పీఏసీఎస్ ‘చైర్మన్’ కోసం లాబీయింగ్
♦ అధికార పార్టీకి అండగా రంగంలోకి ఎమ్మెల్యే తీగల
♦ చైర్మన్ పీఠంపై తమ వారికే దక్కేలా ప్రయత్నాలు
♦ పదవి కాపాడుకునేందుకు ప్రస్తుత చైర్మన్ తంటాలు
♦ రసవత్తరంగా కందుకూరు రాజకీయం
కందుకూరు: కందుకూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం(పీఏసీఎస్) చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు నోటీసులు ఇవ్వడంతో మండలంలో రాజకీయం రసవత్తరంగా మారింది. దీంతో డైరెక్టర్లను కాపాడుకోవడానికి ఇరువైపులా క్యాంపు రాజకీయాలు ఊపందుకున్నాయి. కందుకూరు పీఏసీఎస్ పరిధిలో మొత్తం 13 మంది డైరెక్టర్లు 2013 జనవరి 31న ఎన్నికయ్యారు. ఫిబ్రవరి 2న రాచులూరు డైరెక్టర్ వెదిరె నర్సింగంరెడ్డి చైర్మన్(కాంగ్రెస్)గా, గూడూరు డైరెక్టర్ సురసాని ఎల్లారెడ్డి వైస్ చైర్మన్‌గా అప్పట్లో ఎన్నికయ్యారు. అయితే, 2015 ఫిబ్రవరిలో మొదటిసారిగా కందుకూరు డైరెక్టర్ సురసాని హరికిషన్‌రెడ్డి.. చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా అప్పట్లో అది వీగిపోయింది. ప్రస్తుతం తిరిగి కందుకూరుకు చెందిన మీర్కాన్‌పేట డైరెక్టర్ సరికొండ మల్లేష్(టీఆర్‌ఎస్) పదిమంది డైరెక్టర్ల సంతకాలతో ఈ నెల 11న మరొకసారి చైర్మన్, వైస్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి డీఎల్‌ఓకు నోటీసులు అందించారు. దీంతో ఆగస్టు 2న పదకొండు గంటలకు పీఏసీఎస్ కార్యాలయంలో నిర్వహించే అవిశ్వాస తీర్మానానికి హాజరు కావాలని డైరెక్టర్ల అందరికి సంబంధిత అధికారుల నుంచి నోటీసులు జారీ అయ్యాయి. అయితే, ప్రస్తుత చైర్మన్ తన పదవిని కాపాడుకోవడానికి తనతో కలిసి ఐదుగురు డైరెక్టర్లు అవసరం ఉంది. అవిశ్వాసం నెగ్గించుకోవాలంటే 9 మంది డైరెక్టర్లు అవసరం. దీంతో ఇరువర్గాలకు చెందిన వారు క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. కాగా, గతంలో ఒకసారి అవిశ్వాసాన్ని నెగ్గించుకోలేకపోవడంతో ఈ దఫా సవాలుగా తీసుకున్న అధికార పార్టీ తమకు అనుకూలంగా ఉన్న డైరెక్టర్లతో విశాఖపట్నంలో శిబిరం నిర్వహిస్తున్నట్లు సమాచారం. రంగంలోకి దిగిన స్థానిక ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సంబంధిత డైరెక్టర్లతో గట్టి హామీ తీసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అందరి అభిప్రాయాలు తీసుకుని చైర్మన్‌గా మల్లేష్‌ను ఎన్నుకోవాల్సిందిగా సూచించినట్లు సమాచారం. అవిశ్వాస పరీక్షను నెగ్గించుకుని చైర్మన్ పదవిని ఏవిధంగానైనా అధికార పార్టీ దక్కించుకోవడానికి పావులు కదుపుతుంది. దీంతో ప్రస్తుతం ఎమ్మెల్యే సహకారంతో మల్లేష్ తమకు అవసరమైన 9 మంది డైరెక్టర్ల మద్దతు కూడగట్టుకుని ధీమాగా ఉన్నట్లు సమాచారం. అయితే, మరో పక్క అవిశ్వాసాన్ని వీగిపోయేలా చేయడానికి ప్రస్తుత చైర్మన్ నర్సింగంరెడ్డి తన ప్రయత్నాల్లో బిజిబిజీగా ఉన్నారు. తనతో కలిసి వచ్చే వారి కోసం తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిసింది. అవిశ్వాసాం వీగిపోతుందా? నెగ్గుతుందా అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది. అప్పటి వరకు ఉత్కంఠ కొనసాగనుంది.