కమీషన్లలో కాకిలెక్కలు !
► రూ.17.50 లక్షలు మింగారని ఆందోళన
► కమలాపూర్ పంచాయతీ ఎదుట మహిళల నిరసన
► రుణాలు చెల్లించబోమంటున్న సభ్యులు
ఐకేపీ కొనుగోలు కేంద్రాల కమీషన్‌పై నిర్వాహకులు కక్కుర్తిపడ్డారంటూ మహిళా సంఘాల సభ్యులు ఆందోళనకు దిగారు. అందినకాడికి దోచుకునుడే లక్ష్యంగా వచ్చినది వచ్చినట్టే మాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూ.17.50లక్షల కమీషన్ స్వాహా చేశారని.. మింగిన పైసలు చెల్లించాలని ధర్మపురి మండలం కమలాపూర్‌పంచాయతీ ఎదుట ఆ గ్రామానికి చెందిన మహిళా సంఘాల సభ్యులు గురువారం ఆందోళనకు దిగారు. వివరాలు వారి కథనం ప్రకారం. - కమలాపూర్(ధర్మపురి)
ధర్మపురి మండలం కమాలాపూర్‌లో 2011 నుంచి 2015 వరకు ఐకేపీ ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు వరికొనుగోలు కేంద్రాల నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. కొనుగోలు కేంద్రాల నిర్వహణ బాధ్యతలను సీఏలు చూశారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన వరి ధాన్యంపై వచ్చిన కమీషన్‌ను ఖర్చులు పోనూ మిగిలిన డబ్బును సంఘాల ఖాతాల్లో జమ చేయాలి. గ్రామంలో మొత్తం 34 మహిళా సంఘాలు ఉన్నాయి. 2011 నుంచి 2015 వరకు చేపట్టిన కొనుగోళ్లలో రూ.17లక్షలకు పైగా కమీషన్ రాగా ఖర్చులు పోనూ దాదాపు రూ.10 లక్షలకు పైగా అక్రమాలు జరిగాయని పేర్కొంటూ మహిళా సంఘాల సభ్యులు పంచాయతీ ఎదుట గురువారం ఆందోళనకు దిగారు. కొనుగోళ్లకు సంబంధించిన లెక్కలపై గురువారం స్థానిక పంచాయతీ కార్యాలయంలో ఒక సీఏతోపాటు నిర్వాహకులు కాకి లెక్కలు చూపించి మమా అనిపించడానికి ప్రయత్నించారని ఆరోపించారు. వారు గ్రామపంచాయతీ నుంచి నిర్వాహకురాలు ఇంటి వద్ద సమావేశం పెట్టి లెక్కలు చూశారు. కొనుగోళ్లకు సంబంధించిన రికార్డు బుక్కులను తూతూ మంత్రంగా పరిశీలించారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రూ.17.50 లక్షల కమీషన్
గతంలో చేపట్టిన మొత్తం ఏడు క్రాప్‌లలో కొనుగోళ్ల ద్వారా వచ్చిన మొత్తం కమీషన్ రూ.17.50 లక్షలు ఉంటుందని సభ్యులు తెలిపారు. ఇందులో రూ. 2.50లక్షలు నిర్వాహకుల వేతనాల కింద ఖర్చు చూ పగా.. మిగతా రూ.15 లక్షల్లో రూ.7.50 లక్షలు అనామతు ఖర్చుల కింద చూపారు. మిగిలిన మరో రూ.7.50 లక్షలకు ఎలాంటి ఖర్చులు చూపక నిర్వాహకులు మింగేశారని వారు పేర్కొంటున్నారు. ఏదేమైన కమీషన్లలో అవకతవకలు పాల్పడిన వారిపై జిల్లా అధికారులతో విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. లెక్కలు తేలే వరకు రుణాలు చెల్లించబోమని మహిళా సంఘాల సభ్యులు స్పష్టం చేశారు.