రుణ లీలలు | loan accounts abnormal | Sakshi
Sakshi News home page

రుణ లీలలు

Published Tue, Aug 16 2016 12:36 AM | Last Updated on Mon, Sep 4 2017 9:24 AM

వరికి ఎరువు చల్లుతున్న రైతు

వరికి ఎరువు చల్లుతున్న రైతు

రుణాల మంజూరులో పొంతన లేని లెక్కలు
తాకట్టు లేనిదే రైతులకు అందని రుణాలు 
కష్టతరమవుతున్న ఖరీఫ్‌ సాగు 
 
చిత్తూరు (అగ్రికల్చర్‌): 
ఈ ఖరీఫ్‌ సీజన్‌లో పంటల సాగుకు రైతులకు అందించాల్సిన రుణాల్లో బ్యాంకర్లు, అధికారులు కనికట్టు లెక్కలు చూపుతున్నారు. వాస్తవాల్లోకి వెళితే సన్న, చిన్నకారు, ఇదివరలో రుణాలు ఉన్న రైతులకు ఏమాత్రం పంట రుణాలు అందడం లేదు. కేవలం బంగారు తాకట్టుపైనే రుణాలను బ్యాంకర్లు అందిస్తున్నారు.  ఫలితంగా జిల్లాలోని రైతులకు ఈ ఖరీఫ్‌ సాగు కష్టతరంగా మారింది. 
 
రైతులకు పంటల సాగులో ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా బ్యాంకులు పంట రుణాలు అందిస్తాయని ప్రభుత్వం చెబుతోంది. అదేగాక ఈ ఖరీఫ్‌కు రైతులకు ఏమేరకు రుణాలు అందించాలనే లక్ష్యాలను కూడా కేటాయించినట్లు ప్రకటించింది. ఇదివరలో రుణాలు పొంది రుణమాఫీలో ఉన్న రైతులకు  కూడా తమ పాత రుణాలను రెన్యూవల్‌ చేసుకుంటే వెంటనే కొత్త రుణాలు అందించే విదంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. అయితే వాస్తవంగా సన్న, చిన్న రైతులకు పంట రుణాలు అందించిన దాఖలాలు కనిపించడం లేదు. పలుకుబడి ఉన్న మోతుబరి రైతులకు, బంగారు తాకట్టు పెట్టిన రైతులకు మాత్రమే బ్యాంకర్లు రుణాలు అందిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 
 పొంతనలేని లెక్కలు 
ప్రభుత్వం ఈ ఖరీఫ్‌ సీజన్‌కు జిల్లాలోని రైతులకు పంట రుణాలు అందిచాలని లక్ష్యాలను కేటాయించింది. అయితే కేటాయించిన లక్ష్యాలు, అందించిన రుణాలపై బ్యాంకర్లు, వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్న లెక్కల్లో ఏమాత్రం పొంతనలేదు. బ్యాంకర్లు చెబుతున్న లెక్కల ప్రకారం ప్రభుత్వం రూ.2,520 కోట్లు లక్ష్యాన్ని కేటాయించగా అందులో ఇప్పటికి రూ.1,790 కోట్ల రుణాలను రైతులకు అందించినట్లు చెబుతున్నారు. వ్యవసాయశాఖ అధికారులు రూ.1,962 కోట్ల లక్ష్యానికి గాను ఇప్పటికి రూ.1,020 కోట్ల మేరకు రుణాలు అందించినట్లు చెబుతున్నారు. దీన్నిబట్టి చూస్తే ఇంతకీ ప్రభుత్వం కేటాయించిన లక్ష్యాలు ఎంత, వాటిలో అందించిన రుణాలు ఎంత అన్నది ప్రశ్నార్ణకంగా మారింది. బ్యాంకర్లు ఇప్పటికి అందించిన రుణాలను కేవలం పలుకుబడి ఉన్న మోతుబరి రైతులకు, నగలు తాకట్టు పెట్టిన రైతులకు మాత్రం రుణాలు అందించి పంట రుణాల కింద లెక్కలు చూపుతున్నట్లు పలువురు తెలుపుతున్నారు. 
 
కష్టాల సాగు 
ఈ ఖరీఫ్‌ సీజనుకు పంటలు సాగు చేయాలంటే రైతులకు  కష్టతరంగా మారుతోంది. గత ఏడాది నవంబరులో జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో చెరువులు నీటితో నిండాయి. దీంతో దశాబ్ద కాలంగా వర్షాభావంతో పంటలు లేక విలవిల్లాడుతున్న రైతుల్లో పంటల సాగుపై ఆశలు మొలకెత్తాయి. పంటల సాగుకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా బంగారు నగలు తాకట్టుపెట్టి, ప్రై వేటు వ్యక్తుల వద్ద అధిక వడ్డీలకు అప్పులుచేసి పంటలను సాగుచేశారు. అయితే పంటలకు చీడపీడలు ఆశించడంతో వచ్చిన కాస్తా దిగుబడి అప్పులకు కూడా చాలక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి తరుణంలో ఖరీఫ్‌ సాగుకు మళ్లీ రుణాలు చేయాల్సిన దుస్థితి రైతులకు నెలకొంది. అయితే బ్యాంకర్లు మాత్రం రైతులకు తాకట్టు లేనిదే రుణాలు అందించడానికి సుముఖత చూపడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఇటు బ్యాంకు రుణాలు అందక, అటు ప్రై వేటు రుణాలు అందక పంటల సాగు రైతులకు కష్టతరంగా మారింది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement