ప్రత్యక్ష నరకం
ప్రత్యక్ష నరకం
Published Sat, Jul 22 2017 10:23 PM | Last Updated on Sun, Apr 7 2019 3:24 PM
- బాబు పర్యటనతో ప్రయాణికులకు పాట్లు
– ఆరు గంటల పాటు బస్టాండ్‌లోనే ఆర్టీసీ బస్సులు
– అస్వస్థతకు గురైన మధుమేహం వ్యాధిగ్రస్తులు
– డెంగీ బాధితురాలికి తిప్పలు
నంద్యాల: ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లు ముఖ్యమంత్రి పర్యటన ఆర్టీసీ ప్రయాణికులకు ప్రత్యక్ష నరకాన్ని చూపించింది. ట్రాఫిక్ ఆంక్షల పేరిట పోలీసులు ఆరు గంటల పాటు బస్సుల రాకపోకలను నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. ఆరుగురు మధుమేహ వ్యాధిగ్రస్తులు అస్వస్థతకు గురి కావడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. డెంగీ బాధితురాలిని కూడా కుటుంబ సభ్యులు ప్రైవేటు వాహనంలో తరలించారు.
బొమ్మలసత్రం ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం జరుగుతుండటంతో ఏడాది నుంచి ట్రాఫిక్ మళ్లించారు. ఎస్పీజీ గ్రౌండ్, వైజంక‌్షన్, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాల మీదుగా నంద్యాల- కడప, నంద్యాల–కర్నూలు రూట్లలో బస్సులు తిరుగుతున్నాయి. అయితే.. ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగ సభను ఎస్పీజీ మైదానంలోను, వైజంక్షన్‌లో శంకుస్థాపనను, మీనాక్షి సెంటర్‌లో ఎస్సార్బీసీకి వెళ్లే రూట్‌ను ఏర్పాటు చేశారు. దీంతో పోలీసులు సీఎం హెలికాప్టర్ రాకమునుపే ఆర్టీసీ బస్టాండ్, వైజంక‌్షన్, ఎస్పీజీ గ్రౌండ్స్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, తర్వాత 2 గంటల నుంచి 3.30 వరకు ఆర్టీసీ బస్సుల రాకపోకలను సైతం నిలిపి వేశారు.
మధ్యాహ్నం ఒంటి గంట సమయంలోనూ బహిరంగ సభలో ముఖ్యమంత్రి, మంత్రులు సుదీర్ఘ ఉపన్యాసాలు చేయడంతో పోలీసులు బస్సుల రాకపోకలను కొద్దిసేపు ఆపేశారు. పైగా సభకు నంద్యాల చుట్టు పక్కల ఉన్న నియోజకవర్గాల నుంచి మహిళలను తరలించడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికులు గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వచ్చింది. చిన్నపిల్లలు, వృద్ధులు తిండి లేక ఇబ్బందులు పడ్డారు. కొందరు విద్యార్థినులు సకాలంలో ఇంటికి చేరకపోవడంతో తల్లిదండ్రులు వారికి ఆందోళనతో ఫోన్లు చేయడం కనిపించింది.
అస్వస్థతకు గురైన రోగులు
ఆర్టీసీ బస్టాండ్‌లో ఆరుగురు మధుమేహ బాధితులు సకాలంలో తిండి లేక అస్వస్థతకు గురయ్యారు. వీరికి కళ్లు తిరుగుతూ, అపస్మారక స్థితికి చేరే ముప్పు రావడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. చేశారు. డెంగీ బారిన పడి, తీవ్ర అస్వస్థతతో ఉన్న గర్భిణిని అత్యవసరంగా కర్నూలుకు తరలించడానికి కుటుంబ సభ్యులు బస్సులో కూర్చున్నారు. కానీ బస్సు కదలకపోవడంతో వారు ప్రైవేటు వాహనాన్ని ఏర్పాటు చేసుకొని వెళ్లారు. మధ్యాహ్నం 3.30 గంటలకు సీఎం బహిరంగ సభ నుంచి ఎస్సార్బీసీ కాలనీకి వెళ్లడంతో బస్సులను పంపించారు. కానీ మళ్లీ గంట సేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. కొందరు ప్రయాణికులు ఆర్టీసీ డీఎం శ్యాంసుందర్‌తో వాగ్వాదానికి దిగారు.
రోగులు నరకాన్ని చూశారు–రమేష్, మేస్త్రీ
కర్నూలు వెళ్లడానికి బస్టాండ్‌కు వచ్చా. కానీ బస్సులు నిలిచి పోవడంతో వెనక్కు వెళ్లాల్సి వచ్చింది. మధుమేహ వ్యాధి గ్రస్తులు నరకాన్ని చూశారు.
పునరావృతం కాకుండా చూడాలి–శివన్న, ప్రయాణికుడు
వ్యక్తిగత పనిపై కర్నూలుకు బయల్దేరా. కానీ గంటల తరబడి కూర్చున్నా బస్సు కదలలేదు. టికెట్ తీసుకోవడంతో వాపస్ పోవడానికి కూడా వీల్లేకుండా పోయింది. వీఐపీల పర్యటన ఉన్నప్పుడు పోలీసులు, ఆర్టీసీ అధికారులు సమన్వయంతో పని చేసి ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూడాలి.
Advertisement