cm visit
-
గుంటూరు, కర్నూలు జిల్లాల్లో సీఎం జగన్ పర్యటన
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు (గురువారం) గుంటూరు, కర్నూలు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 7.30 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి గుంటూరు జిల్లా మంగళగిరికి చేరుకుంటారు. అక్కడ సీకే కన్వెన్షన్ సెంటర్లో జరగనున్న పేర్నాటి శ్యామ్‌ప్రసాద్ రెడ్డి సోదరుడు పేర్నాటి రామలింగారెడ్డి కుమారుడు కౌశిక్ పెళ్లికి హాజరై వధూవరులను ఆశీర్వదించనున్నారు. అనంతరం అక్కడ నుంచి గన్నవరం చేరుకుని.. కర్నూలు జిల్లాకు బయలుదేరుతారు. పత్తికొండలోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లీషు మీడియం స్కూల్లో ఏర్పాటు చేసిన బహిరంగసభా వేదికపై ప్రసంగించనున్నారు. అనంతరం, వరుసగా ఐదో ఏడాది తొలివిడత వైయస్సార్ రైతుభరోసా- పీఎం కిసాన్ పథకం లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ చేసే కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. సభ అనంతరం మధ్యాహ్నం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. చదవండి:ఏపీ: బడి గంట రోజే ‘కానుక’ -
సీఎం వైఎస్ జగన్ విశాఖ పర్యటన రద్దు
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపటి(శనివారం) విశాఖపట్నం పర్యటన రద్దు అయింది. ఈ మేరకు సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. జీవీఎంసీ, వీఎంఆర్డీఏ పూర్తి చేసిన పలు అభివృద్ధి ప్రాజెక్టులను సీఎం వైఎస్ జగన్ శనివారం ప్రారంభించాల్సి ఉండగా విశాఖ పర్యటన రద్దు అయినట్లు అధికారులు తెలిపారు. -
ఉన్నత విద్యా ప్రాప్తిరస్తు
సాక్షి, విశాఖపట్నం: జగనన్న వసతి దీవెన... నవరత్నాల్లో మరో హామీ! ఇప్పటికే పాఠశాల, జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ‘అమ్మ ఒడి’ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలుచేసిన సంగతి తెలిసిందే. అదే రీతిలో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ తదితర ఉన్నత విద్యాకోర్సులు చదువుతున్నవారి కోసం ‘జగనన్న వసతిదీవెన’ కార్యక్రమానికి అంకురార్పణ చేశారు. ఉన్నత విద్యాకోర్సులు అభ్యసించే వారికి పూర్తిగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు వసతి, భోజన ఖర్చుల నిమిత్తం ఏడాదికి రూ.20 వేల చొప్పున ఇస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఈ కార్యక్రమాన్ని సోమవారం విజయనగరంలో ప్రారంభిస్తున్నారు. అయితే ఉన్నత విద్యాకోర్సుల వారే కాకుండా ఐటీఐ, పాలిటెక్నిక్ కోర్సుల విద్యార్థులకు వర్తింపజేస్తున్నారు. విశాఖ జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా సోమవారం ప్రారంభించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. తద్వారా జిల్లాలో 1,05,709 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. వారి తల్లుల బ్యాంకు ఖాతాలో రూ.99.26 కోట్లు జమ కానుంది. గ్రామం, వార్డు ఒక యూనిట్‌గా తీసుకొని అక్కడ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంతృప్తికర విధానంలో సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా వైఎస్సార్ నవశకం సర్వేను నిర్వహించిన సంగతి తెలిసిందే. రాజకీయ, వర్గ, కులమతాలకు అతీతంగా ఈ ప్రక్రియ సాగుతుందన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టమైన ఆదేశాల ప్రకారం జిల్లాలో ఆ ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి లబి్ధదారుల గుర్తింపు ప్రక్రియలో ఇదొక భాగం. గతంలో ప్రభుత్వం వద్దఉన్న డేటాబేస్‌లో తప్పుల సవరణ, మార్పులు చేర్పులు, సంక్షేమ పథకాలకు అర్హుల గుర్తింపు, ఇప్పటివరకూ పథకంలో లేనివారి పేర్ల నమోదు వంటి పనులన్నీ చేశారు. విద్యా, వసతి దీవెన కార్యక్రమం కోసం జ్ఞానభూమి వెబ్‌సైట్‌లోని విద్యార్థుల వివరాలను సర్వేకు అనుసంధానించి ఫార్మెట్ ఇచ్చారు. ప్రత్యేకంగా కార్డు ఇప్పటివరకూ రేషన్ సరుకులు తీసుకోవడానికే కాదు పింఛన్‌కు, ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యానికి, విద్యార్థుల ఉపకార వేతనాలకు, యువతకు కార్పొరేషన్ల రుణాలు పొందడానికి రేషన్‌కార్డు ఒక్కటే ఆధారమవుతోంది. అలాగాకుండా పథకానికొక కార్డు ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. బియ్యం కార్డు, వైఎస్సార్ పింఛన్ కానుక కార్డు, వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కార్డులతో పాటు జగనన్న విద్యాదీవెన/జగనన్న వసతి దీవెన కార్డు కూడా అందిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని మండలాలకు జగనన్న వసతి దీవెన కార్డులను చేరవేశారు. సోమవారం అధికారికంగా పంపిణీ ప్రారంభమవుతుంది. మంగళవారం నుంచి గ్రామ, వార్డు వలంటీర్లు లబి్ధదారుల ఇళ్లకు వెళ్లి ఈ కార్డును అందజేస్తారు. ఈ కార్డుతో పాటు ముఖ్యమంత్రి సందేశపత్రం కూడా అందిస్తారు. అంతేకాదు వసతి దీవెన నగదు అందినట్లు వారి నుంచి అకనాలెడ్జ్మెంట్ కూడా తీసుకుంటారు. 1.05 లక్షల మందికి సాయం జగనన్న విద్యాదీవెన పథకం కింద అర్హులైన విద్యార్థులకు పూర్తిగా ఫీజు రీయింబర్స్మెంట్ వర్తిస్తుంది. ఇక జగనన్న వసతిదీవెన పథకం విషయానికొస్తే ప్రతి విద్యారి్థకీ భోజనం, వసతి ఖర్చుల కోసం ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ప్రభుత్వం ఏటా రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకూ కోర్సును బట్టి అందించనుంది. ఏడాదిలో రెండు విడతలుగా ఆయా విద్యార్థుల తల్లి ఖాతాలో ఈ మొత్తాన్ని జమ చేస్తుంది. తొలి విడతలో 6,802 మంది ఐటీఐ విద్యార్థులకు రూ.5 వేల చొప్పున రూ.3.40 కోట్లు, అలాగే 12,179 మంది పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.7,500 చొప్పున రూ.9.13 కోట్లు అందనున్నాయి. ఇక జిల్లాలో డిగ్రీ, ఆపై ఉన్నత విద్యాకోర్సులు చదివే 86,728 మంది విద్యార్థులకు రూ.10 వేల చొప్పున రూ.86.73 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది. అర్హతల సడలింపు పలు సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ముఖ్యమంత్రి ఆదేశాలతో ప్రభుత్వం పలు అర్హతలను సడలించింది. జగనన్న వసతి దీవెన కార్యక్రమానికీ గతంతో పోలిస్తే మార్పులు జరిగాయి. ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీలతో పాటు విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ బోర్డు గుర్తింపు ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి కలగనుంది. ►కుటుంబ వార్షికాదాయం రూ.2.5 లక్షలకు మించకూడదు. ►పదెకరాల మాగాణి లేదా 25 ఎకరాల్లో మెట్ట భూమి ఉండవచ్చు. మాగాణి, మెట్ట భూమి కలిపి 25 ఎకరాలకు మించకూడదు. ►పారిశుద్ధ్య కారి్మకులు మినహా మరే ఒక్క కుటుంబసభ్యుడు ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ పెన్షనర్ అయి ఉండకూడదు. ►టాక్సీ, ఆటో, ట్రాక్టరు వంటివి తప్ప మరే సొంత నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు. ►కుటుంబంలో ఆదాయపన్ను చెల్లింపుదారులు ఉండకూడదు. ►పట్టణాల్లో 1500 చదరపు అడుగులకు మించి భవనం ఉండకూడదు. ఈ అర్హతల ప్రకారం సర్వేలో పరిశీలించిన తర్వాత అర్హులు, అనర్హుల జాబితాలను వేర్వేరుగా తయారుచేశారు. వాటిని గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించారు. చెప్పలేని ఆనందం మాకు ఇద్దరు పిల్లలు. అమ్మాయి అభినయ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతోంది. అబ్బాయి సంకీర్త్ ఇటీవల ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటరీ్మడియట్ పూర్తి చేశాడు. వీరిద్దరి చదువుకు శక్తికి మించి ఖర్చులు చేశా. అబ్బాయి ప్రస్తుతం డైట్లో శిక్షణ పొందుతున్నాడు. జగనన్న వసతి దీవెన వర్తిస్తుందని ఇటీవల గ్రామ సచివాలయ ఉద్యోగి ఫోన్ చేసి చెప్పినప్పుడు చాలా ఆనందపడ్డా. సీఎం వైఎస్జగన్మోహన్రెడ్డి నిజంగా విద్యాభివృద్ధికి ఎనలేని ప్రోత్సాహం అందిస్తున్నారు. గత నెలలో అమ్మఒడి పేరుతో రూ.15వేలు అందించి, ఇప్పుడు వసతి దీవెన కింద ఏడాదిలో ఐటీఐ విద్యార్థులకు రూ.10వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15వేలు, డిగ్రీ ఆపై విద్యార్థులకు రూ.20వేలు వంతున ఆర్థికంగా ఆసరా కల్పిస్తున్నారన్నారు. పేద విద్యార్థులకు ఈ పథకం ఓ వరం. –జీరు గంగాభవాని, తగరపువలస నిజమైన దీవెన మా అమ్మాయి నాగదేవి గతేడాది ఇంటర్ పూర్తి చేసింది. ఇంజినీరింగ్ చదువుతానని పట్టుబట్టింది. ఆర్థిక పరిస్థితి సహకరించక చదివించలేకపోయాను. బీఎస్సీలో జాయిన్ చేశాను. మాలాంటి వాళ్ల పిల్లలు కూడా నచ్చిన చదువులు చదివించే విధంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం చాలా గొప్పది. జగనన్న వసతి దీవెనలో మా అమ్మాయికి రూ.20 వేలు వస్తాయని తెలిసింది. ఫీజులు, ఇతర ఖర్చులకు అవి సరిపోతాయి. ఇది మాలాంటి పేదలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన వరం. ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి ఆయన. – మారిశెట్టి సూర్యవతి, కొరుప్రోలు జగనన్న ఇచ్చిన వరం మా అమ్మాయి సౌజన్య ఏజీ బీఎస్సీ హోమ్‌సైన్స్ నాలుగో ఏడాది చదువుతోంది. ‘జగనన్న వసతి దీవెన’తో మాలాంటి కుటుంబాలకు కొండంత అండ. మా పిల్లల చదువులు నిరాటంకంగా సాగుతాయి. ఫీజులకు, ఖర్చులకు కూడా కొంత వరకు ఈ నగదు ఉపయోగపడుతుంది. పేద విద్యార్థులకు ఈ పథకం ఓ వరం. సీఎం వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు. – కొమ్మన లక్ష్మి చాలా గొప్పవిషయం జగనన్న వసతి దీవెన పథకం వలన ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నెరవేర్చడం చాలా గొప్పవిషయం. విద్యార్థులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పథకాలు విద్యాభివృద్ధికి దోహదం చేస్తాయి. ఆర్థిక ఇబ్బందులు వలన ఎంతో మంది విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు. ఇలాంటి పథకం ప్రవేశపెట్టిన సీఎం వైఎస్‌జగన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. – లక్ష్మి, గొలుగొండ భారం తగ్గించారు పెందుర్తిలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాను. మాలాంటి పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఆర్థిక పరిస్థితులు అవరోధం కాకూడదని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భావించారు. పథకాలు ప్రవేశపెట్టారు. విద్యా దీవెన, వసతి దీవెనతో నా తల్లిదండ్రులకు నా చదువుభారం తీరినట్టే. థ్యాంక్స్ టు సీఎం సార్. – పి.రమణి, డిగ్రీ సెకెండ్ ఇయర్, దేవరాపల్లి రుణపడి ఉంటాం నేను ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి సంవత్సరంÆ చదువుతున్నాను. నాన్న నరసింగరావు లేబర్ పనిచేస్తూ నన్ను కష్టపడి చదివిస్తున్నారు. అమ్మ కనకమహాలక్ష్మి గృహిణి. విద్యార్థుల ఉన్నత చదువుల కోసం జగనన్న ప్రవేశపెట్టిన పథకాలు మాలాంటి వారికి చాలా మేలు చేస్తాయి. మా తల్లిదండ్రుల మీద భారాన్ని తగ్గిస్తాయి. మా చదువుకు అండగా నిలుస్తున్న సీఎం వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డికి రుణపడి ఉంటాం. – గండ్రెడ్డి తరుణ్‌కుమార్, నరవ గ్రామం -
రేపు ‘జగనన్న వసతి దీవెన’కు శ్రీకారం
సాక్షి, విజయనగరం: విజయనగరం జిల్లాలో రేపు (సోమవారం) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించనున్నారు. జిల్లా నుంచి ‘జగనన్న వసతి దీవెన’ పథకానికి ఆయన శ్రీకారం చుట్టనున్నారు. సోమవారం ఉదయం 9.10 గంటలకు తాడేపల్లి నుంచి సీఎం బయలుదేరతారు. 11 గంటలకు విజయనగరం పోలీస్ ట్రైనింగ్ కళాశాలకు చేరుకుని.. అక్కడ నుంచి విజయనగరం అయోధ్య మైదానంలో వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించనున్నారు. 11.25 నిమిషాలకు వైఎస్సార్ జగనన్న వసతి దీవెన పథకాన్ని ప్రారంభించి.. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అనంతరం అక్కడ నుంచి పోలీస్ బ్యారెక్స్ గ్రౌండ్స్‌కు చేరుకుని ‘దిశ’ పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు కార్యక్రమాలు ముగించుకుని తిరిగి హెలికాఫ్టర్‌లో విశాఖపట్నం, అక్కడి నుంచి విమానంలో గన్నవరం వెళతారు. -
సీఎం జగన్ టూర్ షెడ్యూల్ ఖరారు
సాక్షి, విజయనగరం: రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి జిల్లా పర్యటన ఖరారైంది. ఈ నెల 24వ తేదీన విజయనగరంలో ఆయన పర్యటించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం షెడ్యూల్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్న వైఎస్ఆర్ జగనన్న వసతిదీవెన పథకాన్ని విజయనగరం నుంచి లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణ కోసం కొత్తగా తీసుకువచ్చిన దిశ చట్టాన్ని పకడ్భందీగా అమలు చేస్తూ, మహిళలకు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసిన దిశ పోలీస్ స్టేషన్‌ను సీఎం ప్రారంభిస్తారు. గన్నవరం నుంచి విమానంలో విశాఖపట్నం చేరుకుని, అక్కడి నుంచి హెలికాఫ్టర్ ద్వారా విజయనగరంలోని పోలీస్ పరేడ్ మైదానానికి ఆ రోజు ఉదయం 11 గంటలకు సీఎం చేరుకుని 1గంటకు కార్యక్రమాలను ముగించుకుని తిరిగి హెలికాఫ్టర్‌లో విశాఖపట్నం, అక్కడి నుంచి విమానంలో గన్నవరం వెళతారు. ఈ మేరకు అధికార యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. హెలికాఫ్టర్ దిగి బహిరంగ సభకు చేరుకునే మార్గం పొడవునా జిల్లా ప్రజలు సీఎంకు స్వాగతం పలుకుతూ కృతజ్ఞతలు తెలపనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి జిల్లాకు వస్తున్న జగన్మోహన్రెడ్డికి కనీవినీ ఎరుగని రీతితో స్వాగతం పలికేందుకు ప్రజా ప్రతినిధులు సిద్ధమవుతున్నారు. సీఎం పర్యటన షెడ్యూల్ ఇలా: ఉదయం 11.00: విజయనగరంలోని పోలీస్ ట్రైనింగ్ కళాశాల మైదానానికి చేరుకుంటారు ఉదయం 11.02: ప్రజలు, ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు సీఎంకు స్వాగతం పలుకుతారు ఉదయం 11.03: పోలీస్ òట్రైనింగ్ కళాశాల మైదానంలోని హెలిప్యాడ్ నుంచి అయోధ్యమైదానానికి సీఎం బయలు దేరుతారు ఉదయం 11.15: అయోధ్య మైదానంలోని బహిరంగ సభకు సీఎం చేరుకుంటారు ఉదయం 11.15 నుంచి 11.25 వరకూ: అయోధ్య మైదానంలో ఎగ్జిబిషన్ స్టాళ్లను సందర్శిస్తారు ఉదయం 11.25 నుంచి మధ్యాహ్నం 12.25 వరకూ: వైఎస్ఆర్ జగనన్న వసతిదీవెన పథకం ప్రారంభిస్తారు మధ్యాహ్నం 12.25: బహిరంగ సభ ప్రాంగణం నుంచి దిశ పోలీస్ స్టేషన్‌కు బయలుదేరుతారు మధ్యాహ్నం 12.35 నుంచి 2.45 వరకూ: పోలీస్ బ్యారెక్స్ గ్రౌండ్లో దిశ పోలీస్ స్టేషన్‌ను ప్రారంభిస్తారు మధ్యాహ్నం 12.45: దిశ పోలీస్ స్టేషన్ నుంచి పోలీస్ శిక్షణ కేంద్రంలోని హెలిప్యాడ్ వద్దకు బయలుదేరుతారు మధ్యాహ్నం 12.50: పోలీస్ శిక్షణ కేంద్రంలోని హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు మధ్యాహ్నం 1.00: హెలికాఫ్టర్‌లో విశాఖపట్నం బయలుదేరుతారు -
‘21న సీఎం జగన్ ముమ్మిడివరంలో పర్యటన’
సాక్షి, తూర్పుగోదావరి: గతంలో జీఎస్పీసీ గ్యాస్ అన్వేషణ కోసం13 మాసాలు సర్వే చేయడం వల్ల ముమ్మిడివరం నియోజకవర్గంలోని 16,780 మత్స్యకార కుటుంబాలకు ఉపాధి లేకుండా పోయిందని సోమవారం మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. ఆయన జిల్లాలోని కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 21న ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముమ్మిడివరంలో