ఉత్తర్వులను రద్దు చేస్తూ అదే ఏడాది జూలై 1న వారు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే సంబంధిత శాఖ అధికారులు రాష్ట్ర కమిటీకి ఆ జాబితాను పంపించి అక్కడి నుంచి అనుమతులు పొందాలి.కానీ మూడేళ్ల పాటు దానికి సంబంధించిన ఫైలు ఎక్కడికక్కడే నిలిచిపోయింది. ఈక్రమంలో పలువురు ఉపాధ్యాయ పోస్టుల ఆశావహులు కలిసి జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధికి ఈ వ్యవహారం గురించి విడమర్చి వివరించారు. అన్ని అర్హతలు ఉన్నా తమకు ఉద్యోగాలు ఇవ్వడం లేదంటూ గోడును వెల్లబోసుకున్నారు. స్పందించిన ఆ ప్రజాప్రతినిధి సంబంధిత శాఖకు, డీఎల్‌సీ కమిటీకి సంబంధిత ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలంటూ 652/ఎం/ఎస్టీ డెవలప్‌మెంట్ టీఅండ్‌సీ /2015 కింద నోట్ రాసి ఇచ్చారు. దాన్ని ఆధారంగా చేసుకున్న డీఎల్‌సీ సభ్యులు 2015 అక్టోబర్ 14న 2013లో మరుగున పడిన ఉపాధ్యాయ అభ్యర్థుల రెజెక్ట్ ఫైల్‌ను మళ్లీ పరిశీలించారు. సుమారు నాలుగు నెలల పాటు ఈ పరిశీలన ప్రక్రియ జరిగింది. ఎట్టకేలకు ఈ ఏడాది జనవరి 11న కలెక్టర్ తిరస్కరణకు గురైన ఆ పది మంది ఉద్యోగాల కోసం ఆమోదం తెలిపారు. ఈ మేరకు ట్రైబల్ వెల్ఫేర్ డీడీ 2016 ఆగస్టు 4న ఉత్తర్వులు జారీ చేశారు.
రూ.లక్షల్లో డీల్..
హడావుడిగా ఉద్యోగాలు భర్తీ కావడంతో అందరి కన్ను వాటిపై పడింది. ఉపాధ్యాయుల భర్తీ ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా జరిగిందంటూ పలు సంఘాల నాయకులు ఐటీడీఏ పీఓ అమయ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన పీఓ విచారణ కమిటీని నియమించారు. ఈ విచారణలో గతంలో డీఎల్‌సీ ద్వారా తిరస్కరణకు గురైన అభ్యర్థులకే మళ్లీ ఉద్యోగాలు ఇచ్చారని తేలింది. ఇద్దరు వ్యక్తుల ద్వారా ఈ అవకతవకలు జరిగాయని వెల్లడైంది. కారకులుగా గుర్తించిన డీడీ పోచం ను మాతృసంస్థకు సరెండర్ చేయగా, గిరిజన సంక్షేమ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కిరణ్‌కృష్ణారావును సస్పెండ్ చేశారు. ఆ ఉద్యోగాల భర్తీని నిలుపుదల చేస్తున్నట్లుగా పీఓ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మళ్లీ ఆయా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియ మొదటికొచ్చింది. ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించిన డీల్‌ను సంబంధిత అధికారులు రూ.లక్షలతో కుదుర్చుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. గతంలో రెజెక్ట్ అయిన ఫైల్‌ను తెరపైకి తెచ్చి, ఉత్తర్వులు జారీ అయ్యే వరకు తమదే బాధ్యత అంటూ సదరు అధికారులు అభ్యర్థులకు భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై ఐటీడీఏ పీఓ అమయ్‌కుమార్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా డీఎల్‌సీలో రెజెక్ట్ అయిన ఫైల్‌ను కావాలనే సెక్షన్‌లో పెట్టారన్నారు. కొంతమంది కావాలనే నియామక ఉత్తర్వులు రూపొందించారన్నారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు.
Advertisement
Advertisement