పర్యటిస్తారని తెలిపారు. మట్లపాలెం, ఉప్పలంకలో మినీ ఫిషింగ్ జెట్టిల నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్ధాపన చేస్తారని పేర్కొన్నారు. సుమారు రూ.90 కోట్లు వేట నిషేధం నష్టపరిహరాన్ని మత్స్యకారులకు ఇవ్వాల్సి ఉందని వెంకటరణ తెలిపారు. ఈ విషయంలో సీఎం వైఎస్ జగన్ తక్షణమే స్పందించారని గుర్తుచేశారు. నష్టపరిహరం కోసం ఓఎన్జీసీ, కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రిని సీఎం జగన్ సంప్రదించారని పేర్కొన్నారు. సీఎం ముమ్ముడివరం పర్యటనలో ఆ నష్టపరిహరాన్ని అందిస్తారన్నారు. ఆ రోజు మత్స్యకారులకు డీజిల్ సబ్సీడి రూ.9 లకు పెంచే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. రాష్ట్రంలో 84 బంక్‌లను గుర్తించామని వెల్లడించారు. డీజిల్ కొట్టించుకున్న రోజునే స్మార్ట్ కార్డు ద్వారా సబ్సీడి వస్తుందని స్పష్టం చేశారు. డీజిల్ సబ్సీడి కోసం మత్స్యకారులు గతంలో మాదిరిగా ప్రభుత్వాలు చుట్టు తిరిగే పరిస్ధితి లేదని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం మత్స్యకారులను పట్టించుకోలేదని మంత్రి మోపిదేవి మండిపడ్డారు. -
సీకే దిన్నె పీఎస్ వద్ద ఊద్రిక్తత
-
సీఎం బందోబస్తు బాధ
చిన్నశంకరంపేట(మెదక్) : ఈ నెల 9న సీఎం కేసీఆర్ మెదక్ పట్టణానికి వస్తుండడంతో ఐదు రోజుల ముందు నుంచి పోలీస్‌లు బీట్ డ్యూటీ చేస్తున్నారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్ మెదక్ నుంచి తిరుగు ప్రయాణంలో హైదరాబాద్‌కు మెదక్–చేగుంట రహదారిపై వాహనంలో బయలుదేరనున్నారు. దీంతో ఈ రోడ్డుపై పోలీస్ భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ముందు జాగ్రత్తగా మెదక్–చేగుంట రహదారిపై ఉన్న బ్రిడ్జిల వద్ద ఇద్దరేసి పోలీస్‌లు వంతుల వారిగా 24 గంటలు బీట్ డ్యూటీ చేస్తున్నారు. చిన్నశంకరంపేట నుంచి టి.మాందాపూర్ వరకు అనేక చోట్ల బ్రిడ్జిల వద్ద పోలీస్ కాపాల ఏర్పాటు చేశారు.అసలే ఎండాకాలం...అసలే ఎండకాలం ఎర్రటి ఎండ...మరో వైపు మెదక్ రోడ్‌పై ఎక్కడా పచ్చని చెట్టు నీడ కూడలేదు. దీంతో వేసవి సూర్య ప్రతాపం 43 డిగ్రీల ఉష్ణోగ్రత మధ్య బీట్ డ్యూటీ చేస్తున్న పీసీలకు పొగలుకక్కుతున్న బీటీ రోడ్డు సెగలు కూడా తోడయ్యయి. వేసవి తాపంతో తాగేందుకు తెచ్చుకున్న చల్లటి నీరు సైతం ఎండకు వేడేక్కి దహంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. -
ప్రత్యక్ష నరకం
- బాబు పర్యటనతో ప్రయాణికులకు పాట్లు – ఆరు గంటల పాటు బస్టాండ్‌లోనే ఆర్టీసీ బస్సులు – అస్వస్థతకు గురైన మధుమేహం వ్యాధిగ్రస్తులు – డెంగీ బాధితురాలికి తిప్పలు నంద్యాల: ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లు ముఖ్యమంత్రి పర్యటన ఆర్టీసీ ప్రయాణికులకు ప్రత్యక్ష నరకాన్ని చూపించింది. ట్రాఫిక్ ఆంక్షల పేరిట పోలీసులు ఆరు గంటల పాటు బస్సుల రాకపోకలను నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. ఆరుగురు మధుమేహ వ్యాధిగ్రస్తులు అస్వస్థతకు గురి కావడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. డెంగీ బాధితురాలిని కూడా కుటుంబ సభ్యులు ప్రైవేటు వాహనంలో తరలించారు. బొమ్మలసత్రం ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం జరుగుతుండటంతో ఏడాది నుంచి ట్రాఫిక్ మళ్లించారు. ఎస్పీజీ గ్రౌండ్, వైజంక్షన్, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాల మీదుగా నంద్యాల- కడప, నంద్యాల–కర్నూలు రూట్లలో బస్సులు తిరుగుతున్నాయి. అయితే.. ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగ సభను ఎస్పీజీ మైదానంలోను, వైజంక్షన్‌లో శంకుస్థాపనను, మీనాక్షి సెంటర్లో ఎస్సార్బీసీకి వెళ్లే రూట్‌ను ఏర్పాటు చేశారు. దీంతో పోలీసులు సీఎం హెలికాప్టర్ రాకమునుపే ఆర్టీసీ బస్టాండ్, వైజంక్షన్, ఎస్పీజీ గ్రౌండ్స్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, తర్వాత 2 గంటల నుంచి 3.30 వరకు ఆర్టీసీ బస్సుల రాకపోకలను సైతం నిలిపి వేశారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలోనూ బహిరంగ సభలో ముఖ్యమంత్రి, మంత్రులు సుదీర్ఘ ఉపన్యాసాలు చేయడంతో పోలీసులు బస్సుల రాకపోకలను కొద్దిసేపు ఆపేశారు. పైగా సభకు నంద్యాల చుట్టు పక్కల ఉన్న నియోజకవర్గాల నుంచి మహిళలను తరలించడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికులు గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వచ్చింది. చిన్నపిల్లలు, వృద్ధులు తిండి లేక ఇబ్బందులు పడ్డారు. కొందరు విద్యార్థినులు సకాలంలో ఇంటికి చేరకపోవడంతో తల్లిదండ్రులు వారికి ఆందోళనతో ఫోన్లు చేయడం కనిపించింది. అస్వస్థతకు గురైన రోగులు ఆర్టీసీ బస్టాండ్‌లో ఆరుగురు మధుమేహ బాధితులు సకాలంలో తిండి లేక అస్వస్థతకు గురయ్యారు. వీరికి కళ్లు తిరుగుతూ, అపస్మారక స్థితికి చేరే ముప్పు రావడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. చేశారు. డెంగీ బారిన పడి, తీవ్ర అస్వస్థతతో ఉన్న గర్భిణిని అత్యవసరంగా కర్నూలుకు తరలించడానికి కుటుంబ సభ్యులు బస్సులో కూర్చున్నారు. కానీ బస్సు కదలకపోవడంతో వారు ప్రైవేటు వాహనాన్ని ఏర్పాటు చేసుకొని వెళ్లారు. మధ్యాహ్నం 3.30 గంటలకు సీఎం బహిరంగ సభ నుంచి ఎస్సార్బీసీ కాలనీకి వెళ్లడంతో బస్సులను పంపించారు. కానీ మళ్లీ గంట సేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. కొందరు ప్రయాణికులు ఆర్టీసీ డీఎం శ్యాంసుందర్‌తో వాగ్వాదానికి దిగారు. రోగులు నరకాన్ని చూశారు–రమేష్, మేస్త్రీ కర్నూలు వెళ్లడానికి బస్టాండ్‌కు వచ్చా. కానీ బస్సులు నిలిచి పోవడంతో వెనక్కు వెళ్లాల్సి వచ్చింది. మధుమేహ వ్యాధి గ్రస్తులు నరకాన్ని చూశారు. పునరావృతం కాకుండా చూడాలి–శివన్న, ప్రయాణికుడు వ్యక్తిగత పనిపై కర్నూలుకు బయల్దేరా. కానీ గంటల తరబడి కూర్చున్నా బస్సు కదలలేదు. టికెట్ తీసుకోవడంతో వాపస్ పోవడానికి కూడా వీల్లేకుండా పోయింది. వీఐపీల పర్యటన ఉన్నప్పుడు పోలీసులు, ఆర్టీసీ అధికారులు సమన్వయంతో పని చేసి ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూడాలి.